operation akarshan
-
ప్రధాన పార్టీలకు..వలసల దెబ్బ
గోవా రూటే సెపరేటు.. ఆ రాష్ట్రంలో ఫిరాయింపులు సర్వసాధారణం. అతి చిన్న రాష్ట్రమైన గోవాలో పార్టీ కంటే నాయకులే అత్యంత శక్తిమంతులు. పార్టీ ఫిరాయింపులతో ప్రభుత్వాలు కూలదోయగలరు, వాటితోనే ప్రభుత్వాలను నిలబెట్టగలరు. ఇప్పుడు కూడా ఆయారామ్, గయారామ్ సంస్కృతి పెరిగి గందరగోళానికి దారితీస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ గోవాలో పార్టీ ఫిరాయింపులు అధికమయ్యాయి. ఏ నాయకుడు ఎప్పుడు ఎటు దూకుతారో తెలియక అన్ని పార్టీలు గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఇన్నాళ్లూ బీజేపీ, కాంగ్రెస్ హవా కొనసాగిన గోవాలో ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ కూడా ఎంట్రీ ఇవ్వడంతో నాలుగు స్తంభాలాట (ఆమ్ ఆద్మీ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లోనే ఇక్కడ బరిలోకి దిగింది) నెలకొంది. దీంతో నాయకుల పక్క చూపులు ఎక్కువయ్యాయి. తృణమూల్ కాంగ్రెస్ ఎక్కువగా ఆపరేషన్ ఆకర్‡్ష నిర్వహిస్తోంది. ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బృందం రాష్ట్రంలోని 40 నియోజకవర్గాల్లో అత్యంత ప్రభావం చూపించే నాయకులపై వల విసురుతోంది. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న తృణమూల్ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి సై అంటోంది. కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి, ఈశాన్య రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి అయిన లూయీజిన్హో ఫలేయిరో 2021 సెప్టెంబర్‌లో తృణమూల్‌లో చేరడంతో ఈ ఫిరాయింపుల పర్వం మొదలైంది. వెంటనే ఆయన్ను రాజ్యసభకు పంపిన మమతా బెనర్జీ ఎవరొచ్చినా తగిన గౌరవం ఇస్తామని సంకేతాలు పంపారు. గోవా మరో మాజీ సీఎం, ఎన్సీపీ ఎమ్మెల్యే చర్చిల్ అలెమావో కూడా పార్టీని వీడి టీఎంసీలో చేరారు. వీరిద్దరి రాకతో కేథలిక్కుల్లో తృణమూల్‌కు పట్టు లభించినట్టయింది. గత ఎన్నికల్లో 17 మంది ఎమ్మెల్యేలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌లో ప్రస్తుతం ఇద్దరే మిగిలి ఉండడం పార్టీ దుస్థితిని చాటిచెబుతోంది. 2017లో ప్రభుత్వ ఏర్పాటు సమయంలో ఇద్దరు ఎమ్మెల్యేలు, 2019లో ఏకంగా 10 మంది కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. తర్వాత గత ఏడాది మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడారు. అధికార బీజేపీలో సొంత పార్టీ మంత్రులే అవినీతి ఆరోపణలు చేయడంతో ఆ పార్టీని వీడేవారి సంఖ్య పెరుగుతోంది. బీజేపీకి క్రిస్టియన్లు దూరమవుతున్నారా? గోవాలో బీజేపీ క్రిస్టియన్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. కలంగుటే ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి మైఖేల్ లోబో బీజేపీకి రాజీనామా చేయడం రాజకీయంగా సంచలనం సృష్టించింది. ఆయన కాంగ్రెస్‌లో చేరిపోయారు. గోవాలో మెజార్టీ జనాభా హిందువులైనప్పటికీ 2011 లెక్కల ప్రకారం 25% క్రిస్టియన్లు ఉన్నారు. మనోహర్ పారిక్కర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రిస్టియన్లను ఆకర్షించే కార్యక్రమాలు నిర్వహించారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 13 స్థానాలను గెలిస్తే వారిలో ఏడుగురు ఎమ్మెల్యేలు క్రిస్టియన్లు కావడం విశేషం. గత నెలలో కార్టోలిమ్ ఎమ్మెల్యే అలీనా సల్దాన్హా బీజేపీకి రాజీనామా చేసి ఆప్‌లో చేరారు. మరో క్రిస్టియన్ ఎమ్మెల్యే వాస్కో నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కార్లోస్ అల్మీదా కాంగ్రెస్‌లో చేరారు. ఇక వెలిమ్ ఎమ్మెల్యే, మంత్రి ఫిలిప్ నెరి, రోడ్రిగెజ్ ఎమ్మెల్యే బాబాసన్ త్వరలోనే బీజేపీని వీడతారని ప్రచారం జరుగుతోంది. ఇక మంత్రి మైఖేల్ లోబో తన భార్య దలిలాకి కూడా టికెట్ ఆశించారు. అది వచ్చే అవకాశం లేకపోవడంతో పార్టీని వీడారన్న ఊహాగానాలు ఉన్నాయి. ఉత్తర గోవాకి చెందిన లోబోకు 5–6 నియోజకవర్గాల్లో మంచి పట్టు ఉంది. క్రిస్టియన్ జనాభా అధికంగా ఉన్న ఈ నియోజకవర్గాల్లో బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తే ఓడిపోతామన్న భయంతోనే వీరంతా రాజీనామాకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. మదర్ థెరిసా నెలకొల్పిన మిషనరీస్ ఆప్ చారిటీకి విదేశీ విరాళాల సేకరణకు లైసెన్స్ పునురుద్ధరించకపోవడం.. ఆపై విమర్శలు రావడంతో 15 రోజుల తర్వాత కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఓకే చెప్పడం తెలిసిందే. ఈ పరిణామాలు క్రిస్టియన్లలో బీజేపీపై ఆగ్రహం తెప్పించి ఉంటాయని ఈ నాయకులు భయపడుతున్నారు. అంతా గందరగోళం ఎమ్మెల్యేలు, నేతలు పార్టీలు మారుతుండటంతో ఎవరెక్కడ ఉన్నారోననే తీవ్రమైన గందరగోళం నెలకొంది. దీంతో ఓటర్లు ఎవరివైపు ఉంటారో చెప్పడం తలపండిన రాజకీయ విశ్లేషకులకు కూడా సాధ్యం కావడం లేదు. ‘‘బీజేపీ తీవ్ర అధికార వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. కానీ టీఎంసీ ఎన్నికల బరిలోకి రావడంతో కాంగ్రెస్ ఓటు బ్యాంకుకి దెబ్బపడింది. గత ఎన్నికల్లో 6.3 శాతం ఓటు షేర్ సాధించిన ఆప్ క్రమంగా బలం పుంజుకుంటోంది. ప్రతిపక్షాలన్నీ ఏకమైతేనే అధికార బీజేపీని ఓడించగలరు’’ అని ఎన్నికల విశ్లేషకుడు క్లాఫాటో కౌంటిన్హో అభిప్రాయపడ్డారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
బీజేపీలోకి 20మంది టీ.కాంగ్రెస్ నేతలు!
సాక్షి, హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ ‘ఆపరేషన్ ఆకర్ష్‘తో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఓ వైపు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్...తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతలను వరుసపెట్టి కారెక్కిస్తుంటే...మరోవైపు భారతీయ జనతా పార్టీ మిగిలిన కాంగ్రెస్ ముఖ్యనేతలతో పాటు టీఆర్ఎస్లో అసంతృప్తి నేతలపై దృష్టి సారించింది. ఇందుకోసం రంగంలోకి దిగిన బీజేపీ కేంద్ర నాయకత్వం అసంతృప్తులు, టికెట్ దక్కని సిట్టింగ్ ఎంపీలపై కన్నేసిన కమలం వారితో చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే గద్వాల్ జేజమ్మ డీకే అరుణ, సోయం బాబూరావు కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి భారీగా చేరికలు ఉంటాయని బీజేపీ ప్రచారం చేస్తోంది. చదవండి....(బీజేపీలోకి డీకే అరుణ) కాషాయ కండువా కప్పుకోనున్న 20మంది కాంగ్రెస్ నేతలు! సుమారు 20మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు కాషాయ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రులు, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నేతలంతా బీజేపీలో చేరేందుకు క్యూ కడుతున్నారట. మహబూబ్ నగర్, నల్గొండ, మెదక్ జిల్లాలకు చెందిన కాంగ్రెస్ నేతలంతా బీజేపీలో చేరనున్నట్లు భోగట్టా. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను నిన్నే ప్రకటించాల్సి ఉన్నప్పటికీ పార్టీలోకి వచ్చే నేతలకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశం, గెలుపు గుర్రాలను బరిలో నిలపాలన్న ఆలోచనతో అభ్యర్థుల ఖరారులో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా ఒక్క స్థానం మినహా మిగతా స్థానాలు ఖరారు కావడం, టీఆర్ఎస్ ఈనెల 21న అభ్యర్థులను ప్రకటించనున్న నేపథ్యంలో అప్పటివరకు వేచి చూడాలా వద్దా అని ఆ పార్టీ ఆలోచిస్తోంది. టీఆర్ఎస్లో టికెట్ దక్కనివారికి, గెలిచే అవకాశం ఉన్న నేతలకు టికెట్లు ఇవ్వడం ద్వారా ఆయా స్థానాల్లో తమ సత్తా చాటాలన్న ఆలోచనలో ఉన్న బీజేపీ అప్పటివరకు వేచి చూసే అవకాశాలు ఉన్నాయి. చదవండి...(అందుకే బీజేపీలో చేరా: డీకే అరుణ) జానారెడ్డికి రాహుల్ గాంధీ ఫోన్ ఇక ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన కాంగ్రెస్ పార్టీకి ... అ తర్వాత పార్టీ ఎమ్మెల్యేలు ఝలక్ ఇస్తున్నారు. వరుసపెట్టి పలువురు కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దీంతో ఆపరేషన్ ఆకర్ష్ బారిన పడకుండా ఉన్న నాయకుల్ని కాపాడుకునే పనిలో పడ్డారు తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు. ఇక మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్ కూడా కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ...జానారెడ్డికి ఫోన్ చేసినట్లు సమాచారం. తొందరపడవద్దని, నచ్చచెప్పినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్లో విలీనమే? పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేసేందుకు ఆ పార్టీని దెబ్బతీసేందుకు టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. అందులో భాగంగా ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు బహిరంగంగానే ప్రకటించారు. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 19 కాగా వారిలో 14 మంది ఆ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరితే...విలీనం ఒకటే మిగిలినట్లు. తాజాగా బుధవారం కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. త్వరలోనే టీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు. చదవండి...(టీఆర్ఎస్లోకి మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే) తాజా పరిణామాలతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయోమయంగా మారింది. ఎప్పుడు ఏ నేత పార్టీ వీడతారో...తెలియక సతమతం అవుతోంది. ఓవైపు కారు, మరోవైపు కమలం తమ పార్టీ నేతలను లాక్కుంటుంటే హస్తం పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయరైంది. ఇదంతా చూస్తుంటే... కాంగ్రెస్ నుంచి వెళ్లే వాళ్ల జాబితా కాకుండా...ఆ పార్టీలో ఉండేవాళ్లు ఎంతమందో లెక్కతీస్తే సరిపోతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. -
'ఆపరేషన్ ఆకర్షణ్' షురూ!
వలస నాయకులకు గులాబీ దళపతి ద్వారాలు తెరిచారు. 'గ్రేటర్'లో పాగా వేసేందుకు 'ఆపరేషన్ ఆకర్షణ్'కు తెర లేపారు. తమవైపు చూస్తున్న ఇతర పార్టీ నాయకులను ఆలస్యంగా చేయకుండా తమలో కలుపుకునేందుకు కారు పార్టీ అధినాయకుడు పచ్చజెండా ఊపారు. రాబోయే 'గ్రేటర్' ఎన్నికల్లోనూ గులాబీ జెండాను రెపరెపలాడించేందుకు వ్యూహాన్ని సిద్దం చేశారు. నవంబర్ లో జరగనున్నగ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ సీనియర్ నేతలతో టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం చర్చలు జరిపారు. నగరంలో టీడీపీ-బీజేపీ కూటమిని దీటుగా ఎదుర్కొనేందుకు సమాయత్తమవ్వాలని నాయకులకు సూచించారు. ఇందుకోసం పార్టీశ్రేణులను సమాయత్తం చేయడంతోపాటు వివిధ పార్టీల ముఖ్యనేతలను, కార్పొరేటర్లను టీఆర్ఎస్లో చేర్చుకోవాలని ఆదేశించారు. పాతనగరంలో బలంగా ఎంఐఎంతోనూ చేతులు కలిపేందుకు టీఆర్ఎస్ పావులు కదుపుతున్నట్టు కనబడుతోంది. ఈ బృహత్తర బాధ్యతలను పార్టీ సెక్రటరీ జనరల్, ఎంపీ కె.కేశవరావు, మంత్రి హరీష్‌రావులకు కేసీఆర్ అప్పగించారు. సీఎం పదవి చేపట్టిన నాటి నుంచి పాలనలో నిమగ్నమైన కేసీఆర్ ఇప్పుడు పార్టీ బలోపేతంపైనా దృష్టి సారించారు. సార్వత్రిక ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో అనుకున్న ఫలితాలు రాకపోవడంతో కార్పొరేషన్ పోరులో సత్తా చాటాలని పట్టుదలతో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 24 అసెంబ్లీ స్థానాల్లో 14 సీట్లను టీడీపీ-బీజేపీ కూటమి దక్కించుకుంది. ఇక నాలుగు ఎంపీ సీట్లలో రెండింటినీ తన ఖాతాలో వేసుకుంది. ఈ ఫలితాలు 'గ్రేటర్'లో టీఆర్ఎస్ బలపడాల్సిన ఆవశ్యకతను వెల్లడించాయి. దీంతో టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ గాలం వేసింది. ఇంకా పలువురు ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని, వారి పేర్లు వెల్లడించనని డిప్యూటీ సీఎం మొహమూద్ అలీ చెప్పారు. టీఆర్ఎస్ 'ఆపరేషన్ ఆకర్షణ్' ఏ మేరకు వలస నాయకులను ఆకర్షింస్తుందో చూడాలి.