భక్తులు అంతంతమాత్రమే
వచ్చిన వారికి కూడా సౌకర్యాలు లేవు
మంగపేట, ఏటూరునాగారం: వరంగల్ జిల్లాలో గోదావరి అంత్యపుష్కరాలకు భక్తులు పెద్దగా రావడం లేదు. సోమవారం మంగపేట ఘాట్‌కు సుమారు 250 మంది వస్తే..ఏటూరునాగారం మండలం రామన్నగూడెం ఘాట్‌కు వందలోపే వచ్చారు. దేవాదాయ శాఖ కూడా ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లూ చేయలేదు. వచ్చిన భక్తులు కూడా సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.
పుష్కరస్నానాలు చేసిన మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ఏర్పాట్లు లేవు. పుష్కరస్నానం పూజలు, పిండ ప్రదానం కార్యక్రమాలను నిర్వహించేందుకు స్థానిక బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పూజారులు అందుబాటులో ఉంటున్నారు. మంగపేట ఘాట్‌కు హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి భక్తులు వచ్చారు. గోదావరి నదిలో మహిళలు పవిత్ర స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు. ఒకరికొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. పితృదేవతలకు పిండప్రదానాలను సమర్పించారు. సాయంత్రం గోదావరికి అర్చకులు హారతి ఇచ్చారు.