నగదు కష్టాలకు చంద్రబాబే బాధ్యుడు
ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి
కూడేరు : పెద్ద నోట్ల రద్దుతో నగదు కోసం పింఛన్దారులు, సామాన్య ప్రజానీకం పడుతున్న కష్టాలకు, ఇబ్బందులకు బాధ్యుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేనని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం కూడేరు మండలం ఉదిరిపికొండ తండాలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తాను మోదీకి లేఖ రాయడం వల్లే పెద్ద నోట్లు రద్దు జరిగిందని బాబు మొదట్లో గొప్పలు చెప్పుకొచ్చారన్నారు. కానీ చిల్లర నోట్లు ప్రజలకు అందుబాటులోకి రాకపోవడంతో రైతులు, కూలీలు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వద్ద మెప్పు పొందేందుకే పింఛన్ నగదును బ్యాంకుల్లోకి జమ చేసి పండుటాకులకు, వికలాంగులకు నరకం చూపిస్తున్నారని సీఎంపై ధ్వజమెత్తారు. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ నెపాన్ని బ్యాంకర్లపై నెట్టి ఆగ్రహం వ్యక్తం చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. నగదు రహిత లావాదేవీల కోసం ప్రజలకు, ఉద్యోగస్తులకు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాడని మండిపడ్డారు. విద్యావంతులే డిజిటల్ పద్ధతిని పాటించలేకపోతే గ్రామీణ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమవుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి విరివిగా కొత్త రూ.500 నోట్లను, చిల్లర నోట్లను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.