గవర్నర్ కోసం ఎదురుచూపు
► 9న ప్రమాణస్వీకారానికి సన్నాహాలు
► ఏ పదవీ వద్దంటున్న పన్నీర్‌సెల్వం
► ఆరుగురు మంత్రులకు ఉద్వాసన?
అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన శశికళ రాష్ట్ర గవర్నర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఢిల్లీలో ఉన్న గవర్నర్ విద్యాసాగర్‌రావు చెన్నైకి చేరుకోగానే ఆయన్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే పార్టీ, ప్రభుత్వంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీఎంగా పన్నీర్‌సెల్వం, ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకాలు జయ మృతి చెందిన తరువాత కేవలం 20 రోజుల్లోనే జరిగిపోయాయి. ఇంతలోనే అన్నాడీఎంకే శాసనసభా పక్షనేతగా శశికళ ఎన్నికయ్యారు. సీఎం కుర్చీలో పన్నీర్‌సెల్వం సర్దుకునేలోగా పదవీచ్యుతులయ్యారు. శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన శశికళ పార్టీ తీర్మాన పత్రాన్ని గవర్నర్‌కు సమర్పించి, ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిని కోరాల్సి ఉం ది. శశికళ ఎంపిక కాగానే పిలుపు రావడంతో గవర్నర్ ఢిల్లీ వెళ్లారు. ఈ నెల 9వ తేదీన పదవీ ప్రమాణ స్వీకారం చేసేలా శశికళ సిద్ధమవుతున్నా రు. ఢిల్లీ నుంచి గవర్నర్ రాగానే కలిసేందుకు శశికళ సిద్ధంగా ఉన్నారు.
పన్నీర్‌సెల్వం మనస్తాపం
సీఎంగా శశికళ బాధ్యతలు చేపట్టగానే మంత్రి వర్గంలో మార్పులు చోటుచేసుకోవడం అనివార్యమని తెలుస్తోంది. సీఎం పదవికి పన్నీర్‌సెల్వం రాజీనామాను గవర్నర్ ఆమోదిస్తూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకు కొనసాగాల్సిందిగా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం కుర్చీలో శశికళ కూర్చోవడంపై పన్నీర్‌సెల్వం ప్రాతినిధ్యం వహిస్తున్న తేని జిల్లా పోడి నియోజకవర్గంలో ప్రజలు శశికళపై ఆగ్రహం వ్యక్త చేస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇదిలా ఉండగా సీఎం పదవిని కోల్పోయిన పన్నీర్‌సెల్వం తీవ్ర మనస్తాపంలో ఉన్నారు. సన్నిహితులతో బాధను పంచుకుంటూ తాను రాజకీయాల నుంచి తప్పుకోనున్నట్లు తెలిపారు. ఈ సమాచారాన్ని అందుకున్న శశికళ కంగారు పడ్డారు.
పన్నీర్‌సెల్వం అస్త్రసన్యాసానికి దిగితే ప్రజల్లోనూ, పార్టీలోనూ తనపై తీవ్ర వ్యతిరేకత వస్తుందని భయపడి పన్నీర్‌సెల్వంను బుజ్జగించే పనిలో పడ్డారు. పన్నీర్‌సెల్వంకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇస్తున్నట్లు సమాచారం పంపారు. అయితే శశికళ నేతృత్వంలోని ప్రభుత్వంలో తనకు ఏ పదవి ఇచ్చినా తీసుకునేది లేదని పన్నీర్‌సెల్వం భీష్మించుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ అందరూ ఖాయమని భావిస్తున్న తరుణంలో బెర్తు కోసం సెంగోట్టయ్యన్, రంగస్వామి, సెంథిల్ బాలాజీ సహా పలువురు ఎమ్మెల్యేలు పడరాని పాట్లు పడుతున్నారు.
నియోజకవర్గాల వేట
ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన ఆరు నెలల్లోగా శశికళ ఎమ్మెల్యేగా గెలుపొందాల్సి ఉండగా నియోజకవర్గ వేటలో పడ్డారు. జయలలిత ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నై ఆర్కేనగర్లో శశికళపై తీవ్ర వ్యతిరేకత ఉంది. పైగా ఆర్కేనగర్ నుంచి జయ మేనకోడలు దీప పోటీకి దిగే అవకాశాలు ఉన్నాయి. ఈ కారణంగా దక్షిణ తమిళనాడులోని సురక్షితమైన నియోజకవర్గాలను శశికళ అన్వేషిస్తున్నారు. ఆండిపట్టి లేదా ఉసిలంబట్టి నియోజకవర్గాలను ఆమె పరిశీలిస్తున్నారు.
పోయెస్‌గార్డెన్ కు సీఎం కళ
జయలలిత మరణం తరువాత పోయెస్ గార్డెన్ లోని ఆమె నివాసం వద్ద పోలీసు బందోబస్తును దాదాపుగా తగ్గించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తరువాత మరికొంత పెంచారు. శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన రెండు రోజుల్లో శశికళ సీఎం కాబోతున్న తరుణంలో సోమవారం మళ్లీ బందోబస్తును పెంచారు. బందోబస్తులో ఉన్న పోలీసులతో గార్డెన్ కు మళ్లీ సీఎం కళ వచ్చింది. గార్డెన్ ఇంటికి 500 మీటర్ల దూరంలోనే ప్రజలను పోలీసులు కట్టడి చేయడం ప్రారంభించారు.