Ind Vs SL: చెలరేగిన భారత బౌలర్లు.. లంక బ్యాటర్లు విలవిల! స్కోరు?
India vs Sri Lanka, 2nd ODI: శ్రీలంకతో రెండో వన్డేలో భారత బౌలర్లు విశ్వరూపం ప్రదర్శించారు. దీంతో కోల్‌కతాలో పర్యాటక లంక 215 పరుగులకే ఆలౌట్ అయింది. ఈడెన్ గార్డెన్స్‌లో గురువారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో మహ్మద్ షమీ బౌలింగ్ ఎటాక్ ఆరంభించగా.. ఆరో ఓవర్ ఆఖరి బంతికి సిరాజ్ అవిష్క ఫెర్నాండోను బౌల్డ్ చేశాడు.
దీంతో 29 పరుగుల వద్ద ఓపెనర్ రూపంలో తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంకను అరంగేట్ర బ్యాటర్ నువానీడు ఫెర్నాండో ఆదుకున్నాడు. కుశాల్ మెండిస్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే, జట్టులో రీ ఎంట్రీ ఇచ్చిన భారత చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఈ జోడీని విడగొట్టాడు.
పాపం నువానీడు!
17వ ఓవర్ చివరి బంతికి మెండిస్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఇలా 102 పరుగుల వద్ద లంక రెండో వికెట్ కోల్పోయింది. ఆ మరుసటి ఓవర్లోనే అక్షర్.. ధనంజయ డిసిల్వను బౌల్డ్ చేయగా.. డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో అర్ధ శతకం పూర్తి చేసుకున్న నువానీడు అక్షర్ బౌలింగ్‌లో అసలంక తప్పిదం కారణంగా రనౌట్ కావడంతో లంక బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది.
ఇక తొలి వన్డేలో సెంచరీతో చెలరేగిన లంక కెప్టెన్ దసున్ షనక కుల్దీప్ బౌలింగ్(22.5)లో 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బౌల్డ్ అయ్యాడు. అసలంకను సైతం కుల్దీపే పెవిలియన్‌కు పంపాడు. ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో హసరంగ ఏడో వికెట్‌గా వెనుదిరగగా.. క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించిన కరుణరత్నెను ఉమ్రాన్ మాలిక్ అవుట్ చేశాడు.
అదరగొట్టేశారు
ఆఖర్లో దునిత్ వెల్లలగె(32) కాసేపు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. అతడిని అవుట్ చేసిన సిరాజ్.. లాహిర్ కుమారను కూడా పెవిలియన్‌కు పంపడంతో లంక ఇన్నింగ్స్‌కు తెరపడింది. నిర్ణీత 39.4 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్‌కు మూడు, అక్షర్ పటేల్‌కు ఒకటి, పేసర్లు సిరాజ్‌కు మూడు, ఉమ్రాన్‌కు రెండు వికెట్లు దక్కాయి.
చదవండి: IND vs SL: లంక యువ సంచలనం.. అరంగేట్రంలోనే అదుర్స్! కానీ పాపం..
క్రికెట్ ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం.. సిరీస్ బహిష్కరణ