అనుమానాస్పదస్థితిలో యువతి మృతి
ప్రియుడి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని వచ్చిన కొద్దిసేపటికే ఘటన
ఉప్పల్,న్యూస్‌లైన్: అనుమానాస్పద స్థితిలో ఓ యువతి మృతి చెందింది. ఉప్పల్ పోలీసుల కథనం ప్రకారం.. ఉప్పల్ ఈస్ట్ కళ్యాణ్‌పురికి చెందిన ఉప్పలయ్య కుమార్తె సుప్రజ(20), అదే ప్రాంతంలో ఉంటున్న ఉషాకిరణ్ ప్రేమించుకున్నారు. ఇరువురి కుటుంబ సభ్యులు వీరి ప్రేమను అంగీకరించడంతో కొద్ది రోజులుగా కలిసి తిరుగుతున్నారు.
ఆదివారం ప్రియుడు పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనేందుకు సుప్రజ తన స్నేహితులతో కలిసి ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి వెళ్లింది. మధ్యాహ్నం 1.30కి ప్రియుడు ఉషాకిరణ్, స్నేహితులు అలేఖ్య, నితిన్‌రెడ్డి.. సుప్రజను కారులో ఇంటి వద్ద దించి వెళ్లిపోయారు. సుప్రజ తనకు ఒంట్లో బాగోలేదని ఇంట్లో వారికి చెప్పింది. ఆమె నీరసంగా ఉండటం గమనించి కుటుంబసభ్యులు నిమ్మరసం తాగించారు.
కొద్దిసేపటికి సుప్రజ అపస్మారకస్థితికి చేరుకుంది. వెంటనే కుటుంబసభ్యులు రామంతాపూర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే మృతి చెందింది. సుప్రజ మృతికి ఆమె తల్లిదండ్రులే కారణమని ప్రియుడు ఉషాకిరణ్ ఆరోపించడంతో ఆసుపత్రి వద్ద ఇరువురి బంధువుల మధ్య వాగ్వాదం జరిగింది.
దీంతో పోలీసులు జోక్యం చేసుకొని ఇరువురి బంధువులతో పాటు ఉషాకిరణ్‌ను పోలీసుస్టేషన్‌కు పిలిపించి విచారిస్తున్నారు. కాగా, తన కుమార్తె మృతిపై విచారణ జరిపించాలని సుప్రజ తల్లి వరలక్ష్మి పోలీసులను కోరింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.