లంచాలపైనే గురి..ట్రెజరీ..
- పీఆర్సీ ఆమోదానికి అక్రమ వసూళ్లు
- వేతన సవరణ కోసం భారీగా డిమాండ్
- జిల్లాలోని 18 సబ్ ట్రెజరీల్లో ఇదే పరిస్థితి
- మామూళ్లు రూ.5కోట్లు!
విజయవాడ : జిల్లాలో ట్రెజరీ అధికారులకు పండగొచ్చింది. ఉద్యోగులకు ప్రభుత్వం 43శాతం పీఆర్సీ ప్రకటించడంతో బిల్లుల పాస్ కోసం వారు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. కొత్త పేస్కేల్ ద్వారా జీతాల బిల్లు తయారుచేసేందుకు భారీగానే దండుకుంటున్నారు. దీంతో జిల్లాలోని 56 ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, చివరకు అధికారులు కూడా వేతన సవరణ కోసం ట్రెజరీ అధికారులు, సిబ్బందికి లంచాలు ముట్టజెబుతున్నారు.
పీఆర్సీ ఇలా ఆమోదిస్తారు
ఉద్యోగులకు 43 శాతం పీఆర్సీ ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వేతన సవరణ కోసం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి సంబంధిత కార్యాలయాల నుంచి ట్రెజరీలకు తమ జీతాల వివరాలు తెలియజేయాలి. డీఏ, హెచ్ఆర్ఏ, బేసిక్పే.. వివరాలు ఒక ఫార్మాట్లో పెట్టి ట్రెజరీ అధికారికి పంపి ఆమోదం పొందాలి. వారు ప్రస్తుతం పొందుతున్న డీఏను బేసిక్పేతో కలిపి దాన్ని కొత్త బేసిక్పేగా చూపిస్తారు. దీనికి డీఏ, హెచ్ఆర్ఏ కలిపి పీఆర్సీని నిర్ణయిస్తారు. ఇందుకు డ్రాయింగ్ ఆఫీసర్ ఇచ్చిన కొత్త వేతన సవరణ ప్రతిపాదనలపై సంబంధిత ట్రెజరి ఉద్యోగి, అధికారి ఆమోదం తెలియజేయాలి.
ఒక్కో బిల్లుకు రూ.వెయ్యి డిమాండ్
జిల్లాలో 56 ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న దాదాపు 50వేల మంది ఉద్యోగులు కొత్త పేస్కేల్స్ కోసం ట్రెజరీ అధికారులకు ప్రతిపాదనలు ఇస్తున్నారు. దీంతో ఒక్కో జీతం బిల్లుకు ట్రెజరీ అధికారులు వెయ్యి రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ లెక్కన జిల్లాలో 18 ట్రెజరీ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి కొత్త పీఆర్సీ పుణ్యమా అని సుమారు రూ.5కోట్ల మూమూళ్లు అందుతున్నాయని తెలుస్తోంది. విజయవాడ, మచిలీపట్నంతో పాటు అన్ని మండల కేంద్రాల ట్రెజరీల్లో సంబంధిత కార్యాలయాల వేతనాలు డ్రాచేసే సిబ్బంది.. ఉద్యోగుల నుంచి డబ్బు వసూలు చేసి అధికారులకు ముట్టజెబుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.