జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక చికిత్స
సంగారెడ్డి అర్బన్, న్యూస్‌లైన్: సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో ఆధునిక పరిజ్ఞానంతో ఆపరేషన్ నిర్వహించారు. అత్యంత విలువైన అధునాతన పరికరంతో 18 ఏళ్ల వయస్సుగల కోహీర్ మండలానికి చెందిన యోహాన్‌కు బుధవారం శస్త్ర చికిత్స నిర్వహించారు. ల్యాపరోస్కోపి పద్ధతి ద్వారా అపెండిసైటిస్ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. సాధారణం గా అపెండిసైటిస్ శస్త్ర చికిత్స చేయాలంటే నాలుగు నుంచి ఐదు సెంటీమీటర్ల మేర చర్మాన్ని కోయాల్సి ఉం టుంది.
నూతన ఈ విధానం ద్వారా చిన్నపాటి రంధ్రా న్ని చేసి ఆపరేషన్ నిర్వహించవచ్చు. రోగికి ఎక్కువ కుట్లు వేయాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా రెండుకుట్లు మాత్రమే వేయడంతో సాధారణంగా ఐదు నుంచి 10రోజులు కాకుండా రెండు రోజుల్లోనే రోగి కోలుకునే అవకాశం ఉంది. నొప్పి తక్కువగా ఉండి ఇన్ఫెక్షన్లు సోకకుండా రోగి ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే డబ్బుతోపాటు సమయం కలిసి వస్తుంది.