అళగిరి బహిష్కరణతో బీజేపీ సంబరం
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్టకు నిప్పు దొరికిందని మరొకడు సంబరపడ్డాడట. డీఎంకే నుంచి ఎంకే అళగిరిని బహిష్కరించడంతో తమిళనాట బీజేపీ, దాని మిత్రపక్షాలు సంబరాలు చేసుకుంటున్నాయి. ఎండేఎంకే అధినేత వైగో, బీజేపీ నాయకుడు హెచ్.రాజా తదితరులు అళగిరిని కలిసి, లోక్సభ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. బహిరంగంగా అళగిరి ఈ మద్దతు విషయమై ఏమీ చెప్పకపోయినా.. ఆయన మద్దతుదారులు మాత్రం అటు డీఎంకేకు గానీ, ఇటు అన్నా డీఎంకేకు గానీ ఎటూ ఓట్లు వేయరు కాబట్టి ఆ ఓట్లన్నీ తమకే పడతాయని బీజేపీ కూటమి భావిస్తోంది.
అళగిరిని డీఎంకే నుంచి బహిష్కరించడం వల్ల తమకు అదనంగా కనీసం 30 వేల నుంచి 40 వేల వరకు ఓట్లు వస్తాయని బీజేపీ నాయకుడొకరు తన పేరు రాయొద్దంటూ చెప్పారు. ఈ ఓట్లు ఎక్కువగా దక్షిణ తమిళనాడు జిల్లాల నుంచే పడేలా ఉన్నాయి. అళగిరి ఇంతకుముందు డీఎంకే దక్షిణ మండలానికి కార్యనిర్వాహక కార్యదర్శిగా వ్యవహరించారు. ఆయన పదేపదే పార్టీ నాయకులను విమర్శిస్తూ, పార్టీ పరువు మంటగలుపుతుండటంతో పార్టీనుంచి బహిష్కరిస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. అయితే.. అళగిరి సమావేశాలకు వస్తున్న జనాన్ని చూసి డీఎంకే నాయకులు ఆశ్చర్యపోతున్నారు. 2001 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అళగిరి మద్దతుదారులు విడిగా పోటీచేసి, డీఎంకే ఓట్లను గణనీయంగా చీల్చేశారు. ఈసారి వాళ్లు ఏం కొంప ముంచుతారోనని డీఎంకే నాయకులు లోలోపలే ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.