palasa cashew
-
జీడి పప్పు తొక్కతో లాభాలెన్నో.. లక్షల్లో సంపాదన!
కాశీబుగ్గ: జీడి పప్పు రుచి అందరికీ తెలిసిందే. జీడి పప్పు తయారీ విధానం, వ్యాపారం కూడా చాలా మందికి పరిచయమే. కానీ ఆ జీడిపప్పుకు కవచంలా ఉండే తొక్కతో కూడా లక్షలాది రూపాయల వ్యాపారం జరుగుతుందని తెలుసా..? ఈ తొక్కతో తయారు చేసే ఆయిల్ మిశ్రమానికి విదేశాల్లో చాలా డిమాండ్ ఉంది. అందుకే పలాస నుంచి మన దేశంలోని ఇతర ప్రాంతాలకే కాకుండా విదేశాలకు కూడా ఈ ఆయిల్‌ను ఎగుమతి చేస్తున్నారు. ఆ రక్షణ కవచమే.. జీడి చెట్టు పువ్వుల నుంచి జీడి పిక్కలు కాస్తాయి. పిక్కల దశ నుంచి పప్పు తయారీ వరకు సహజ సిద్ధంగా ఉండే రక్షణ కవచాలే జీడి తొక్కలు. జీడి గుడ్డు సేకరణ అనంతరం ఈ తొక్క ఎందుకూ పని రాదని ఒకప్పుడు పడేసేవారు. అవే నేడు కోట్లు కురిపిస్తున్నాయి. ఇప్పుడు తొక్క కిలో రూ.10 పలుకుతోంది. రోజుకు 300 నుంచి 400 టన్నుల వరకు జీడి తొక్కను ఆయిల్ తీయడానికి వినియోగిస్తున్నారు. ఈ మూలంగా 8000 లీటర్ల ఆయిల్‌ను సేకరిస్తున్నారు. ముడి సరుకుగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఫుల్ డిమాండ్.. పలాస–కాశీబుగ్గ జంట పట్టణాలతో పాటు పరిసర ప్రాంతాల్లో సుమారు 300 వరకు జీడిపరిశ్రమలు, జిల్లా వ్యాప్తంగా, ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో మరో 100 పరిశ్రమల్లో జీడి పప్పు తయారీ జరుగుతుంది. పప్పు సేకరణ అనంతరం జీడితొక్కను పక్కన పడేయకుండా, కొందరు వంట చెరకుగా వినియోగిస్తుంటే మరికొందరు కిలోల లెక్కన ఆయిల్ పరిశ్రమలకు విక్రయిస్తున్నారు. పలాస పరిసరాల్లో సుమారు 12 జీడి ఆయిల్ పరిశ్రమలు ఉన్నాయి. రోజుకు 4 లక్షల కేజీల జీడి పిక్కలను వినియోగించి వాటి నుంచి వచ్చే 3 లక్షల కేజీల తొక్కతో 8000 లీటర్లు ఆయిల్ సేకరిస్తారు. అనంతరం మిగిలిన పదార్థాన్ని వంటచెరకు కింద వాడుతున్నారు. రెండోసారి సది్వనియోగమయ్యే వస్తువుగా పరిగణించిన క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు కూడా జారీ చేసింది. పూర్తి ప్రోత్సాహకాలతో పాటు జీఎస్టీ రేట్లను సైతం పూర్తిగా తగ్గించింది. పరిశ్రమల్లో మంట కోసం ఇలాంటి వాటిని వినియోగించాలని కోరుతోంది. ఆయిల్ ఉత్పత్తి ఇలా.. జీడి పరిశ్రమలో లభించిన తొక్క బస్తాలను వ్యాను, లారీల్లో వే బ్రిడ్జిల వద్ద తూస్తారు. అక్కడి నుంచి కూలీల సహకారంతో ఆయిల్ పరిశ్రమలకు చేరుస్తారు. అక్కడే అసలు పరీక్ష ఉంటుంది. జీడి తొక్కలో ఆయిల్ ఉందా లేదా అని తొక్కకు పరీక్షలు జరిపి వాటిని ఆయిల్ పరిశ్రమలో మిషనరీకి బెల్టుతో పంపుతారు. కిలోల చొప్పున పంపించి వాటిని పిండి పిప్పి చేసి ఆయిల్‌ను ప్రత్యేకమైన కెనాల్ ద్వారా సిమెంట్ బావికి తరలిస్తారు. అక్కడ కొన్ని రోజులు తేటగా మారిన అనంతరం తిరిగి ట్యాంక్‌లోకి పంపించి 90 డిగ్రీల వరకు వేడి చేసి నీటిని ఆవిరి రూపంలో బయటకు పంపిస్తారు. అనంతరం డ్రమ్ములతో నింపి ట్రాన్స్‌పోర్టు లారీల్లో వివిధ ప్రాంతాలకు పంపిస్తారు. మన దేశంలో హైదరాబాద్, విశాఖపట్నం, రాజస్థాన్, పంజాబ్, బెంగళూర్‌తోపాటు విదేశాలకు పంపిస్తారు. అక్కడ ఆయిల్‌ను ఆయా కంపెనీలు వివిధ రకాలుగా రూపాంతరం గావించి వాటిని సౌత్ కొరియా, ఖతార్, వియత్నాం, రష్యా, చైనా వంటి విదేశాలకు పంపుతారు. ఉపాధి కోణం.. జిల్లా వ్యాప్తంగా జీడి పరిశ్రమలపై ఆధారపడి 20వేల మంది వరకు జీవిస్తుండగా.. జీడి తొక్క ఆయిల్ పరిశ్రమలు కూడా మరో రెండు వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఉపయోగాలెన్నో.. ఈ ముడి సరుకును రోడ్లకు వాడే తారు ఫ్యాక్టరీల్లో తారు తయారీకి, పెయింటింగ్స్ తయారీలో, వార్నిష్లు, బయోడీజిల్ తయారీకి వాడుతున్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో ఉప్పునీటి కారణంగా పెద్ద పెద్ద షిప్‌లు, బోట్లు, స్టీమర్లు, పాడైపోకుండా ఈ ఆయిల్‌ను తరచుగా పూస్తారు. విదేశాలకు ఎగుమతి.. పలాస నుంచి విదేశాలకు జీడిపప్పే కాదు జీడి ఆయిల్ సైతం ఎగుమతి కావడం మన ప్రాంత గొప్పతనంగా భావిస్తున్నాను. ప్రపంచమంతా వినియోగించే తారు, పెయింటింగ్స్, బయోడీజిల్ తయారీలో మన పలాస ఆయిల్ వాడటం మనం గొప్పగానే చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో ఆయిల్ సేకరణ పెరిగి మరింత మందికి ఉపాధి కలుగుతుంది. వైఎస్సార్ చలవతో పలాస ఇండస్ట్రియల్ ఏరియాలో మేము జీడి పరిశ్రమతో పాటు ఆయిల్ సేకరించే పరిశ్రమను ఏర్పాటు చేసుకుని నడుపుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కరోనా సమయంలో రాయితీలు అందించింది. ఔత్సాహికులకు ఇలాంటి పరిశ్రమల ఏర్పాటుకు సహకరిస్తే మరింత మేలు జరుగుతుంది. – కోరాడ శ్రీనివాసరావు, ఆయిల్ పరిశ్రమ యజమాని, ఇండ్రస్టియల్ ఏరియా, పలాస. -
పలాస జీడిపప్పుకు ప్రత్యేక గుర్తింపు
కాశీబుగ్గ: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భౌగోళిక గుర్తింపు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం 14 విశిష్టమైన వస్తువులను ఎంపిక చేసింది. అందులో శ్రీకాకుళం జిల్లా తరఫున పలాస జీడిపప్పుకు అవకాశం కల్పించింది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపడుతున్న వన్ డిస్ట్రిక్ట్–వన్ ప్రొడక్ట్‌లో భౌగోళిక గుర్తింపు ఇచ్చి అంతర్జాతీయ మార్కెట్లో ప్రాముఖ్యతను తీసుకొచ్చేందుకు ఈ ఎంపిక చేపట్టింది. స్థానికంగా ప్రాచుర్యం పొందిన విశిష్ట వస్తువులను మన ప్రాంతానికే పరిమితం కాకుండా అన్ని ప్రాంతాలకు విస్తరించి ఆదాయాన్ని తెచ్చిపెట్టడానికి, అధికంగా ఎగుమతులు పెరగడానికి తోడ్పాటునందిస్తోంది. లక్ష ఎకరాల్లో సాగు.. ఉద్దానం ప్రాంతంలోని వజ్రపుకొత్తూరు, మందస, పలాస, సోంపేట, కంచిలి, కవిటి తదితర మండలాల్లో 74 గ్రామాల్లో సుమారు లక్ష ఎకరాల్లో జీడిపంట సాగవుతోంది. సుమారు 5 లక్షల క్వింటాలు జీడిపిక్కలు దిగుబడి అవుతున్నాయి. జీడిపిక్కల బస్తా(80 కిలోలు) సుమారు రూ.13 వేలు ధర పలుకుతోంది. కరోనా కారణంగా వ్యాపారాలు నిలిచిపోవడంతో ప్రభుత్వం మద్దతు ధర రూ.10 వేలు ప్రకటించింది. ఈ పంటే ఇక్కడ ప్రజలకు జీవనాధారంగా ఉంది.ప్రస్తుతం మార్కెట్లో కిలో జీడిపప్పు నంబర్ 1 రకం కిలో రూ.800 ధర పలుకుతోంది. జిల్లాలో జీడి పరిశ్రమలు.. జిల్లాలో జీడి పంటకు కేరాఫ్‌గా నిలిచిన ఉద్దాన ఏడు మండలాల్లో అధికంగా జీడి పంటలు పండుతున్నాయి. పలాస కేంద్రంగా 300కుపైగా పరిశ్రమలు, జిల్లా వ్యాప్తంగా ఏఓబీతో కలుపుకుని 400 పైగా పరిశ్రమలు ఉన్నాయి. రోజుకు 500–600 టన్నుల జీడిపిక్కల ప్రొసెసింగ్ కు 150 టన్నుల జీడిపప్పు సిద్ధం చేస్తుంటారు. ఇలా పరిశ్రమల్లో పిక్కలు బాయిలింగ్ చేసి పప్పుగా మార్చి ఎగుమతులలో రోజుకు రూ.5 నుంచి రూ.6 కోట్లు వ్యాపారం జరుగుతుంటుంది. రూ.5–6 కోట్లకుగాను జీఎస్టీ రూపేనా రోజుకు రూ.25–30లక్షలు ప్రభుత్వానికి చెల్లిస్తుంటారు. ప్రత్యక్షంగా 15వేల మంది, పరోక్షంగా 5వేల మంది కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు. జీడి పరిశ్రమకు ప్రభుత్వ తోడ్పాటు పలాస–కాశీబుగ్గ జంట పట్టణాలతో పాటు జిల్లాలో ఉన్న 400కు పైగా పరిశ్రమలు సక్రమంగా నడవడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ ద్వారా అనేక అవకాశాలు కల్పిస్తున్నారు. గత ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు విడుదల చేశారు. వైఎస్సార్ హయాంలో.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి హయాంలో 2007లో పలాస–కాశీబుగ్గ జంట పట్టణాల్లో 30 ఎకరాల పారిశ్రామికవాడను ఏర్పాటు చేసి ఒకేచోట వందల పరిశ్రమల స్థాపనకు అవకాశం కల్పించారు. ♦పావలా వడ్డీకి రుణాలను అందించి పరిశ్రమల నిర్మాణానికి తోడ్పాటు అందించారు. ♦పరిశ్రమ యజమానులు పప్పు ఎగుమతులకు జీఎస్టీ అధికమవుతుందని విన్నవించడంతో 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. ప్రస్తుత సర్కారు హయాంలో.. ♦2014 నుంచి పరిశ్రమలకు రావాల్సిన ప్రోత్సాహకాలు 2020 ఏప్రిల్, మే నెలల్లో రూ.120 కోట్లు విడుదల చేశారు. ♦మహిళలు, యువతకు పూర్తి అవకాశాలు కల్పించాలని అధిక శాతం సబ్సిడీ అందించింది. ♦ఏఎంసీ పరంగా పన్ను వసూళ్లు స్థానిక రైతాంగానికి ఇబ్బందులు కాకూడదని రాష్ట్రప్రతి జూన్‌లో ఆమోదం తెలుపగా ఏఎంసీ లేకుండా రూ.500 కోట్లు నష్టం భరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ గత రెండు రోజులుగా అమలు చేస్తోంది. ♦పలాస మండల పరిధిలో నూతనంగా పారిశ్రామికవాడను నిర్మించడానికి కొత్తగా 30 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. అయితే చిన్నపాటి సమస్యలతో పూర్తికాలేదు. ♦ఇప్పటికే ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు కోరి వారిని నూతన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దనుంది. ♦అతితక్కువ వడ్డీ, మహిళలకు అధిక శాతం సబ్సిడీతో సరికొత్త ఎంఎస్ఎంఈ విధానాన్ని తీసుకువచ్చింది. ♦కరోనా సమయంలో జీడిపరిశ్రమలు బంద్ కావడంతో సుమారు 400–500 కోట్లు వ్యాపారం నిలిచిపోయింది. ఈ సమయంలో వ్యాపారులు ఇబ్బందులు పడకూడదని పరిశ్రమల శాఖ కరోణా రుణాలను అందించింది. ♦రూ.13వేలు పలకాల్సిన జీడి పిక్కల బస్తా కరోణా కారణంగా పూర్తి అమ్మకాలు జరగపోవడంతో ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతో రూ.10వేలు మద్దతు ధర ప్రకటించి రైతుల వద్ద కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేశారు. పలాస జీడిపప్పుకు మహర్దశ పలాస జీడిపప్పుకు చాలా ఏళ్లకు మహర్దశ వచ్చింది. పాదయాత్రలో మాకు ఇచ్చిన హామీ మేరకు 30 ఎకరాల స్థలం కేటాయింపు, బకాయిలు రూ.120 విడుదల, ఏఎంసీ రద్దు చేయడం కలిసివస్తోంది. నాడు తండ్రి, నేడు తనయుడికి వ్యాపారులమంతా రుణపడి ఉంటాం. – మల్లా రామేశ్వరం,ఇండస్ట్రీయల్ ఏరియా అధ్యక్షుడు, పలాస -
పలాస జీడి పప్పుకు కరోనా ఎఫెక్ట్
పలాస: కరోనా లాక్డౌన్లో జీడి పరిశ్రమలకు సడలింపులు ఇవ్వడంతో కార్మికులకు ఉపాధి లభిస్తోంది. అయితే వాటి ఉత్పత్తులకు మాత్రం గిరాకీ లేకపోవడంతో సంబంధిత యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీడి పప్పు ఉత్పత్తి ఎగుమతుల్లో జాతీయ స్థాయిలోనే పలాస జీడి పప్పు ప్రసిద్ధి పొందింది. కరోనా ప్రభావంతో దీనికి గతేడాది కన్నా ఈ ఏడాది గిరాకీ తగ్గింది. ఫలితంగా జీడి పప్పు నిల్వలు పేరుకుపోతున్నాయని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా సంక్రాంతి తర్వాత నుంచి జీడి పప్పు ధరలు ఎక్కువగా పెరుగుతాయి. మార్చి నుంచి మే వరకు వివిధ శుభకార్యాలు, పండగలు, ఉత్సవాలు సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు జీడి పప్పు ఎగుమతి కావడం వల్ల ధరలు కూడా అందుకనుగుణంగా పెరుగుతూ వచ్చేవి. ఈ నేపథ్యంలో కరోనా ప్రభావంతో వర్తక, వాణిజ్యం స్తంభించింది. ఆ ప్రభావం పలాస జీడి పప్పు మార్కెటుపైనా పడింది. దీంతో ధరలు అనూహ్య రీతిలో తగ్గుముఖం పట్టాయి. గతేడాది కిలో జీడి పప్పు నాణ్యత బట్టి రూ.700 నుంచి రూ.750 వరకు ఉండేది. ఈ ఏడాది నంబరు వన్ జీడి పప్పు రూ.650కు తగ్గిందని వ్యాపారులు వాపోతున్నారు. గిరాకీ తగ్గడంతో ముడిసరుకు జీడి పిక్కల ధరలు కూడా బాగా తగ్గిపోయాయి. ఉద్దానం ప్రాంతంలో ఈ సీజన్లో జీడి పిక్కలకు మంచి డిమాండ్ ఉండేది. కొనుగోలు అమ్మకాలు బాగా సాగేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. రైతులు తమ పంటకు కనీసం గిట్టుబాటు ధర 80 కిలో జీడి పిక్కల బస్తాకు రూ.15 వేలు కావాలని కోరుతుండటంతో వ్యాపారులు గ్రామాల్లోకి వెళ్లడం లేదు. ఉద్దానంలో పిక్కలు అమ్మకాలు కొనుగోలు స్తంభించిపోయాయి. ప్రస్తుతం పలాస మార్కెట్లో 80 కిలోల జీడి పిక్కల బస్తా రూ.8 వేలు ఉంది. ధరలు ఎప్పుడు పెరుగుతాయా అని ఇటు వ్యాపారులు, అటు రైతులు ఎదురు చూస్తున్నారు. -
పలాస జీడి..జిందాబాద్
జీఐ సాధనకు సహకరిద్దాం పేరొందిన బ్రాండ్‌గా తీర్చిదిద్దాలి దేశంలోనే పలాస జీడిపప్పు నెంబర్-1 పేటెంట్ హక్కు వస్తే రైతులకు, వ్యాపారులకు ప్రోత్సాహం శ్రీకాకుళం : పలాస జీడిపప్పు పేరెత్తగానే నోరూరుపోతుంది. అలాంటి జీడిపప్పుకు ఇప్పుడు ఓటేయాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో పేరొందిన ఐదు ఉద్యాన వన పంటలకు జీఐ మార్కు సాధించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. జిల్లా యంత్రాంగం, స్థానికులు, అధికారులు, వ్యాపారులు ఇప్పుడు పలాస జీడిపప్పుకు సంబంధించి మరోమారు గొప్పతనాన్ని చాటడం ద్వారా భవిష్యత్తులో మరో ట్రేడ్‌మార్క్ సాధించే అవకాశం ఉంది. పేటెంట్ హక్కుల సాధనకు రాష్ట్రంలో పేరొందిన బంగినపల్లి మామిడి, చక్కెరకేళి అరటి, దుగ్గిరాల పసుపు, పలాస జీడిపప్పు, కర్నూలు ఉల్లికి సంబంధించి జీఐ (భౌగోళిక గుర్తింపు) సాధనకు ఉద్యానవనశాఖ అధికారులకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆదేశాలొచ్చాయి. చెన్నైలో ఈ ఐదు రకాల గుర్తింపునకు రిజిస్ట్రేషన్ అవసరమై పలాస పరిధిలో చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లూ ఎగుమతి, దిగుమతికే అవసరమైన పలాస జీడిపప్పుపై ఇప్పుడు ప్రత్యేక చర్చ అవసరమైంది. పలాస జీడిపప్పు పుట్టుకు ఇక్కడే అని నిరూపించుకుంటే దేశంలోనే నెంబర్-1అయ్యే పరిస్థితితోపాటు ట్రేడ్‌మార్క్ సాధనకు వీలుంటుంది. పేటెంట్ హక్కు పొందడం ద్వారా రైతులకు, వ్యాపారులకు మరింత లబ్ది చేకూరే అవకాశం ఉంది. పలాస జీడిపప్పుకు డిమాండ్ ఉంది. పిక్కల నుంచి పప్పును వేరు చేసేందుకు పలాస ప్రాంతంలో మరెక్కడా లేని విధంగా ప్రత్యేక పద్ధతుల్ని ఉపయోగిస్తుంటారు. ఏళ్ల నుంచి ఈ పరిశ్రమ ఇక్కడ అలరారుతోంది. పలాస, వజ్రపుకొత్తూరు, మందస (ఉద్దానం)ప్రాంతాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 30వేల మంది జీడిపరిశ్రమపై ఆధారపడుతున్నారు. పలాస క్యాష్యూ మేనుఫ్యాక్చరర్స్ పేరిట 500మంది వ్యాపారులున్నారు. మూడేళ్ల వ్యవధిలో జీడి మొక్క ఏపుగా పెరిగి పంటని స్తుంది. లక్షల ఎకరాల్లో జీడి పంట సాగవుతోం ది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రభుత్వానికి పన్నురూపంలో ఆర్థికంగా బలపడాలంటే పలా స జీడిపప్పునకు ప్రాధాన్యం ఇవ్వాలని ఇక్కడి వ్యాపారులు ఎప్పటినుంచో కోరుతున్నారు. మనమేం చేయాలి? జీడిపంట ఇక్కడే ప్రాధాన్యం అంటూ ఉద్యానవనశాఖ అధికారులు థృవీకరించాలి. ఈ పంట మూలాలు ఇక్కడే ఉన్నాయని పేర్కొనాలి. పంట విస్తీర్ణం, దిగుబడి లెక్కలు చూపించాలి. రైతులు పండిస్తున్న పంట ఫోటోలు పంపించాలి. పరిశ్రమ ఎదుగుతున్న తీరు కళ్లకు కనబడేలా గణాంకాలివ్వాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జీడి పరిశ్రమ కష్టసుఖాల్ని వివరించాలి. జిల్లా యంత్రాంగం సహకారంతో తోటి వ్యాపారులు, స్థానిక నేతల ఆధ్వర్యంలో త్వరలోనే ఉద్యాన వన శాఖ అధికారులకు పలాస జీడిపప్పు ప్రత్యేకతపై ఓ నివేదిక సమర్పిస్తామని ‘ది పలాస క్యాష్యూ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్’ కార్యదర్శి మళ్ల సురేష్ కుమార్ ‘సాక్షి’కి చెప్పారు.