పాత సరుకు..కొత్త ధర
సాక్షి ప్రతినిధి, కర్నూలు: పాత సరుకును కొత్త ధరలకు అమ్మి వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో సిగ రెట్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. అంతే ఇక ఇదే అదనుగా వ్యాపారులు ధరలను పెంచేశారు. కర్నూలుకు చెందిన రాజేష్ రోజూ పాకెట్ సిగరెట్లు తాగే అలవాటు ఉంది. పెద్ద గోల్డ్ సిగరెట్ల ప్యాకెట్‌ను రూ.85కు కొనుగోలు చేసేవాడు. అయితే రెండు రోజులుగా దీని ధర రూ. 130 అయింది. రాజేష్ అలవాటును మానుకోలేక తప్పనిసరిగా అదనంగా ఖర్చు చేస్తున్నాడు.
చిన్నగోల్డ్ ప్యాకెట్‌పై రూ.41, బ్రిస్టల్ ప్యాకెట్‌పై రూ.20 ధర పెంచేశారు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్లు సిగరెట్ వ్యాపారులు అవకాశం వచ్చినప్పుడే సొమ్ము చేసుకొంటున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తున్న పొగరాయుళ్లను లెక్కలోకి తీసుకోవటం లేదు. ‘ఇష్టమైతే తీసుకో.. లేదంటే వెళ్లు’ అని గదమాయించి పంపేస్తున్నారు. అధికారుల అండదండలతోనే వ్యాపారులు ధరలు పెంచారని పొగరాయుళ్లు వాపోతున్నారు. మామూళ్లకు అలవాటుపడిన అధికారులు చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేస్తున్నారు.
కోట్ల రూపాయలను తాగి వదిలేస్తున్నారు
జిల్లాలో రెండు సిగరెట్ ఏజెన్సీలు ఉన్నాయి. వాటి కింద మరికొన్ని సబ్ ఏజెన్సీల ద్వారా సిగరెట్లను సరఫరా చేస్తున్నారు. ఒక్క కర్నూలు నగరంలోనే సిగరెట్లను అమ్మే దుకాణాలు 700కుపైనే ఉన్నట్లు సమాచారం. వారానికి 3 లోడ్ల సిగరెట్లు సరఫరా అవుతున్నట్లు సమాచారం. సిగరెట్ల సరఫరాను బట్టి జిల్లాలో రోజుకు రూ.కోట్ల వ్యాపారం జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఒక్క కర్నూలు నగరంలోనే రోజుకు రూ.కోటికిపైగా సిగరెట్లను పొగరాయుళ్లు కొనుగోలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజూ కోట్లలో వ్యాపారం జరుగుతున్నట్లు అనధికారిక సమాచారం. సిగరెట్‌కు అలవాటు పడిన వారు మానేయలేక ధర ఎక్కువైనా తప్పని పరిస్థితుల్లో సిగరెట్లను కాల్చుతూ జేబులను కాల్చుకుంటున్నారు.