ఆ రుణాలపై ఎస్బీఐ గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా రైతులకోసం ఒక కొత్త పథకాన్ని మంగళవారం ప్రకటించింది. ట్రాక్టర్, వ్యవసాయ యాంత్రీకరణ రుణాల పరిష్కారం కోసం వన్ టైం సెటిల్ మెంట్ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం ద్వారా ముఖ్యంగా 2016, సెప్టెంబర్ 30 నాటికి "సందేహాస్పదంగా లేదా లాస్ఎసెట్స్’’ కేటగిరీలో పడి ఉన్న రుణాలను పరిష్కరించనున్నట్టు తెలిపింది. ఈ పథకం మార్చి 31 వరకు చెల్లుబాటులో ఉంటుందని తెలిపింది.
ఈ ప్రత్యేక పథకం కింద రూ.6 వేలకోట్ల రుణాలను సెటిల్ చేసేందుకు యోచిస్తున్నట్టు ఎస్బీఐ ఎండీ రాజనీష్ కుమార్ తెలిపారు. అలాగే మొత్తం రుణంలో 40శాతాన్ని రైట్ ఆఫ్ చేయనున్నట్టు చెప్పారు. దీనిపై ఆయా శాఖ స్థాయిలో నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.ఎస్బీఐ వివిధ కేటగిరీల్లో వన్ టైంసెటిల్‌మెంట్ పథకాన్ని ఆఫర్ చేస్తుందనీ, తద్వారా రుణ రికవరీని మెరుగు పర్చుకుంటుందని ఆయన తెలిపారు. ఈ ట్రాక్టర్ రుణాలు పెద్దనోట్లకు సంబంధించినవి కావని అని వివరించారు. ఈ ఖాతాలు ఇప్పటికే (సెప్టెంబర్ 30 నాటికి) నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) కేటగిరీలో ఉన్నట్టు స్పష్టం చేశారు.