క్షణికావేశంలో హత్యలు చేశా : శర్వానంద్
హైదరాబాద్: తన భార్య పద్మప్రియ, ఆమె తల్లి పరమేశ్వరిని క్షణికావేశంలో హత్య చేసినట్లు సాప్ట్వేర్ ఇంజనీర్ శర్వానంద్ చెప్పారు. సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిదిలో తరచూ వేధిస్తున్న భార్యను, అత్తను శర్వానంద్ హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ జంట హత్యలను తాను పథకం ప్రకారం చేయలేదని శర్వానంద్ చెప్పాడు.
పోలీసులు నిందితుడు శర్వానంద్ చెప్పిన ప్రకారం బెంగళూరుకు చెందిన పద్మప్రియకు, శర్వానంద్‌కు 2011లో వివాహం జరిగింది. ఇద్దరూ సాఫ్టవేర్ ఇంజనీర్లైన వారు బెంగళూరులోనే ఉండేవారు. అయితే పద్మప్రియకు ఇంతకు ముందే వివాహం అయింది. ఆ విషయం శర్వానంద్‌కు చెప్పకుండా మోసం చేసి పెళ్లి చేశారు. ఆ విషయం శర్వానంద్‌కు తెలిసిన తరువాత భార్యా- భర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి. ఆ తరువాత అతను వేరుగా ఉంటున్నాడు. అయినా పద్మప్రియ, ఆమె తల్లి పరమేశ్వరి శర్వానంద్‌తో తరచూ గొడవపడుతుండేవారు. అంతే కాకుండా వారు శర్వానంద్ సోదరి, బావ, అతని బంధువులతో కూడా గొడవపడేవారు. శర్వానంద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫలితంలేదు. వారి గొడవ కోర్టు వరకు వెళ్లింది.
దాంతో విసిగిపోయిన శర్వానంద్ కొద్ది కాలం క్రితం సికింద్రాబాద్ వచ్చి తన మేనమామ ముత్తు ఇంట్లో ఉంటున్నాడు. పద్మప్రియ, పరమేశ్వరిలు కూడా సికింద్రాబాద్ వచ్చి ఉంటున్నారు. రాత్రి పొద్దుపోయిన తరువాత వారు శర్వానంద్ వద్దకు వచ్చి గొడవపడుతుండేవారు. నిన్న రాత్రి 11.30 గంటల సమయంలో కూడా వారు ముత్తు ఇంటికి వచ్చి శర్వానంద్‌తో వాదనకు దిగారు. ఈ సందర్భంగా వారి మధ్య మాటామాటా పెరిగింది. ఆ తరువాత శర్వానంద్ క్షణికావేశంలో అత్త పరమేశ్వరిని గోడకు మోది హత్య చేశాడు. ఆ తరువాత భార్యకు ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. ఆ తరువాత శర్వానంద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.
లొంగిపోయిన తరువాత శర్వానంద్ మాట్లాడుతూ అటువంటి ఆడవారు ఆడజాతికే మచ్చ అన్నారు. వారిని హత్య చేయడం వల్ల పది పదిహేను కుటుంబాలు ప్రశాంతంగా ఉంటాయని చెప్పాడు. పద్మప్రియకు బెంళగూరులో 19 ఎఫైర్లు వరకు ఉన్నాయని తెలిపాడు. తమ వివాహమే చెల్లదని చెప్పాడు. తన చెల్లెలిని, బావని, ఇతర బంధువులను వారు ఇద్దరూ కలిసి వేధించేవారని చెప్పాడు. ఎప్పటిలాగే రాత్రి కూడా తన మీద దాడి చేయడానికి వచ్చారని, రచ్చ చేశారని చెప్పాడు.
ఈ హత్యలకు సంబంధించి శర్వానంద్ మేనమామ ముత్తు, మరో అయ్యప్పన్ అనే మరో వ్వక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేనమామ ముత్తు శర్వానంద్‌కు సహకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే అయ్యప్పన్కు ఈ హత్యలతో సంబంధం ఉన్నదీ లేనిదీ తెలియడంలేదు. ఈ విషయమై పోలీసులు విచారిస్తున్నారు.