ముగ్గురు టీచర్ల డిస్మిస్
సాక్షి, సంగారెడ్డి: నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు సృష్టించి ఉద్యోగాలు పొందిన ముగ్గురు ఉపాధ్యాయులపై వేటు పడింది. మరో ఐదుగురు ఉపాధ్యాయులపై విచారణ కొనసాగుతోంది. కాగా బోగస్ విద్యార్హత పత్రాలు సమర్పించినట్టు ముగ్గురు ఆఫీస్ సబార్డినేట్లపై వచ్చిన ఆరోపణలపై విచారణ పూర్తి కాగా వారిని కూడా త్వరలో ఉద్యోగాల నుంచి తొలగించే అవకాశం ఉంది.బోగస్ ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలతో ఎనిమిది మంది ఉపాధ్యాయులుగా చేరారని బంజారా సేవాలాల్ సంఘం అధ్యక్షుడు రమేశ్ చౌహాన్ రెండేళ్ల కిందట అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై జిల్లా స్థాయి పరిశీల న కమిటీ విచారణ జరిపింది. పెద్దశంకరంపేట మండలం ఉత్లూరు ప్రాథమికోన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ వై.విజయలక్ష్మి, నారాయణఖేడ్ మండలం శివారు సందు తండా ప్రాథమిక పాఠశాల ఎస్జీటీ డి.జ్యోతి, మనూ రు మండలం కేశ్వార్ ప్రాథమిక పాఠశాల ఎస్జీటీ ఆర్.మశ్చేందర్లు సమర్పించిన కుల ధ్రువీకరణ పత్రాలు బోగస్ అని విచారణలో వెల్లడైంది. ఆ కమిటీ నివేదిక ఆధారంగా సద రు కుల ధ్రువీకరణ పత్రాలను కలెక్టర్ రెండు నెలల క్రితమే రద్దు చేశారు. తదుపరి చర్యల్లో భాగంగా ఆ ముగ్గురు ఉపాధ్యాయులను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ డీఈఓ నాలుగు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులను ఎంఈఓల ద్వారా సదరు ఉపాధ్యాయుల చేతికి అందజేయడంతో వారు ఉద్యోగాల నుంచి తప్పుకున్నారు.
మిగతా ఐదుగురిపై విచారణ..
మిగిలిన ఐదుగురు ఉపాధ్యాయులు లంబాడ కులానికి చెందినప్పటికీ వారు మహారాష్ట్ర, కర్ణాటకలకు చెందినవారు. మహారాష్ట్రలో బం జార కులం బీసీ కేటగిరీ, కరా్ణాటకలో లంబా డ కులం ఎస్సీ కేటగిరీల కిందకు వస్తాయి. దీంతో ఈ ఐదుగురి భవితవ్యంపై నిర్ణయం తీసుకోవడానికి జిల్లా యంత్రాంగం వెనుకడుగు వేస్తోంది.
ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ (ఎస్టీ రిజర్వుడు) నియోజకవర్గం నుంచి గెలుపొందిన టీడీపీ ఎమ్మెల్యే సుమన్ రాథోడ్ సైతం ఇదే తరహా సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆమెపై దాఖలైన కేసును విచారించిన హైకోర్టు సుమన్ రాథోడ్ ఎస్టీ కాదని తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఎమ్మెల్యే కేసు విషయంలో కోర్టు తుది తీర్పుకు లోబడి ఈ ఐదుగురు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులు యోచిస్తున్నారు.
ముగ్గురు సబార్డినేట్లపై కూడా...
కారుణ్య నియామకాల కింద బోగస్ విద్యార్హత పత్రాలతో ఆఫీస్ సబార్డినేట్లుగా ఉద్యోగాలు పొందిన ముగ్గురిపై కూడా త్వరలో వేటు పడనుంది. వీరిలో ఇద్దరు విద్యాశాఖలో, మరొకరు ఆర్అండ్బీలో పనిచేస్తున్నారు. ఏడోతరగతి చదవకపోయినా చదివినట్టు పత్రాలు సృష్టించి ఉద్యోగాలు పొందినట్టు జోగిపేట డిప్యూటీ ఈఓ విచారణలో తేలింది. వీరిని సైతం త్వరలో తొలగించనున్నట్టు అధికారులు చెబుతున్నారు.