ఒకటే పరీక్ష.. ఒకటే ప్రశ్నపత్రం
- వేర్వేరు మేనేజ్మెంట్ల పరిధిలోని టీచర్ పోస్టుల భర్తీపై సర్కారు నిర్ణయం
- ఏప్రిల్ నెలాఖరుకు నోటిఫికేషన్
- ఖాళీల సేకరణపై కసరత్తు
- విద్యాశాఖ అధికారులతో డిప్యూటీ సీఎం కడియం సమీక్ష
- ‘టెట్’ దరఖాస్తులపై సందిగ్ధం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఖాళీ ల భర్తీలో సరికొత్త విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఏ మేనేజ్మెంట్ (గిరిజన, సాంఘిక సంక్షేమ, విద్యాశాఖ, మోడల్ స్కూళ్ల)లోని ఉపాధ్యాయ ఖాళీలను ఆ మేనేజ్మెంట్ పరిధిలోనే భర్తీచేసే విధానం ఉండగా... ఇకపై మేనేజ్మెంట్ ఏదైనా ఒకే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని భావిస్తోంది. దీంతోపాటు ఒకే కేటగిరీ పోస్టులకు ఒకే ప్రశ్నపత్రం ద్వారా పరీక్ష నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ అంశంపై సోమవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విద్యాశాఖ అధికారులతో చర్చించినట్లు తెలిసింది.
రాష్ట్రంలో 20 వేల వరకు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తామని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. భర్తీలో అమలు చేయాల్సిన నిబంధనలు, శాఖల వారీగా పోస్టింగ్‌ల విధానం తదితర అంశాలపై మార్గదర్శకాలను రూపొందించి, ఏప్రిల్ నెలాఖరుకు నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని స్కూళ్లకు, విద్యాశాఖ పరిధిలోని గురుకులాల్లో పోస్టులకు, మోడల్ స్కూళ్లలోని పోస్టులకు, సాంఘిక సంక్షేమ స్కూళ్లలోని ఖాళీల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి.
దీంతో ఆయా శాఖలపై భారం పడటమే కాకుండా పలు సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అన్ని శాఖలు, అన్ని విభాగాల పరిధిలోని స్కూళ్లలో పోస్టుల భర్తీకి ఒకే నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఆలోచనకు వచ్చింది. దీనిపై ఇదివరకే ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి... గిరిజన సంక్షేమ, బీసీ సంక్షేమ, సాంఘిక సంక్షేమ, విద్యాశాఖ, తెలంగాణ గురుకులాల విభాగాలకు చెందిన అధికారులతో సమీక్షించారు. ఆయా విభాగాలకు చెందిన పాఠశాలల్లోని ఖాళీలన్నింటిని గుర్తించి అందజేయాలని ఆదేశించారు.
ఒకే రకమైన పోస్టులు..
పాఠశాల విద్యా శాఖ పరిధిలో స్కూళ్లలో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ), సబ్జెక్టుల ప్రకారం స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ), పండిట్, పీఈటీ, ఫిజికల్ డెరైక్టర్ వంటి పోస్టులు ఉన్నాయి. సంక్షేమ, విద్యాశాఖల పరిధిలోని గురుకులాలు, మోడల్ స్కూళ్లలో పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) కేటగిరీలుగా పోస్టులు ఉన్నాయి. వివిధ శాఖల గురుకులాలు, మోడల్ స్కూళ్లలో ఒకే రకమైన పోస్టులున్నందున వేర్వేరు నోటిఫికేషన్లు, పరీక్షలు అక్కర్లేదన్న భావనకు ప్రభుత్వం వచ్చింది. ఈ మేరకు చేపట్టాల్సిన చర్యలపై ఆయా శాఖలు నిమగ్నమయ్యాయి. త్వరలోనే ఇది ఓ కొలిక్కి రానుంది.
టెట్ దరఖాస్తులు ఇంకెప్పుడో?
మరోవైపు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్), జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) నేతృ త్వంలో జరిగే ఉపాధ్యాయ నియామక పరీక్షలను వేర్వేరుగానే నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. గత నెల 14 నే టెట్ నోటిఫికేషన్ జారీ చేసినా.. వరంగల్ ఉప ఎన్నికల నేపథ్యంలో దరఖాస్తుల స్వీకరణ వాయిదా పడింది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎమ్మెల్సీల నోటిఫికేషన్ రావడంతో.. ఎన్నికల కమిషన్ ఆమోదం కోసం లేఖ రాశారు. ఈసీ నుంచి ఇంకా ఆమోదం రాలేదని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 24న టెట్ జరుగుతుందా, లేదా? మార్చుతారా అన్నదానిపై స్పష్టత కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.
ఒకేలా సర్వీసు రూల్స్.. ఒకేలా వేతనాలు
ప్రస్తుతం వివిధ సొసైటీల పరిధిలోని గురుకులాలు, మోడల్ స్కూళ్లలోని ఒకే కేటగిరీ పోస్టులై న ప్రిన్సిపాళ్లు, పీజీటీ, టీజీటీ పోస్టులకు పరిగణనలోకి తీసుకునే విద్యార్హతల్లో తేడాలు ఉన్నారుు. అంతేకాదు సర్వీసు రూల్స్, వేతనాల విధానాల్లోనూ వ్యత్యాసాలు ఉన్నారుు. ప్రస్తుతం వాటన్నింటినీ సరిదిద్దాలని కూడా ప్రభుత్వం నిర్ణయూనికి వచ్చింది. ఒకే నోటిఫికేషన్, ఒకే రకమైన ప్రశ్నపత్రంతో పాటు ఒకే కేటగిరీకి చెందిన ఉద్యోగులకు సర్వీసు రూల్స్, పదోన్నతులు, వేతనాల్లో వ్యత్యాసాలు కూడా ఒకేలా ఉండేలా చర్యలు చేపట్టాలని భావిస్తోంది.