'తప్పు చేయలేదు.. వాళ్లు రాజీనామా చేయరు'
న్యూఢిల్లీ: తమ మంత్రులెవరూ ఏ తప్పూ చేయలేదని, ఎవరు రాజీనామా చేసే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో సోమవారం ప్రధాని మోదీ అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న విపక్ష నేతలు ఇటీవల లలిత్ మోదీ గేట్‌కు సంబంధించి వార్తల్లో నిలిచిన సుష్మా స్వరాజ్, వసుంధర రాజే, విద్యార్హతల గురించి తప్పుడు సమాచారం ఇచ్చిన స్మృతి ఇరానీలను వెంటనే రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.
లేదంటే వారిపై ప్రత్యేక దర్యాప్తు జరిపించాలన్నారు. వారు అవినీతికి పాల్పడినా ఎందుకు పట్టించుకోవడం లేదనే ప్రశ్నను లేవనెత్తారు. దీనిపై స్పందించిన వెంకయ్యనాయుడు తమ మంత్రులు ఎవరూ ఏ తప్పు చేయలేదని గట్టిగా సమర్థించారు. చట్ట విరుద్ధమైన పనులుగానీ, అవినీతికిగానీ వారు పాల్పడలేదని తెలిపారు.