ఉద్యాన రైతులు విలవిల
కాశినాయన : గిట్టుబాటు ధర లేక ఉద్యాన రైతులు విలవిలలాడుతున్నారు. ఏటా పెరుగుతున్న సాగు ఖర్చులతో పాటు సమానంగా పెరగాల్సిన ధరలు అందుకు విరుద్దంగా తగ్గుతూ అన్నదాతను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నాయి. కరువు సీమలో కాసులు కురిపిస్తాయన్న ఆశతో బొప్పాయి, అరటి పంటలను సాగు చేసిన రైతులు ధరలు పతనం కావడంతో దిగాలు పడుతున్నారు. బొప్పాయి రైతులు కూలీల ఖర్చులు కూడా గిట్టుబాటు కాకపోవడంతో కాయలను తోటల్లోనే వదిలేస్తున్నారు. దీంతో కాయలు చెట్లకే మాగి రాలిపోతున్నాయి. బొప్పాయి, అరటి పంటలు చేతికొచ్చేందుకు 9 నెలల సమయం పడుతుంది. ఎకరా బొప్పాయి సాగుకు 40 వేల నుంచి 50 వేల రూపాయల ఖర్చవుతుంది. అయితే ప్రస్తుతం మార్కెట్లో టన్ను ధర 3 వేల రూపాయలు పలుకుతుంది. అయినా కూడా వ్యాపారులు పంట కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు.
అరటిపంట లేనప్పుడు ధర పెరుగుతుంది :
ఎకరా అరటిపంటను సాగు చేయాలంటే 50 వేల నుంచి 70 వేల రూపాయలు ఖర్చవుతుంది. గతేడాది ఇదే నెలలో టన్ను ధర 10 వేల నుంచి 15 వేల రూపాయల ధర పలకడంతో రైతులు కూడా మొదటి ఏడాదిలో పెట్టిన పెట్టుబడి సొమ్ము అయింది. ఢిల్లీకి చెందిన వ్యాపారులు కడప, పులివెందులలలో మకాం వేసి ప్రతిరోజు 70 నుంచి 100 లారీల అరటికాయలను ఎగుమతి చేస్తున్నారు. అయితే ప్రస్తుతం రైతుల పరిస్థితి దీనంగా మారింది. ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్కు అరటికాయలను పంపిస్తే టన్నుకు 6 వేల రూపాయలు మాత్రమే ఇస్తామని వ్యాపారులు మొండికేసి కూర్చున్నారు. అయితే ఈ సమయంలో సకాలంలో వర్షాలు లేకపోవడంతో గెల సన్నబారిపోయింది. మండలంలో 50 ఎకరాల్లో బొప్పాయి, 700 ఎకరాల్లో అరటి పంటలను సాగుచేశారు. మొదటి సంవత్సరం పంటను ప్రస్తుతం టన్ను 6 వేల నుంచి 10 వేల రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారు. రెండవ సంవత్సరం పంటకు 5 వేల నుంచి 7 రూపాయలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. రైతు సరుకు లేనప్పుడు వ్యాపారులు ధరను పెంచుతారు. అయితే ప్రస్తుతం ధరకు సరుకును అమ్ముకుంటే పెట్టుబడి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉద్యానవనశాఖ అధికారులు, పాలకులు స్పందించి అరటి, బొప్పాయి పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.