సీమాంధ్ర న్యాయవాదుల హల్చల్
మెహిదీపట్నం, న్యూస్‌లైన్: సీమాంధ్ర న్యాయవాదుల సదస్సుకు పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. శనివారం గుడిమల్కాపూర్ లోని అశోకాగార్డెన్‌లో నిర్వహించిన సదస్సుకు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పలువురు నాయకులు హాజరయ్యారు. ఈ సదస్సుకు వచ్చే దారుల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు.
రేతిబౌలి, గుడిమల్కాపూర్ చౌరస్తా, శంషాబాద్ దారిలో పోలీసులు ప్రత్యేక పికెట్లను ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా అశోకాగార్డెన్ సమీపంలో ఉన్న బాలాజీనగర్, సత్యనారాయణనగర్, సాయినగర్‌లలో సైతం ముళ్లకంచెలను ఏర్పాటు చేసి గుర్తింపు కార్డులను తనిఖీ చేసి సదస్సుకు పంపించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఆసిఫ్‌నగర్ ఏసీపీ వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు జరిగాయి.
తెలంగాణవాదుల హంగామా...
సీమాంధ్ర న్యాయవాదుల సదస్సును నిలిపివేయాలంటూ కార్వాన్ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు హంగామా చేశారు. అశోకాగార్డెన్ వద్ద పూలమార్కెట్‌లోని ఓవర్‌హెడ్ వాటర్‌ట్యాంకు ఎక్కి ఆందోళన చేపట్టారు. సీమాంధ్ర న్యాయవాదులు సదస్సును రద్దు చేసుకొని తక్షణమే వెళ్లాలంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వాటర్‌ట్యాంకు వద్ద బందోబస్తు చర్యలు చేపట్టారు. ఆందోళనకారులకు నచ్చజెప్పి కిందకు దింపి అరెస్ట్ చేశారు. అనంతరం వారిని టప్పాచబుత్ర పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో టీఆర్ఎస్ నగర ప్రధాన కార్యదర్శి జీవన్‌సింగ్, నాయకులు గాండ్ల శ్రీనివాస్, శ్రీధర్‌సాగర్, చందర్, రాజు, హరీష్, రామారావు, సుబ్బారావులు ఉన్నారు.