‘వెండితెర సీతమ్మ’ జ్ఞాపకాలు సజీవం
పెద్దాపురం రూరల్, న్యూస్‌లైన్ : దేశం గర్వించదగ్గ నటిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న సినీనటి అంజలిదేవి మరణం ఆమె జన్మస్థలమైన పెద్దాపురం పట్టణాన్ని విషాదంలో ముంచింది. వెండితెరపై లవకుశ చిత్రంలో సీతాదేవిగా ఆమె నటనను ఎన్నటికీ మరువలేమని పలువురు పేర్కొన్నారు. పెద్దాపురం ప్లీడర్ల వీధిలోని మృదంగ విద్వాంసుడు కాళ్ల నూకయ్య సత్యవతి దంపతుల పెంపుడు కుమార్తె అంజలీదేవి. తండ్రి మార్గదర్శకత్వంలో చిన్నప్పుడే నృత్యం నేర్చుకున్న అంజలీదేవి 15 ఏళ్ల ప్రాయంలోనే నృత్య ప్రదర్శనలు, సాంఘిక నాటకాల్లో పాత్రల ద్వారా తక్కువ కాలంలోనే ప్రాచుర్యం పొందారు.
తరువాత మద్రాసు వెళ్లి చలన చిత్ర రంగంలో ప్రవేశించా రు. ప్లీడర్ల వీధిలో ఆమె బాల్యం గడచిన పెం కుటింటిని కాలక్రమం లో అమ్మేశారు. ఇప్పు డా స్థలంలో ఓ ప్రైవే టు ఆస్పత్రి నడుస్తోం ది. దస్తావేజు లేఖరి పి. బోగరాజు వీధిలోని ఉన్న ఖాళీ స్థలం అమ్మివేసి ఆ సొమ్మును అంజలీదేవి స్థానికంగా సాయిబాబా మందిరానికి విరాళం ఇచ్చారు. పెద్దాపురం పట్టణ పరిధిలోని ప్రజా నాట్యమండలి కళకారులు రాఘవ సేవా సమి తి పేరిట ప్రదర్శించిన రామ్, రహీమ్, తెలుగుతల్లి, మోడ్రన్ ఇండియా నాటకాల్లో అంజలిదేవి కథానాయకగా నటించారు.
కాకినాడ యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్ ఆమెకు తమ నాటకా ల్లో నాయిక పాత్రలు ఇచ్చి ఆదరించింది. పెద్దాపురం శివాలయం వీధికి చెందిన గురుమూర్తి అప్పారావు ప్రోత్సాహం, సంగీత దర్శకుడు ఆదినారాయణరావు సహకారంతో ఆమె సినీరంగ ప్రవేశం చేశారు. ముప్పన వారి కుటుంబంతో అంజలీదేవికి సాన్నిహిత్యం ఉండేది. 1960లో అప్పటి మున్సిపల్ చైర్మన్ ముప్పన రామారావు ఆధ్వర్యంలో పెద్దాపురంలో అంజలిదేవికి పౌర సన్మానంచేశారు.