మమ్మల్ని బలిచేయొద్దు
♦ పేపర్ల లీకేజీపై పనామా
♦ అన్ని దేశాలకూ ఇందులో భాగస్వామ్యముంది
పనామా సిటీ: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘పనామా పేపర్స్’ వివాదంలో తమను ‘బలిపశువు’ చేయటాన్ని ఒప్పుకునేది లేదని పనామా ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘థర్డ్‌పార్టీలు తమ చర్యలతో పనామాను బలిపశువును చేసే ప్రయత్నాలను ఒప్పుకునేది లేదు. ఈ ఆర్థిక అవకతవకల్లో ప్రతి దేశానికీ భాగస్వామ్యం ఉంది. మమ్మల్ని తొక్కేద్దామని జరిగే ప్రయత్నాలను సహించం’ అని పనామా మంత్రి అల్వారో అలెమాన్ తెలిపారు. మీడియా కూడా పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకున్నాకే స్పందించాలన్నారు. పాత పరిస్థితులను మార్చి, కొత్త సంస్కరణలు తీసుకొస్తున్న విషయాన్ని విస్మరించకూడదన్నారు. కాగా, తాజా లీకేజీ నేపథ్యంలో పనామాను పన్ను ఎగవేత దారుల అడ్డాగా గుర్తించి అక్రమపన్ను ఎగవేతదారుల కేంద్రంగా హిట్‌లిస్టులో పెట్టిన ఫ్రాన్స్.. ఓఈసీడీ(ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్)ను ఇదే తరహా నిర్ణయం తీసుకోవాలంది.
యూఏఈ అధ్యక్షుడికీ ఆస్తులు
యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్కూ.. బ్రిటన్‌లోని ఓ కంపెనీలో 1.7 బిలియన్ డాలర్ల (రూ. 1130 కోట్ల) పెట్టుబడులున్నాయని ‘గార్డియన్’ పత్రిక వెల్లడించింది. సెంట్రల్ లండన్‌లోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఈయన షేర్లు పెద్దసంఖ్యలో ఉన్నట్లు తెలిసింది. గతేడాది బ్రిటన్ ప్రధాని కామెరాన్ చెప్పిన వివరాల ప్రకారం లండన్‌లో 36వేల ఆస్తులు విదేశీయులు, విదేశీ కంపెనీల అధీనంలోనివేనని తెలిసింది. మొత్తం ఇంగ్లండ్, వేల్స్లో కలిపి వీటి విలువ 122 బిలియన్ పౌండ్లు(రూ.11.45వేల కోట్లు) ఉంటుందని ఆయన తెలిపారు.
ఐస్‌ల్యాండ్‌లో ‘పైరేట్స్’ హవా
వివాదం నేపథ్యంలో ఐస్‌ల్యాండ్ ప్రభుత్వం పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఇప్పుడు ఎన్నికలు జరిపితే విపక్ష ‘పైరేట్ పార్టీ’ 42 శాతం ఓట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని సర్వేలు చెబుతున్నాయి. 2012లో స్థాపించిన ఈ పార్టీ రాజకీయాల్లో పారదర్శకత, ఇంటర్నెట్ ఫ్రీడమ్లపై ప్రజాఉద్యమాలు నిర్వహించి జనాల్లోకి వెళ్లింది. వివాదం నేపథ్యంలో ప్రస్తుత ప్రధాని గునలాగ్సన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు చెప్పిన నేపథ్యంలో ఈ సర్వే ప్రాధాన్యం సంతరించుకుంది.
పాక్‌లో మంట రాజుకుంది
పనామా పేపర్స్ వివాదంలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కుటుంబ సభ్యుల పేర్లు వెల్లడి కావటంతో.. ఆ దేశంలో వివాదం రాజుకుంది. షరీఫ్ కుంటుంబం ఆర్థిక వ్యవహారాలపై విచారణ జరిపేందుకు సిట్టింగ్ జడ్జిల నేతృత్వంలో జ్యుడీషియల్ కమిటీని ఏర్పాటుచేయాలని పాక్ విపక్షాలు మూకుమ్మడిగా డిమాండ్ చేశాయి.