కరెంటు కోసం కన్నెర్ర
యర్రగొండపాలెం టౌన్, న్యూస్‌లైన్ : కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని, ఫిబ్రవరి నెలలోనే ఇలా ఉంటే, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉంటుందోనని వైఎస్సార్ సీపీ యర్రగొండపాలెం నియోజకవర్గ సమన్వయకర్త పాలపర్తి డేవిడ్‌రాజు అన్నారు. నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్ సమస్యలపై వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో స్థానిక 132/33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డేవిడ్‌రాజు మాట్లాడుతూ సమయపాలన లేకపోవడంతో కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియక రైతులు అల్లాడిపోతున్నారన్నారు. పంటలకు నీరు పెట్టేందుకు వెళ్లిన ైరె తులు పొలాల్లోనే జాగారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పరీక్షలు సమీపిస్తుండగా ఉదయం, రాత్రి వేళల్లో విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే మరమ్మతులు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని, విద్యుత్ మరమ్మతుల కేంద్రంలో అవినీతి చోటు చేసుకుందని ఆరోపించారు. హెచ్‌వీడీఎస్ పథకం అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ సమస్యలు పరిష్కరించేంత వరకూ ధర్నా విరమించేది లేదని డేవిడ్‌రాజు పట్టుబట్టారు. దీంతో ధర్నా వద్దకు ఏడీఈ ఎస్.శ్రీనివాసరెడ్డి వచ్చి విద్యుత్ సరఫరాను మెరుగు పరిచేందుకు కృషి చేస్తామని చెప్పారు. శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో పవర్ ట్రాన్స్ఫార్మర్ ఫెయిలైందని, దీని వల్లే సమస్య వచ్చిందని వివరించారు.
కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుల విషయంలో జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంటామని ఏడీఈ హామీ ఇచ్చారు. అనంతరం నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను ఎస్ఈ,డీఈలకు డేవిడ్‌రాజు ఫోన్లో వివరించారు. త్వరలో తాను నియోజకవర్గంలో పర్యటించి సమస్యలు తెలుసుకుంటానని, మార్చి 15లోపు శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో సమస్యను పరిష్కరించి మెరుగైన విద్యుత్ సరఫరా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటానని, పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులకు అనుకూలంగా ఉదయం 7 గంటల వరకు విద్యుత్ సరఫరా ఇస్తామని ఎస్ఈ జయకుమార్ హామీ ఇవ్వడంతో డేవిడ్‌రాజు ధర్నా విరమించారు. తొలుత ఎమ్మెస్ రోడ్డులో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం వైఎస్సార్ సెంటర్ నుంచి విద్యుత్ సబ్‌స్టేషన్ వరకూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో యర్రగొండపాలెం, పుల్లలచెరువు మండలాల వైఎస్సార్ సీపీ కన్వీనర్లు కోట వెంకటరెడ్డి, పెద్దపోతు చంద్రమౌళిరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు కె.ఉమామహేశ్వరరెడ్డి, మాజీ ఎంపీపీ ఎన్.జయప్రకాశ్, వైపాలెం యువజన విభాగం కన్వీనర్ కొదమల జిన్న, కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు గూడా వెంకటరెడ్డి, సెంట్రల్ బ్యాంక్ మాజీ డెరైక్టర్ భూమిరెడ్డి సుబ్బారెడ్డి, నాయకులు గంజి వెంకటేశ్వరరెడ్డి, గుండ్రెడ్డి రామిరెడ్డి, జి.గోవిందరెడ్డి, ఒంగోలు సుబ్బారెడ్డి, పఠాన్ మాబూఖాన్, ఆవుల అచ్చిరెడ్డి, బి. రవణారెడ్డి, ఎస్.పోతిరెడ్డి, సుబ్రహ్మణ్యాచారి, పరిశపోగు యోహాన్, ఎలిసెల కోటేశ్వరరావు, పి.ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.