నోకియా ఇంటర్నెట్ ఫోన్ @ రూ. 1,900!
ఫిబ్రవరిలో భారత్‌కు ‘నోకియా 215’ మొబైల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరో సంచలనానికి రెడీ అవుతోంది. నోకియా 215 పేరుతో 30 డాలర్లకే ఇంటర్నెట్ సౌకర్యమున్న ఫీచర్ ఫోన్‌ను రూపొందించింది. విశేషమేమంటే నోకియా నుంచి చవకైన ఇంటర్నెట్ ఫోన్ ఇదే. తొలుత ఆసియా, ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాల్లో, ఆ తర్వాత యూరప్‌లో దీనిని విడుదల చేస్తారు. భారత్‌లో ఈ మోడల్‌ను ఫిబ్రవరిలో తీసుకొస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ ఉన్నతాధికారి సోమవారం ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికి చెప్పారు. ‘‘ప్రస్తుతం ఫోన్ పనితీరును పరీక్షిస్తున్నాం.
పన్నులతో కలిపి ధర 30 డాలర్ల లోపే (సుమారు రూ.1,900) ఉంటుంది. సింగిల్, డ్యూయల్ సిమ్ వేరియంట్లలో ఇది లభిస్తుంది. టెలికం కంపెనీతో కలసి బండిల్ ఆఫర్లో ఈ మోడల్‌ను విక్రయించే అవకాశాలున్నాయి’’ అని వివరించారాయన. నాణ్యమైన, అందుబాటు ధరలో మొబైల్స్‌ను రూపొందించడంలో ప్రపంచవ్యాప్తంగా పేరున్న నోకియాను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేయటం తెలిసిందే.
ఇవీ నోకియా 215 ఫీచర్లు..
ఫేస్బుక్, మెసెంజర్, ట్విట్టర్ ఈ ఫోన్లో ఉంటాయి. వాట్సాప్ వంటి యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒపెరా మినీ, బింగ్ బ్రౌజర్లతో పాటు 2జీ, 2.4 అంగుళాల స్క్రీన్, 0.3 ఎంపీ కెమెరా, 1,100 ఎంఏహెచ్ బ్యాటరీ, 32 జీబీ వరకు ఎక్స్‌పాండబుల్ మెమరీ వంటి ఫీచర్లున్నాయి. 12.9 మిల్లీమీటర్ల మందం, 78.6 గ్రాముల బరువు ఉంటుంది.
ఇతర ఉపకరణాలతో పెయిర్ చేసే అవసరం లేకుండానే ఇందులోని స్లామ్ టెక్నాలజీతో బ్లూటూత్ ద్వారా ఫోటోలు, వీడియోలను సులభంగా పంపవచ్చు. స్టాండ్ బై టైమ్ సింగిల్ సిమ్ మోడల్ 29 రోజులు, డ్యూయల్ సిమ్ అయితే 21 రోజులు. టాక్ టైం 20 గంటల వరకు. ఎఫ్ఎం రేడియో, ఎంపీ3 ప్లేయర్లో 45-50 గంటల ప్లే బ్యాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.