ఫార్మా కంపెనీల తనిఖీ విధానం మరింత సరళంగా..
దక్షిణాసియా దేశాలతో కలసి ఉమ్మడి నియంత్రణ వ్యవస్థ
- ఏపీఐ ఎగుమతుల పెంపుపై దృష్టి
- కేంద్ర వాణిజ్య శాఖ
- సంయుక్త కార్యదర్శి సుధాంషు పాండే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతం అమల్లో ఉన్న బహుళ తనిఖీల విధానాన్ని సరళీకరించడం ద్వారా ఫార్మారంగంలో వ్యయాలను నియంత్రించవచ్చని, తద్వారా మరింత చౌకగా ఔషధాలను అందించే వీలు కలుగుతుందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఎగుమతి చేస్తున్న ప్రతీ దేశం తనిఖీలు నిర్వహించి అనుమతులు మంజూరు చేయడం వల్ల సమయంతో పాటు ధనం కూడా వృథా అవుతోందని, దీని స్థానంలో ఏకీకృత తనిఖీ విధానం రావాల్సిన అవసరం ఉందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి సుధాంషు పాండే పేర్కొన్నారు. ఫార్మెక్సిల్ 11వ వార్షిక సమావేశంలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన పాండే, తనను కలసిన విలేకరులతో మాట్లాడుతూ ఏకీకృత తనిఖీ విధానం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. ఒక దేశం తనిఖీ చేస్తే మిగిలిన సభ్యదేశాలు కూడా వాటిని ఆమోదించే విధంగా ఒక ఉమ్మడి తనిఖీ విధానాన్ని తీసుకురావాలనుకుంటున్నట్లు తెలిపారు. ఇందులోభాగంగా 12 దక్షిణాసియా దేశాల నియంత్రణ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.
ఏపీఐ ఎగుమతులు పెరగాలి..
గత కొంతకాలంగా తగ్గుతున్న ఏపీఐ (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్) ఎగుమతులను పెంచడంపై దృష్టిసారిస్తున్నట్లు పాండే తెలిపారు. ఇందుకోసం త్వరలోనే ఏపీఓ పాలసీ తీసుకురానున్నట్లు తెలిపారు. గతంలో దేశీయ ఫార్మా ఎగుమతుల్లో 90 శాతం ఏపీఐ నుంచే ఉంటే ఇప్పుడది 24 శాతానికి పడిపోయింది. గతేడాది దేశం నుంచి రూ. 95,000 కోట్ల విలువైన ఫార్మా ఎగుమతులు జరిగాయి. ఈ ఏడాది కూడా ఫార్మా ఎగుమతులు స్థిరంగా ఉంటాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
జీవీకే బయోకి క్లీన్చిట్: జీవీకే బయో తప్పుడు సమాచారంతో క్లినికల్ ట్రయల్స్ నివేదికలను తయారు చేసిందన్న ఫ్రాన్స్ నియంత్రణ సంస్థ ఆరోపణలను పాండే ఖండించారు. ఈ ఆరోపణలపై కేంద్రం ఆరుగురు సభ్యులతో కమిటీని నియమించిందని, ఈ కమిటీ పరిశీలనలో ఎటువంటి లోపాలు వెలుగు చూడలేదన్నారు. త్వరలోనే ఈ నివేదికను కేంద్రానికి సమర్పించనున్నట్లు తెలి పారు. జీవికే బయో పరిశీలించి నివేదిక ఇచ్చిన 54 ఔషధాల అ మ్మకాలను నిషేధిస్తూ పలు యూరప్ దేశాలు నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ఔషధాల విక్రయాలను నిషేధించడానికి యూరప్ నియంత్రణ సంస్థలు సరైన కారణాలు చెప్పలేకపోతున్నాయని, ఇప్పటి వరకు ఆరుసార్లు వారితో చర్చించినా స్పందన లేదన్నారు.