one men dead
-
బైక్‌లపైకి దూసుకెళ్లిన క్వారీ లారీ
ధవళేశ్వరం/రాజమహేంద్రవరం: జాతీయ రహదారిపై ధవళేశ్వరం ఇండస్ట్రియల్ కాలనీ వద్ద గురువారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి. ధవళేశ్వరం కొత్తపేట ప్రాంతానికి చెందిన లోట్ల అప్పలరాజు, ఇందిరా స్వర్ణనగర్కు చెందిన ఇమ్మంది వీరవెంకట శివరామప్రసాద్ (27)లు మిత్రులు. ఇద్దరూ బొమ్మూరు వచ్చి , అక్కడ పని ముగించుకుని వేర్వేరు బైక్‌లపై ఇళ్లకు వెళుతున్నారు. ఇండస్ట్రియల్ కాలనీ వద్దకు వచ్చేసరికి బొమ్మూరు నుంచి వేమగిరి వైపు మట్టి లోడుతో వేగంగా వస్తున్న క్వారీ లారీ వారి బైక్‌లపైకి దూసుకువెళ్లింది. అంతటితో ఆగని లారీ ముందుకు వెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అప్పలరాజు తలకు బలమైన గాయాలవగా, శివరామప్రసాద్ కాలు నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో ఇంజ¯ŒS ఆయిల్ మీద పడడంతో పశ్చిమ గోదావరి జిల్లా పంగిడి గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ జవ్వాదుల దుర్గాప్రసాద్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ముగ్గురినీ తొలుత రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పలరాజు, రామప్రసాద్ల పరిస్థితి ప్రమాదకరంగా ఉండడంతో మెరుగైన వైద్య కోసం నగరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రామ్‌ప్రసాద్‌ను అక్కడి నుంచి కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతిచెందాడు. దుబాయ్ వెళ్లాలనుకుని ... అనంత లోకాలకు.. తండ్రి చనిపోవడంతో తల్లి, నలుగురు అక్కలున్న కుటుంబాన్ని అన్నీ తానై రామ్‌ప్రసాద్ పోషిస్తున్నాడు.యానాం వద్ద రిలయ¯Œ్స సంస్థలో అతడు చిరుద్యోగి. కుటుంబానికి మరింత అండగా ఉండాలనే ఉద్దేశంతో మరో నాలుగు రోజుల్లో దుబాయ్ వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈలోగా మృత్యువాత పడడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
రెండు బైక్‌లు ఢీకొని వ్యక్తి మృతి
అడ్డతీగల : మండలంలోని తుంగమడుగుల వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు శుక్రవారం ఢీకొన్నాయి. ఈ ఘటనలో రాజవొమ్మంగి మండలం చిన్నయ్యపాలెంకు చెందిన సుర్లం వెంకటరమణ(25) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో బైక్‌పై వస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం అడ్డతీగల నుంచి వై.రామవరం వైపు Ðð ళుతున్న చవిటిదిబ్బలు నివాసి చెలికాని రమేష్, అనుకులపాలెం నుంచి అడ్డతీగల వస్తున్న సుర్లం వెంకటరమణల మోటార్ బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తల, శరీర భాగాలకు తీవ్ర గాయాలైన వెంకటరమణ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా తీవ్రంగా గాయపడిన చెలికాని రమేష్‌ను 108లో తొలుత అడ్డతీగల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి రిఫర్ చేశారు.అడ్డతీగల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విహారయాత్రలో విషాదం
లక్కవరం (చింతూరు) : పుట్టిన రోజు సందర్భంగా స్నేహితులు చేపట్టిన విహారయాత్ర చివరికి విషాదయాత్రగా దారితీసింది. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం లక్కవరం గ్రామంలో ఆదివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. చింతూరు సీఐ దుర్గాప్రసాద్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. లక్కవరానికి చెందిన సర్పక సతీష్, నవీన్, చింతూరుకు చెందిన రవి, కార్తీక్, రమేష్‌లు స్నేహితులు. వీరిలో రవి మినహా మిగతా నలుగురూ ఆటోడ్రైవర్లు. ఆదివారం నవీన్ పుట్టిన రోజు కావడంతో స్నేహితులంతా తులసిపాక సమీపంలోని ఘాట్‌రోడ్‌లోని వాగు వద్దకు విహారయాత్రకు వెళ్లారు. ఈ క్రమంలో వాగులో స్నానానికి దిగిన సతీష్(30) కొద్దిసేపటికి కనబడలేదు. దీంతో కంగారుపడిన స్నేహితులు వాగులోకి దిగి వెతకగా సతీష్ మృతదేహం లభ్యమైంది. దీంతో వారంతా భయపడి మోతుగూడెం పోలీస్‌స్టేషన్ కు చేరుకుని జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించారు. చింతూరు సీఐ దుర్గాప్రసాద్, మోతుగూడెం ఎస్సై కిషోర్‌లు వాగు వద్దకు చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. అప్పటికే చీకటి పడటంతో మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం సోమవారం చింతూరు ఆసుపత్రికి తరలించారు. సతీష్ మృతిపై అతడి స్నేహితులు అందించిన సమాచారం మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. ఆటోతో పాటు కిరాణాషాపు నడుపుకుంటున్న మృతుడికి భార్య వెంకటలక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోస్ట్‌మార్టం ఆలస్యంపై రాస్తారోకో సతీష్ మృతదేహాన్ని సోమవారం ఉదయం చింతూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకు రాగా సాయంత్రం వరకూ పోస్ట్‌మార్టం నిర్వహిం^è లేదు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు, ఆటోడ్రైవర్లు, దళిలసంఘాల ఆధ్వర్యంలో చింతూరు ప్రధాన రహదారిపై మృతదేహంతో కలిసి రాస్తారోకో చేశారు. సకాలంలో పోస్ట్‌మార్టం చేయని డాక్టర్‌ను సస్పెండ్ చేయాలని, మృతుడి భార్యకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోతో భారీగా ట్రాఫిక్ జాం కావడంతో విషయం తెలుసుకున్న సీఐ దుర్గాప్రసాద్ అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్నవారితో మాట్లాడారు. పోస్ట్‌మార్టం చేసేందుకు వైద్య నిపుణుడు లేనందునే ఆలస్యమైందని, వెంటనే పోస్ట్‌మార్టం నిర్వహించేలా చూస్తామని ఆయన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. సీపీఎం సభ్యుడైన సతీష్ మృతదేహాన్ని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య సందర్శించి నివాళులర్పించారు. -
జనసేన సభలో అపశ్రుతులు
చెట్టు కొమ్మలు విరిగి, గోడపై నుంచి పడి.. ఒకరు మృతి, నలుగురుకి గాయాలు బోట్‌క్లబ్ (కాకినాడ)/కుయ్యేరు (కాజులూరు) : సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిర్వహించిన సీమాంధ్రుల ఆత్మగౌరవ సభలో అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. జేఎన్టీయూకే గ్రౌండ్లో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో.. చెట్టు కొమ్మలు విరిగిపడడంతో పాటు ఎత్తయిన గోడపై నుంచి కొందరు కిందపడిన సంఘటనల్లో ఒకరు మరణించగా, నలుగురికి గాయాలయ్యాయి. ప్రధాన వేదికకు దూరంగా గోడపై పవన్ అభిమానులు కూర్చొన్నారు. ఈ క్రమంలో కొందరు గోడపై నుంచి కిందపడ్డారు. కాజులూరు మండలం కుయ్యేరుకు చెందిన నందికోళ్ల వెంకటరమణ(22) తలకు తీవ్ర గాయమైంది. అతడిని హుటాహుటిన అంబులెన్స్‌లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. అలాగే గ్రౌండ్లో ఉన్న పెద్ద చెట్టు ఎక్కి పవన్ అభిమానులు సభను తిలకిస్తున్నారు. ఎక్కువ మంది ఎక్కడంతో, ఆ బరువుకు చెట్టు కొమ్మలు విరిగిపోయాయి. దీంతో కొందరు యువకులు కిందపడి, గాయాలపాలయ్యారు. ఆయా సంఘటనల్లో రాయవరం మండలం లొల్ల గ్రామానికి చెందిన రవ్వా రవి, పెద్దాపురం మండలం గోరింట గ్రామానికి చెందిన కర్రి రాజారావు, రామచంద్రపురం మండలం వెల్ల సావరానికి చెందిన కురసాల సుబ్రహ్మణ్యం, పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన పుప్పాల ప్రసాద్ గాయాలపాలై, కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా స్వల్పంగా గాయపడిన కొందరు ఆస్పత్రికి రాకుండా, అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు చెబుతున్నారు. విద్యుదాఘాతంతోనా? ఇలాఉండగా వెంకటరమణ గోడపై నుంచి పడడం వల్ల గాయపడి చనిపోలేదని, సంఘటన స్థలంలో ఉన్న సౌండ్‌బాక్సు వైర్ల కారణంగా విద్యుదాఘాతానికి గురైనట్టు సభకు హాజరైన కొందరు పేర్కొన్నారు. గోడపై నుంచి పడడం వల్లే తలకు గాయమైనట్టు పోలీసులు చెబుతున్నారు. మృతదేహానికి శనివారం పోస్ట్‌మార్టం చేయనున్నట్టు తెలిపారు. సర్పవరం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కుయ్యేరులో విషాదం అభిమాన నటుడు పవన్‌కల్యాణ్‌ను చూసి, ఆయన ప్రసంగాన్ని వినేందుకు వెళ్లిన వెంకటరమణ మరణించడంతో కుయ్యేరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అవివాహితుడైన వెంకటరమణ పెయింటర్‌గా పనిచేసేవాడు. ఇతడి తండ్రి తర్రయ్య(అబ్బులు) వ్యవసాయ కూలీ కాగా, తల్లి లక్ష్మి గృహిణి. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న తమ్ముడు, మూగ చెల్లెలు ఉన్నారు. పెద్ద కొడుకు కావడంతో తానే కుటుంబ బాధ్యతలు చూస్తున్నాడు. తమ్ముడు, చెల్లెలు బాగోగులు చూసుకుంటాడని ఆశించిన తల్లిదండ్రులకు అతడి మరణం తీరని శోకాన్ని మిగిల్చింది.