నిజాం వారసుల సందడి
దారుషిఫా, న్యూస్‌లైన్: నిజాం కుటుంబసభ్యుల సందడితో చౌమొహల్లా ప్యాలెస్ మురిసింది. సుదీర్ఘ కాలం తరువాత 8వ నిజాం కుటుంబసభ్యులంతా ఖురాన్ గ్యాలరీని ప్రారంభించే నిమిత్తం వచ్చారు. ముఖరంజా భార్య ప్రిన్సెస్ అస్రా, ఆమె కుమారులు ప్రిన్స్ అజ్మత్‌జా, ఆజంజా, కుమార్తె షహకార్ ప్యాలెస్ మొత్తం కలియతిరిగారు.
హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలించిన కుటుంబానికి చెందిన వారు కావడంతో వారిని చూసేందుకు పలువురు తరలివచ్చారు. తమ పూర్వీకులు రాజ్యమేలిన ప్రాంతంలో సామాన్యుల మాదిరిగా వీరంతా తిరగడం ఆసక్తి కలిగించింది. నిజాం ఆస్తుల, సంస్కృతి పరిరక్షణ, తమ పూర్వీకులు వాడిన అరుదైన, అపురూపమైన సంపదను సేకరించి భవిష్యత్ తరాల కోసం భద్రపరిచే కార్యక్రమంలో భాగంగా.. శుక్రవారం ఖురాన్ గ్యాలరీని ప్రారంభించడానికి వచ్చినట్టు ప్రిన్సెస్ అస్రా తెలిపారు.
ఖురాన్ గ్యాలరీ ప్రారంభం
చౌమొహల్లా ప్యాలెస్‌లో ఖురాన్ గ్యాలరీని 8వ నిజాం, ప్రిన్స్ ముఖరంజా బహదూర్ పెద్ద కూమారుడు ప్రిన్స్ అజ్మత్‌జా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చౌమొహల్లా ప్యాలెస్‌లో ప్రపంచంలోనే అరుదైన ఖురాన్‌లను ప్రదర్శించడం విశేషమన్నారు. కుటుంబ సమేతంగా ఇక్కడకు రావడం ఆనందాన్నిస్తోందన్నారు. కాగా, గ్యాలరీలో.. ఇరాన్, ఇరాక్, ఉత్తర భారతదేశం, కాశ్మీర్ నుంచి బంగారపు పూతతో, చేతితో, సిరాతో లిఖించిన ఖురాన్‌లను ప్రదర్శనకు ఉంచారు.
కాశ్మీర్ నుంచి సేకరించిన కాగితంపై లిఖించిన ఖురాన్ చాలా పురాతనమైనది. కుఫిక్, నస్క్, నస్తాలిఖ్, ముహాఖ్ఖాక్, తులుత్ తదితర రాత శైలిలో గల అర బ్బీ ఖురాన్లు కొలువుదీరాయి. 36 రకాల ఖురాన్లు.. మూడు ఇంచుల నుంచి 10 అడుగుల సైజు గల సైజు ఖురాన్‌లను గ్యాలరీలో ఉంచారు. కార్యక్రమంలో నిజాం కుటుంబ ప్రముఖులు, చౌమహల్లా ప్యాలెస్ డెరైక్టర్ కిషన్‌రావు పాల్గొన్నారు.
సందర్శన వేళలు: ఉదయం 10-సాయంత్రం 5 గంటల వరకు
ప్రవేశ రుసుము: రూ.40