లోక్‌సభ ఎన్నికలపై పంజాబ్ ఎన్నారైల ఆసక్తి
లోక్‌సభ ఎన్నికలపై పంజాబ్‌కు చెందిన ఎన్నారైలు ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. పంజాబ్‌లోని 13 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 30న ఎన్నికలు జరగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పంజాబీ ఎన్నారైల్లో చాలా మంది ఇప్పటికే తమ తమ స్వస్థలాలకు చేరుకున్నారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియాల నుంచి కుటుంబాలతో సహా దాదాపు 1500 మంది ఎన్నారైలు సొంత గడ్డపై అడుగుపెట్టారు. వారిలో కొందరు కేవలం ఓటేసేందుకే పరిమితం కావాలనుకుంటుండగా.. చాలామంది మాత్రం తమకు నచ్చిన పార్టీ, లేదా అభ్యర్థి తరఫున ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు.
దేశంలో నీతిమంతమైన, పారదర్శకమైన రాజకీయ వ్యవస్థను కోరుకుంటున్నామని, అందుకే ఎన్నికల ప్రక్రియలో పాలుపంచుకునేందుకు వచ్చామని వారు చెబుతున్నారు. దాంతోపాటు భారత్‌లో నివసిస్తున్న తమవారి రక్షణ, సంక్షేమం, ఇక్కడి తమ ఆస్తుల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తున్నామని కెనడాలోని టొరంటో నుంచి వచ్చిన వ్యాపారవేత్త భూపీందర్ సిద్ధూ వివరిస్తున్నారు. అమృతసర్, లూధియానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నానన్నారు. విదేశాల్లోని భారతీయులంతా ఓటేసేందుకు ఇండియా రావడం సాధ్యం కాదని, అందువల్ల ఎన్నారైలకు ఆన్లైన్లో ఓటేసే అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఎక్కువగా ఎన్నారైలు వస్తుంటారని, ఈ సారి మాత్రం లోక్‌సభ ఎన్నికలకు కూడా భారీగా రావడం విశేషమని మాజీ ఎమ్మెల్యే జస్సీ ఖంగూరా తెలిపారు.