అనతం శోకం
ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
అంతిమ సంస్కారాలు నిర్వహించిన కుమారుడు శరత్
ప్రముఖుల నివాళి
బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్న ఆకతాయిలు
ఈ దుశ్చర్యపై సర్వత్రా నిరసన
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కన్నడ సాహితీ దిగ్గజం, జ్ఞాన పీఠ్ ఆవార్డు గ్రహీత ప్రొఫెసర్ ఉడిపి రాజగోపాలాచార్య అనంతమూర్తికి శనివారం సాయంత్రం ఇక్కడ బెంగళూరు విశ్వ విద్యాలయం ఆవరణలోని కళా గ్రామలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. కుమారుడు శరత్ అంత్య సంస్కారాలను పూర్తి చేయడంతో పాటు చితికి నిప్పు పెట్టారు.
అంతిమ యాత్రలో అనంతమూర్తి సతీమణి ఎస్తర్ సహా కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కన్నడ, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి ఉమాశ్రీ సహా ఇతర మంత్రి వర్గ సహచరులు, సాహితీవేత్తలు, అభిమానులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అంతకు ముందు ఇక్కడి డాలర్స్ కాలనీలోని అనంతమూర్తి నివాసం ‘సురగి’లో రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పార్థివ శరీరాన్ని దర్శించుకున్నారు.
ఆ అక్షర యోధునితో తమ సాన్నిహిత్యాన్ని నెమరు వేసుకుని కంట తడి పెట్టారు. వివిధ అవయవాల వైఫల్యంతో పాటు గుండె పోటు రావడంతో శుక్రవారం సాయంత్రం అనంతమూర్తి ఇక్కడి మణిపాల్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే.
విప్లవ కవి
మూఢాచారాలకు వ్యతిరేకంగా కలం, గళం విప్పిన అనంతమూర్తి విప్లవ కవి అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అభివర్ణించారు. రవీంద్ర కళా క్షేత్రలో పార్థివ శరీరాన్ని దర్శించుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సామాజిక, న్యాయపరమైన అంశాల్లో ఆయన ప్రజల తరఫున పోరాడారని, ఈ విషయంలో ఎప్పుడూ వెనకడుగు వేయలేదని కొనియాడారు. ఎన్నో వివాదాలు చోటు చేసుకున్నప్పటికీ, తన విధానాన్ని విడనాడలేదని శ్లాఘించారు. 40 ఏళ్లుగా తనకు ఆయనతో స్నేహ సంబంధాలున్నాయని గుర్తు చేసుకున్నారు. తనకు మార్గదర్శకుడుగా కూడా వ్యవహరించారని తెలిపారు. ఆయన మరణంతో కన్నడ సారస్వత లోకానికి తీరని నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆకతాయిల దుశ్చర్య
అనంతమూర్తి మరణించారని తెలియడంతో మంగళూరు, పరిసరాల్లో కొందరు ఆకతాయిలు బాణాసంచా పేల్చి, సంబరాలు జరుపుకోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. ఇది ఆకతాయిల దుశ్చర్య అని కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం కృష్ణ సహా పలువురు ఖండించారు. రవీంద్ర కళా క్షేత్రలో అనంతమూర్తిని అంతిమ దర్శనం చేసుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మరణానికి సంతాపం వ్యక్తం చేయడం మన సంస్కృతి అంటూ, సంబరాలు చేసుకోవడం ద్వారా కొందరు తమ వికృత మనస్తత్వాన్ని బహిరంగ పరచుకున్నారని దుయ్యబట్టారు. మాజీ గవర్నర్ రమా జోయిస్ మాట్లాడుతూ టపాకాయలు పేల్చడం క్షంతవ్యం కాదని అన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్ అశోక్, అభిప్రాయ భేదాలు సైతం సైద్ధాంతికంగా ఉండాలని పేర్కొన్నారు. టపాకాయలు పేల్చిన ఆకతాయిలను పట్టుకుని దండించాలని సూచించారు.