Oil tanks
-
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం
కీవ్: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం. దాదాపు నెల రోజుల యుద్ధంలో ప్రధానంగా ఆత్మరక్షణకే పరిమితమైన ఉక్రెయిన్ తాజాగా రష్యా దళాలపై ఎదురుదాడికి దిగుతోంది! మంగళవారం హోరాహోరీ పోరులో రాజధాని కీవ్ శివార్లలో వ్యూహాత్మకంగా కీలకమైన మకరీవ్ నుంచి రష్యా సేనలను వెనక్కు తరిమి దాన్ని స్వాధీనం చేసుకుంది. దీంతో కీలకమైన స్థానిక హైవేపై ఉక్రెయిన్ సైన్యానికి తిరిగి పట్టు చిక్కింది. వాయవ్య దిక్కు నుంచి కీవ్‌ను చుట్టముట్టకుండా రష్యా సైన్యాన్ని అడ్డుకునే వెసులుబాటు కూడా దొరికింది. అయితే బుచా, హోస్టొమెల్, ఇర్పిన్ తదితర శివారు ప్రాంతాలను మాత్రం రష్యా సైన్యం కొంతమేరకు ఆక్రమించగలిగిందని ఉక్రెయిన్ రక్షణ శాఖ పేర్కొంది. ఎలాగోలా కీవ్‌ను చేజిక్కించుకునేందుకు యుద్ధం మొదలైనప్పటి నుంచీ రష్యా విశ్వప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం కూడా బాంబు, క్షిపణి దాడులతో కీవ్, శివార్లు, పరిసర ప్రాంతాలు దద్దరిల్లిపోయాయి. ఈ నేపథ్యంలో నగరంలో కర్ఫ్యూను బుధవారం దాకా పొడిగించారు. మారియుపోల్‌లో వినాశనం కీలక రేవు పట్టణం మరియుపోల్‌లో రష్యా గస్తీ బోటును, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థను ధ్వంసం చేసినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. నగరాన్ని ఆక్రమించేందుకు రష్యా సైన్యాలు చేస్తున్న ప్రయత్నాలను నిరంతరం తిప్పికొడుతున్నట్టు చెప్పింది. నగర వీధుల్లో శవాలు గుట్టలుగా పడున్నాయని నగరం నుంచి బయటపడ్డ వాళ్లు చెప్తున్నారు. మారియుపోల్‌లోనే కనీసం 10 వేల మందికి పైగా పౌరులు మరణించి ఉంటారని భావిస్తున్నారు! మూడో వంతుకు పైగా ప్రజలు ఇప్పటికే నగరం వదిలి పారిపోయారు. ప్రధానంగా నగరాలే లక్ష్యంగా రష్యా సేనలు వైమానిక, భూతల దాడులను తీవ్రతరం చేస్తున్నాయి. అయితే రష్యా సేనలకు ఎక్కడికక్కడ తీవ్ర ప్రతిఘటనే ఎదురవుతోంది. ఉక్రెయిన్ సేనలు మెరుపుదాడులతో వాటిని నిలువరిస్తున్నాయి. యుద్ధం వల్ల ఇప్పటికే కోటి మంది దాకా ఉక్రేనియన్లు నిరాశ్రయులయ్యారు. దేశ జనాభాలో ఇది దాదాపు నాలుగో వంతు. వీరిలో కనీసం 40 లక్షలకు పైగా దేశం వీడారు. యుద్ధాన్ని నివారించేందుకు తమతో కలిసి రావాలని ప్రధాని నరేంద్ర మోదీని ఇంగ్లండ్ ప్రధాని బోరిస్ జాన్సన్ కోరారు. తాజా పరిస్థితిపై నేతలిద్దరూ ఫోన్లో చర్చించారు. రష్యా గెలుపు అసాధ్యమని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అన్నారు. ఈ సమస్యకు చర్చలతో మాత్రమే పరిష్కారం సాధ్యమన్నారు. ఉక్రేనియన్లు నరకం చవిచూస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. రష్యా గ్యాస్ వదులుకోలేం: జర్మనీ రష్యాపై ఆంక్షల పరంపర కొనసాగుతున్నా, ఆ దేశం నుంచి ఇంధన సరఫరాలను వదులుకోలేమని జర్మనీ స్పష్టం చేసింది. ఈ విషయంలో తమ వైఖరిలో ఏ మార్పూ లేదని జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ మంగళవారం చెప్పారు. పలు యూరప్ దేశాలు రష్యా గ్యాస్‌పై తమకంటే ఎక్కువగా ఆధారపడ్డాయన్నారు. తమ ఇంధన అవసరాలను ఇతర మార్గాల్లో తీర్చుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశామని చెప్పారు. అమెరికా, ఇతర పశ్చిమ దేశాలతో కలిసి రష్యాను కఠినాతి కఠినమైన ఆంక్షలతో ఇప్పటికే కుంగదీస్తున్నామని గుర్తు చేశారు. జర్మనీ గ్యాస్ అవసరాల్లో దాదాపు సగం రష్యానే తీరుస్తున్న విషయం తెలిసిందే. -
పెట్రోలు పంపులు ఫుల్.. నిల్వ ఎలా?
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ చమురు ధరలు కరోనా వైరస్ సంక్షోభంతో రికార్డు స్థాయికి పతనమయ్యాయి. కోవిడ్-19 లాక్డౌన్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో పెట్రోలు డిమాండ్ పాతాళానికి పడిపోయింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా దాచడానికి వీల్లేనంతగా పెట్రోలు నిల్వలు పేరుకుపోతున్నాయి. ఈ క్రమంలో మూడవ అతిపెద్ద చమురు వినియోగదారు అయిన భారతదేశంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దేశంలోని పెట్రోలు బంకులు దాదాపు నిండిపోయాయనీ, పెట్రోలు నిల్వ చేసుకునే సామర్థ్యం లేదనే ఆందోళన వ్యక్తమవుతోంది. దేశవ్యాప్తంగా 66,000 పంప్ స్టేషన్లతో సహా, ప్రతి కంటైనర్‌లో ఇంధనం నిల్వ చేసుకునేందుకు స్థలం లేకుండా పోయింది. దేశంలోని రిఫైనర్లు 85 మిలియన్ బారెల్స్ ఇంధన నిల్వ సామర్థ్యంలో 95 శాతం నిండిపోయాయని రిఫైనరీ అధికారులు తెలిపారు. ప్రభుత్వ యాజమాన్యంలోని దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 10శుద్ధి కర్మాగారాలలో కార్యకలాపాలను దాదాపు సగానికి తగ్గించగా, మిగిలినవి 35 శాతం పనిచేస్తున్నాయని ఎఫ్జీఈ కన్సల్టెంట్ సెంథిల్ కుమారన్ తెలిపారు. ప్రభుత్వ యాజమాన్యంలోని ప్రాసెసర్లను పక్కన పెడితే, దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రిఫైనర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ భారతదేశం వెలుపల లీజుకు తీసుకున్న కార్గోల్లో నిల్వ చేస్తూ వుండొవచ్చని పేర్కొన్నారు. భారతదేశం మొత్తం చమురు ఉత్పత్తి డిమాండ్ ఈ త్రైమాసికంలో రోజుకు 1.4 మిలియన్ బ్యారెళ్ల చొప్పున పడిపోతుందని అంచనా వేశారు. డిమాండ్ తిరిగి పుంజుకునే అవకాశం సమీపంలో కనిపించడం లేదని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ రిఫైనరీల డైరెక్టర్ ఆర్ రామచంద్రన్ అన్నారు. పెరుగుతున్న కరోనా మహమ్మారి కేసులతో ముంబై, ఢిల్లీ, కలకత్తా వంటి ప్రధాన వినియోగ కేంద్రాలు ఇప్పుటికే ఇబ్బందుల్లో ఉన్నాయన్నారు. అటు విస్తరిస్తున్న కరోనా కారణంగా చమురు ధరలను చరిత్రలో మొదటిసారి కనీవిని ఎరుగని కనిష్టానికి చేరాయని, ముడి, శుద్ధి చేసిన ఇంధనాలను నిల్వ చేయడానికి అందుబాటులో ఉన్న అన్ని స్థలాలను లీజుకు తీసుకున్నట్లు అతిపెద్ద స్వతంత్ర చమురు నిల్వ సంస్థ, రాయల్ వోపాక్ ఎన్వి తెలిపింది. అయితే ఈ వార్తలపై బీపీసీఎల్‌తో పాటు, హిందుస్తాన్ పెట్రోలియం కార్ప్ , ఇండియన్ ఆయిల్ కార్ప్ ఇంకా స్పందించలేదు. (టెకీలకు క్యాప్ జెమిని శుభవార్త) కాగా రిటైల్ స్టేషన్లతో పాటు, భారతీయ రిఫైనర్లు 300 కి పైగా డిపోలు, టెర్మినల్స్, అలాగే 250 ఏవియేషన్ ఇంధన స్టేషన్లలో పెట్రోలియం ఇంధనాలను నిల్వ చేస్తాయి. మొత్తం సామర్థ్యంలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ డీజిల్ నిల్వ చేయడానికి, మరో 20 శాతం గ్యాసోలిన్ నిల్వ కోసం ఉపయోగిస్తారు. లాక్‌డౌన్‌తో విమానాల రాకపోకలు, సహా అన్ని రవాణా సేవలు రద్దు చేయడంతో భారతదేశంలోని వివిధ పెట్రోల్ బంకులలో 50 శాతం కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో ఏప్రిల్‌లో ఇంధన డిమాండ్ రికార్డు స్థాయిలో పడిపోయింది. భారతదేశ చమురు డిమాండ్‌లో సగానికి పైగా, డీజిల్, గ్యాసోలిన్ వినియోగం ఏప్రిల్ మొదటి అర్ధభాగంలో 60శాతం కంటే ఎక్కువ పడిపోయింది. మరోవైపు కరోనా కట్టడికి మే 3 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించిన సంగతి తెలిసిందే. (అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు షాకివ్వనున్న జియో మార్ట్) -
నేల రాలిన విద్యా సుమం
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : నూతన సంవత్సర వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదం ఓ విద్యార్థిని బలి తీసుకుంది. మరో బాలికకు తీవ్రగాయల య్యాయి. ఇద్దరు విద్యార్థినులు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. వివరాలిలా ఉన్నా యి. పాత మధురవాడ ప్రాంతానికి చెందిన పాలవలస మేఘన, చంద్రంపాలెంకు చెందిన ప్రీతి, హనుమాన్ నగర్‌కు చెందిన ప్రత్యూషా, ఉషా ఇక్కడి జెడ్పీ ఉన్నత పాఠశాల్లో 8 వ తరగతి విద్యార్థులు. న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకుని రాజీవ్‌గృహకల్ప కాలనీలో ఉంటున్న స్వప్నకు శుభాకాంక్షలు తెలిపేందుకు ఆ నలుగురు సైకిళ్లపై వెళ్లారు. అక్కడ నుంచి తిరిగి ఇంటికి వస్తుండగా కొమ్మాది జంక్షన్ పెట్రోల్ బంక్ ఎదురుగా ప్రమాదం చోటు చేసుకుంది. వీరు సైకిళ్లు నడిపించుకుంటూ వస్తున్న సమయంలో ఆయిల్ ట్యాంకర్ ఒకటి ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేస్తూ మేఘన సైకిల్‌ను ఢీకొంది. ఈ సంఘటనలో మేఘన అక్కడికక్కడే మృతి చెందగా , ప్రీతికి తీవ్ర గాయాలు కావడంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఉషా, ప్రత్యూషలు త్రుటిలో తప్పించుకున్నారు. ఆ చిన్నారులు షాక్‌కు గురయ్యారు. విషయం తెలుసుకున్న స్వప్న లబోదిబోమంటూ విలపించింది. తనకు శుభాకాంక్షలు చెప్పడానికి రాకుంటే ఈ సంఘటన జరిగి ఉండేదికాదని రోదించింది. ప్రమాదానికి కారణమైన ఆయిల్ ట్యాంకర్ వేగంతో నడపడం వల్లే ఈ సంఘటన చోటు చేసుకుందని స్థానికులు పలువురు ఆరోపించారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ సీఐ కెవి బాలకృష్ణ , ఎస్ఐ లక్ష్మణరావు తమ సిబ్బందితో కలసి సంఘటన స్థలానికి చేరుకుని కేసును దర్యాప్తు చేపట్టారు. తీరని వేదన: అల్లారుముద్దుగా పెంచుకున్న మేఘన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లితండ్రులు కళ, చిన్నంనాయుడు చేస్తున్న రోదన వర్ణనాతీతం. శ్రీకాకుళం జిల్లా, పాలకొండ సమీపంలోని దేవుదల గ్రామానికి చెందిన వీరు ఇరవై ఏళ్ల క్రితమే పొట్టకూటి కోసం ఇక్కడికి తరలివచ్చారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద కూతురు ఉషారాణి పదో తరగతి, చిన్న కూతురు మేఘన 8 వ తరగతి చదువుతోంది. ఇద్దరు ఆడపిల్లలు ఆటపాటల్లో మంచి ప్రతిభను కనబరుస్తుండటంతో ఆ తల్లితండ్రులు సంతోషానికి అవధులు లేకుండా పోయింది. తాము కూలీనాలీ చేసుకుంటున్న తమ పిల్లల ప్రతిభ గలవారని గర్వపడేవారు. కాని ఆ విధికి మా పిల్లలను చూసి కన్నుకుట్టిందో ఏమోగాని చిన్నారి మేఘనను దూరం చేశాడని కళ, చిన్నంనాయుడు వాపోయారు. హెచ్ఎమ్ దిగ్భ్రాంతి: మేఘన మృతిపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎమ్ రాజబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంగ్లిషు మీడియం విద్యార్థి అయిన మేఘనఎంతో చలాకీ ఉండేదని ఆమె రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం దురదృష్టకరమని ఆవేదన చెందారు.