ఇది ఆదర్శవంతమైన అత్త కథ
భువనేశ్వర్ : ఈ రోజుల్లో అత్తాకోడళ్లు ఎప్పుడూ పాము ముంగీసల్లా కలహించుకుంటూ కాలం వెళ్లదీస్తుంటారు. అత్త వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డ కోడళ్లు చాలా మంది ఉన్నారు. ఒక కుటుంబంలో అత్తా కోడళ్ల మధ్య కలహాలు పక్కింట ముచ్చటగా మారడం సర్వసాధారణంగా కనబడుతోంది. తానూ ఒకప్పుడు కోడలినే అన్న విషయం మరిచి అందరిని వదులుకొని వచ్చిన ఓ ఇంటి ఆడపిల్లను కనికరం లేకుండా కష్ట పెడుతుంటారు అత్తలు. అత్తలు అంటే ఇలానే హింసిస్తారు అనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఏర్పడింది. కానీ ఆ అభిప్రాయానికి చరమగీతం పాడుతూ... అత్తలో కూడా అమ్మ దాగి ఉంటుందని నిరూపించింది ఓ మహిళ. తల్లిలా మారి వితంతు కోడలికి మరో పెళ్లి చేసి అత్తలకు ఆదర్శంగా నిలిచింది. తన కుమారుడి అకాల మరణంతో ఒంటరిగా మారిన కోడలికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. పుట్టెడు దుఃఖంలోనూ ఓ ఇంటి ఆడపిల్ల గురించి పెద్ద మనసుతో ఆలోచించి నలుగురికి ఆదర్శంగా నిలిచారు ఒడిశాలోని అంగుల్ జిల్లా గోబరా గ్రామానికి చెందిన ప్రతిమా బెహరా. ఆమె ఆ గ్రామానికి ఒకప్పటి సర్పంచు కూడా.
ఫిబ్రవరిలో పెళ్లి.. జూలైలో మృతి
ప్రతిమ పెద్దకొడుకు రష్మీరంజన్, తురంగ గ్రామానికి చెందిన లిల్లీ బెహర్కు గత ఫిబ్రవరిలో అంగరంగా వైభవంగా వివాహం జరిగింది. కూతురిని సంతోషంగా అత్తింటికి పంపించారు లిల్లీ తల్లిదండ్రులు. తనకు మంచి భర్త దొరికాడని లిల్లి.. అందమైన భార్య దొరికిందని రష్మిరంజన్ ఆనందంగా తమ వైవివాహిక జీవితాన్ని గడుపుతున్నారు. ఇంతలోనే విధి వారి దాంపత్యాన్ని చూసి ఓర్వలేకపోయింది. పెళ్లయిన అయిదు నెలల్లోనే వారి ఆనందాలను బొగ్గు గని మింగేసింది. గత జూలైలో బొగ్గు గని ప్రమాదంలో రష్మిరంజన్ మృతి చెందాడు. దీంతో ప్రతిమ ఇంట విషాద ఛాయలు అలముకున్నాయి. చెట్టంత కొడుకు పోయాడని ప్రతిమ.. భర్త ఇక లేడు అన్న విషయం లిల్లీ జీర్ణించుకోలేకపోయారు.
కనీసం కోడలు జీవితం అయినా బాగుండాలని..
పోయిన కొడుకు ఎలాగో తిరిగి రాలేదు.. కనీసం తన కోడలి జీవితం అయినా బాగు చేయాలని ఆలోచించుకుంది ప్రతిమ. ఎవరు ఏమైనా అనుకున్న సరే తన కోడలికి మరో పెళ్లి చేయాలని నిర్ణయించుకుంది. తన బంధువు కొడుకు సంగ్రామ్ బెహరాకు లిల్లీని ఇచ్చి వివాహం చేస్తానని, ఇందుకు ఒప్పకోవాల్సిందిగా ఆయన తల్లిదండ్రులను కోరింది. దీనికి సంగ్రామ్తో పాటు ఆయన తల్లిదండ్రులు కూడా ఓకే చెప్పారు. దీంతో వితంతువైన లిల్లీ పెళ్లిని ఈ నెల11న ఓ దేవాలయంలో ఘనంగా చేశారు. లిల్లీకి తల్లిగా మారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ పెళ్లి చేశారు ప్రతిమ.
‘నా కొడుకు ఎలాగో తిరిగిరాడనే విషయం నాకు తెలుసు. నా కొడుకు లేని లోటును ఎవరూ తీర్చలేరు. ఈ కష్టాన్ని నా కోడలు పడొద్దు. తనకు ఇప్పుడు కేవలం 20 ఏళ్లే. ఒంటరిగా ఎన్ని ఏళ్లు అని జీవిస్తుంది. తన జీవితం అయినా బాగుండాలి అని మరో పెళ్లి చేశాను. తన జీవితం ఆనందంగా సాగాలని కోరుకుంటున్నాను’ అని ప్రతిమా పేర్కొంది. కాగా ప్రతిమా చేసిన పనికి సామాజిక కార్యకర్త సుభాశ్రీ దాస్తో పాటు మరో పలువురు ప్రశంసిస్తున్నారు. అమ్మలా మారి అత్తలకు ఆదర్శంగా నిలిచిందని ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.