తెలంగాణ కోసం ఒకటిన్నర రోజు వేతనం విరాళం
ఉద్యోగుల విభజన తాత్కాలికమే: టీఎన్జీవో నేత దేవీప్రసాద్
సిద్దిపేట : కొత్తగా ఏర్పాటవుతున్న తెలంగాణ రాష్ట్ర సంక్షేమం కోసం టీఎన్జీవోలు ఒకటిన్నర రోజు వేతనాన్ని తొలి ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్ ప్రకటించారు. మెదక్ జిల్లా సిద్దిపేటలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఒక రోజు వేతనం ప్రజా సంక్షేమం కోసం, సగం రోజు వేతనం అమరుల కుటుంబీకుల సహాయం కోసం వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. కొత్త రాష్ట్ర పరిపాలనను పటిష్టం చేయడానికి ఉద్యోగులు అదనంగా పనిచేస్తారన్నారు. కొత్త ప్రభుత్వం ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉంటుందని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. అక్రమంగా జరిగిన ప్రమోషన్లు, పోస్టింగ్లు చెల్లవన్నారు.