క్లాస్ రూంలో ఉపాధ్యాయుడి వికృత చేష్టలు
బ్రసెల్స్: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు వికృత చేష్టలకు పాల్పడ్డాడు. చిన్నారులకు మహమ్మద్ ప్రవక్త నగ్న కార్టూన్ని చూపించడంతో సస్పెండ్ అయ్యాడు. వివరాలు.. బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లోని మోలెన్బీక్లోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఒకరు పదేళ్లలోపు చిన్నారులకు మహ్మద్ ప్రవక్త నగ్న కార్టూన్ని చూపించాడని తెలిసింది. సివిక్ స్పిరిట్ క్లాస్‌లో భాగంగా ఉపాధ్యాయుడు ఐదవ తరగతి విద్యార్థులకు కార్టూనిస్ట్ కోకో గీసిన మోకాళ్లపై నగ్నంగా ఉన్న మహమ్మద్ ప్రవక్త కార్టూన్ని చూపించాడు. ఇంటికి వచ్చిన పిల్లలు తరగతి గదిలో జరిగిన సంఘటన గురించి తల్లిదండ్రులకు చెప్పడంతో ఇది వెలుగులోకి వచ్చింది. వారి ఫిర్యాదు మేరకు సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మోలెన్‌బీక్ మేయర్ కేథరీన్ మౌరెక్స్ తెలిపారు. ‘చిన్నారులకు అశ్లీల ఫోటోలను చూపిండం నేరం. పైగా సదరు ఉపాధ్యాయుడి మహమ్మద్ ప్రవక్త వ్యంగ్య చిత్రాలను చూపించాడు. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. అందుకే అతడి మీద చర్యలు తీసుకున్నాం’ అని కేథరీన్ తెలిపారు. (చదవండి: ప్రధానికి వీపు చూపిస్తూ వైద్యుల నిరసన)
ఉపాధ్యాయుని సస్పెన్షన్‌పై ఫ్రాంకోఫోన్ లిబరల్ పార్టీ ఎంఆర్ అధ్యక్షుడు జార్జెస్-లూయిస్ బౌచెజ్ స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్లో "ఈ సమాచారం ఖచ్చితమైనది కాదని నేను నమ్ముతున్నాను, అది నిజమైతే, అది ఆమోదయోగ్యం కాదు, అసహనంగా ఉంటుంది. భావ ప్రకటనా స్వేచ్ఛ చర్చించలేనిది" అంటూ ట్వీట్ చేశారు. మౌరిక్స్ ఈ ట్వీట్‌కు సమాధానమిస్తూ..‘ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నారులకు అశ్లీల చిత్రాలు చూపించరాదని, ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవడానికి ఇదే కారణమని’ హామీ ఇచ్చారు.