'సింగపూర్ తరహాలోనే ఇక్కడ ఏదైనా సాధిస్తాం'
న్యూఢిల్లీ: ప్రయోగాత్మకంగా ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సరి-బేసి విధానం శుక్రవారం రాత్రితో ముగిసింది. కాలుష్యాన్ని నియంత్రించడంలో భాగంగా జనవరి 1నుంచి 15 తేదీల మధ్య కొత్త ట్రాఫిక్ విధానాన్ని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో తీసుకొచ్చిన విషయం విదితమే. తాము ప్రవేశపెట్టిన సరి-బేసి విధానం సక్సెస్ అయిందన్నారు.
న్యూఢిల్లీలో నూతన ట్రాఫిక్ విధానం వల్ల 20-25 శాతం మధ్య కాలుష్యం తగ్గిందని సీఎం ఈ సందర్భంగా తెలిపారు. అయినప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన లెవల్స్ కంటే ఇంకా ఆరు రెట్లు(పీఎమ్ 2.5) కాలుష్యం ఉందన్న విషయాన్ని గమనించాలంటూ... న్యూఢిల్లీ నగరాన్ని కేజ్రీవాల్ సింగపూర్ తో సరిపోల్చారు. సింగపూర్ విధానాన్ని చూసి మెచ్చుకున్న వాళ్లు ఇప్పుడు ఢిల్లీలోనూ సరి-బేసి సక్సెస్ను గమనిస్తే.. ఇక్కడ కూడా ఏదైనా సాధించవచ్చు అని నిరూపితం అయిందని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
కాలుష్యం తగ్గిందా అంటే.. ఖచ్చితంగా తగ్గిందని చెప్పవచ్చన్నారు. గతంలో నాలుగు గంటల్లో చేరుకునే గమ్యానికి నూతన ట్రాఫిక్ రూల్స్ సహకారంతో కేవలం రెండు గంటల్లోనే చేరుకున్నారని చెప్పారు. 'ఢిల్లీ ప్రజల్ని చూసి గర్వపడుతున్నాను. మీరు నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారు. మనం అందరం కలిస్తే ఏదైనా సాధించగలం. 'సరి-బేసి' మొదటి విడత ముగిసింది. ఈ విధానంలో మరిన్ని మార్పులు తీసుకొద్దాం' అని కేజ్రీవాల్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆప్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన నాయకురాలు షాజియా ఇల్మి ఢిల్లీలోని సరి-బేసి విధానాన్ని మెచ్చుకోవడం తన నమ్మకాన్ని మరింత పెంచిందని కేజ్రీవాల్ వివరించారు.
Proud of u Delhi. U give me confidence "Together, we can achieve anything." 1st phase of Odd Even ends today. Will do again in improved form
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 15, 2016