papermill
-
జక్కంపూడి రాజా దీక్ష విరమణ
-
జక్కంపూడి రాజా ఆమరణ దీక్ష విజయవంతం
సాక్షి, రాజమహేంద్రవరం సిటీ: కార్మికుల సంక్షేమం, వారి న్యాయమైన కోర్కెల సాధన కోసం కాపు కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష విజయవంతమైంది. రాజా దీక్షకు యాజమాన్యం దిగివచ్చింది. కార్మికుల రెగ్యులరైజేషన్ డిమాండ్ నిరాహార దీక్షతో నెరవేరింది. కార్మికుల సంక్షేమం కోసం నిరంతరాయంగా పోరాటం సాగిస్తామని జక్కంపూడి రాజా అన్నారు. శనివారం రాజమహేంద్రవరం పేపరుమిల్లు వద్ద కార్మికులు, వైఎస్సార్ సీపీ శ్రేణులు, పోలీసులు మోహరించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలంటూ మిల్లు ఎదుట పార్టీ శ్రేణులు నిరసన చేపట్టాయి. పోలీసులు భారీ ఎత్తున చేరుకున్నారు. రాజమహేంద్రవరం ఏపీ పేపరుమిల్లులో కాంట్రాక్ట్ పద్ధతిపై పని చేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాల్సి ఉండగా యాజమాన్యం నిర్లక్ష్యం, నిరంతృత్వధోరణి అవలంబిస్తూ వచ్చింది. కార్మికుల తరఫున ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, వైఎస్సార్ సీపీ సిటీ కో ఆర్డినేటర్ శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం ఏడాది కాలంగా పలు దఫాలు చర్చలు నిర్వహించారు. పేపరుమిల్లు యాజమాన్యం సమయం కావాలంటూ కాలయాపన చేస్తూ వచ్చింది. చివరగా జరిపిన చర్చల్లో 15వ తేదీ గురువారం తమ నిర్ణయం ప్రకటిస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడంతో శుక్రవారం మరోమారు మిల్లు ఆవరణలో చర్చలు ప్రారంభించారు. పలు దఫాలు మిల్లు యాజమాన్యం తరుఫున జీఎమ్ సూరారెడ్డి, అక్కిన జయకృష్ణ చర్చలు నిర్వహించినా విఫలయ్యాయి. దీంతో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సాయంత్రం ఐదు గంటలలోపు న్యాయమైన కోర్కెలు అంగీకరించకపోతే శాంతియుతంగా ఆమరణ నిరాహారదీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. సమయం పూర్తయినా ప్రకటన వెలువడకపోవడంతో దీక్ష దిగిన విషయం తెలిసిందే. రాజాతో పాటు సీఐటీయూ నాయకుడు సంఘీభావంగా దీక్ష చేపట్టారు. చర్చలు సఫలం మిల్లు యాజమాన్యం తరఫున జీఎం సూరారెడ్డి, జయకృష్ణ, కార్మిక శాఖ తరఫున ఎం.రామారావు, శ్రీనివాస్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, టి.అరుణ్‌తో నిర్వహించిన చర్చలు విజయవంతమయ్యాయి. ప్రధానంగా 50 ఏళ్లు దాటిన వారిని రెగ్యులరైజ్ చేయడం, మహిళలను విధుల్లోకి తీసుకోవడానికి అంగీకరించారు. యాజమాన్యం వద్ద రాజా పెట్టిన ఎనిమిది డిమాండ్లలో ఏడు డిమాండ్లను అంగీకరించి బదిలీల విషయాన్ని రెండు రోజుల్లో లేబర్ కమిషనర్ వద్ద మాట్లాడనున్నట్లు యాజమాన్యం తెలిపింది. దీక్ష విరమణ మిల్లు కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చడానికి యాజమాన్యం ఒప్పుకోవడంతో దీక్ష విరమణకు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, సీఐటీయూ నాయకుడు టి.అరుణ్ అంగీకరించారు. దీంతో జక్కంపూడి రాజాకు అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, టి.అరుణ్‌కు పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. వైద్య పరీక్షలు రెండో రోజుకు చేరడంతో వైద్యులు బీపీ, సుగర్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం కరోనా పరీక్షలు జరిపారు. డీసీసీబీ చైర్మన్ అనంత ఉదయ భాస్కర్, అనపర్తి ఎమ్మెల్యేలు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, కొండేటి చిట్టిబాబు, ధనలక్ష్మి, పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, పార్టీ రాష్ట్ర నాయకులు కర్రి పాపారాయుడు, మిండగుదిటి మోహన్, వైఎస్సార్ సీపీ సిటీ కో ఆర్డినేటర్ శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం, రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశరావు, ఆకుల సత్యనారాయణ, నగర అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, మాజీ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, యువజన నేత పోలు కిరణ్ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. -
పేపర్ మిల్లు యాజమాన్యం మెడలు వంచుదాం
నిరంకుశంగా వ్యవహరిస్తున్న యాజమాన్యం కార్మికుల్ని డిస్మిస్ చేయడం అన్యాయం అన్ని యూనియన్లు కలిసికట్టుగా రావాలి అఖిలపక్ష సమావేశంలో ఎమ్మెల్యే ఆకుల రాజమహేంద్రవరం సిటీ : రాజమహేంద్రవరం ఇంటర్నేషనల్ పేపర్‌మిల్లు యాజమాన్యం తీరుపై పలువురు ప్రజాప్రతినిధులు, కార్మిక యూనియన్ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏకపక్షంగా వ్యవహరిస్తూ కార్మికుల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల ఉద్యోగాల గురించి ప్రశ్నించిన కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ మిల్లు యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేయడం దారుణమన్నారు. పేపరుమిల్లు ఎదురుగా ఉన్న కృష్ణసాయి కల్యాణ మండపంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు మీసాల సత్యనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి అధ్యక్షతవహించిన సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ పేపరుమిల్లు యాజమాన్యం కార్మికుల పట్ల నిరంకుశ వైఖరితో వ్యవహరిస్తోందని విమర్శించారు. దాని మెడలు వంచి కార్మికులకు న్యాయం చేసేందుకు అన్ని యూనియన్లు కలసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మిల్లు స్థానికంగా ఉన్న అన్ని వసతులను వినియోగించుకుంటూ విదేశీ చట్టాలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. కుటుంబ సభ్యుల ఉద్యోగాల నియామకంపై ప్రశ్నించిన 33 మంది యూనియన్ నాయకులను సస్పెండ్ చేయడం అన్యాయమన్నారు. చర్చల అనంతరం 21 (ఒకరు మృతి చెందగా, మరొకరు పదవీ విరçమణ పొందారు) మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించిందన్నారు. మిగిలిన 10 మందిని డిస్మిస్ చేస్తున్నట్టు ప్రకటిస్తూ ఏకపక్షంగా వ్యవహరించిందని విమర్శించారు. ఈ విషయాన్ని కేంద్ర, రాష్ట్ర కార్మికశాఖ మంత్రులు దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు ఆయన తెలిపారు. సమస్యపై పోరాటం చేసిన 33 మందిపై ఒకే విధంగా చర్యలు చేపట్టాల్సిన మిల్లు యాజమాన్యం విభజించి పాలించే విధాన్ని అమలు చేసి కార్మికుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. కార్మికుల జీవితాలతో ఆటలాడుకుంటున్న యాజమాన్యంపై పోరాటం చేసేందుకు పార్టీలకు అతీతంగా అన్ని యూనియన్లు కలసిరావాలన్నారు. కార్మికులకు పూర్తి న్యాయం జరిగేంతవరకూ పోరాటానికి తాను మందుంటానని ఆయన చెప్పారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ సిటీ కో-ఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు, పేపరుమిల్లు ఆఫీసర్స్ యూనియన్ అధ్యక్షుడు టి.కె.విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిట్టూరి ప్రభాకర చౌదరి, ఐఎన్టీయూసీ నాయకుడు జోషి, సీపీఎం నాయకులు టి.అరుణ్, ఐఎఫ్టీయూ జె.వి.రమణ, యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు మల్లారెడ్డి వెంకట్రావ్, ఏఐటీయూసీ నేత కిర్ల కృష్ణారావు, కార్పొరేటర్ నండూరి వెంకటరమణ, బీజేపీ నగర మాజీ అధ్యక్షులు క్షత్రియ బాలసుబ్రమణ్యం సింగ్, పలువురు కార్మిక సంఘం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. కార్మికులకు అండగా ఉంటా పేపరుమిల్లు యాజమాన్యం వింతపోకడలతో ముందుకువెళ్తోంది. గతంలో ఎçప్పుడూ లేని విధంగా కార్మికుల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటివరకూ ఏ తప్పు లేకుండా కార్మికుల్ని సస్పెండ్ చేసిన సంఘటనలు లేవు. కార్మికుల పోరాటానికి నా సంపూర్ణ మద్దతు ఉంటుంది. - రౌతు సూర్యప్రకాశరావు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ సిటీ కో-ఆర్డినేటర్ డిస్మిస్ చేయడం అన్యాయం కార్మికులను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అన్యాయం. గతంలో ఎప్పుడూ ఉద్యోగాల నుంచి తొలగించిన పరిస్థితి లేదు. కార్మికులను భయభ్రాంతులకు గురి చేసేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోంది. కార్మికులంతా కలసికట్టుగా లేకపోతే భవిష్యత్తులో మరిన్ని దారుణాలు జరిగే ప్రమాదం ఉంది. - టి.కె.విశ్వేశ్వరరెడ్డి, పేపరుమిల్లు ఆఫీసర్స్ యూనియన్ అధ్యక్షుడు కార్మికులకు తీరని ద్రోహం మిల్లు యాజమాన్యం సమస్యలపై ప్రశ్నించిన కార్మికులను తొలగించి తీరని ద్రోహం చేసింది. కార్మిక చట్టాలను పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం వల్లే ఈ దురవస్థ ఏర్పడింది. సమస్య వస్తే కార్మికులంతా కలసికట్టుగా ఉద్యమిస్తేనే న్యాయం జరుగుతుంది. కార్మిక నాయకులు ఇప్పటికైనా ఏకతాటిపై వచ్చి పోరాటం చేయాలి. - చిట్టూరి ప్రభాకర చౌదరి, మాజీ ఎమ్మెల్యే, రాజమహేంద్రవరం అధికారులు యాజమాన్యానికి కొమ్ముకాస్తున్నారు న్యాయం కార్మికుల పక్షాన ఉన్నా కార్మికశాఖ అధికారులు మాత్రం పేపరుమిల్లు యాజమాన్యం కొమ్ముకాస్తున్నట్టుగా ఉంది. కార్మికులపై గతంలో ఏ విధమైన ఇబ్బందికర అభియోగాలు లేకపోయినా డిస్మిస్ చేస్తున్నట్టు ప్రకటించడం కార్మికుల గొంతు కోసే ప్రయత్నం. యూనియన్లు ఉంటేనే పరిస్థితి ఇలా ఉంటే.. అవి లేకపోతే కార్మికులు అనుక్షణం చిత్రవధతో బానిసలుగా ఉద్యోగాలు చేయాల్సివస్తుంది. - జోషి, ఐఎన్టీయూసీ నాయకుడు