ప్రతి కార్మికుడికి ఆన్లైన్లో వేతనం
కేంద్ర కార్మిక శాఖ ఉప కమిషనర్ శ్యామ్ సుందర్
సాక్షి, హైదరాబాద్: వేతన పంపిణీలో పారదర్శకత కోసం ప్రతి కార్మికుడికి ఆన్లైన్ పద్ధతిలోనే వేతన చెల్లింపులు జరుపుతామని కేంద్ర కార్మిక శాఖ ఉప కమిషనర్ శ్యామ్ సుందర్ పేర్కొన్నారు. ఇకపై చేతికి వేతన నగదు ఇచ్చినట్లు తెలిస్తే యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేంద్ర కార్మిక శాఖ మూడేళ్ల పనితీరుపై బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బోనస్ చట్టం మార్పులతో కనీస వేతన పరిమితి రూ.10వేల నుంచి రూ.21వేలకు పెరిగిందని, అదేవిధంగా బోనస్‌ను రూ.3500 నుంచి రూ.7వేలకు పెంచామన్నారు.
బాలకార్మిక చట్ట సవరణతో ఇటీవల 990 పారిశ్రామిక వివాదాలు పరిష్కరించామని, ఫలితంగా 73,814 మంది ప్రయోజనం పొందారన్నారు. కనీస వేతనాల చట్టం కింద నమోదైన కేసులలో 14,147 మంది కార్మికులకు రూ.2.71 కోట్ల మేర ప్రయోజనం చేకూరిందన్నారు. ఇక గ్రాట్యుటీ దరఖాస్తుల్లో 368 మంది కార్మికులకు రూ.3.50 కోట్ల లబ్ధి కలిగిందన్నారు. చట్టాల అమలుపై క్షేత్రస్థాయిలో 5,589 తనిఖీలు నిర్వహించగా, 53,054 అవకతవకలు గుర్తించామని, శాఖపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.