రాయాలీ అని రాయలేను, రచనొక జ్వరం
‘నేను దేన్నయితే నమ్మలేదో దాని గురించి ఎప్పుడూ రాయలేదు,’ అంటారు
పతంజలి శాస్త్రి. ఈ కథకుడు, నవలాకారుడు, పర్యావరణ చింతనాపరుడికి
ఇది సప్తతి సంవత్సరం. ఆ అసందర్భసందర్భమే ఈ సంభాషణకు పునాది.
పురస్కారాల పట్ల కొంత వ్యతిరేకత వ్యక్తం చేశారు...
వ్యతిరేకత కంటే అసంతృప్తి ఎక్కువ. ఏ పురస్కారం తీసుకున్నా ‘ఎవరు ఇప్పించారు గురూ’ అని అడుగుతారు. ఎందుకంటే ప్రతిభ వల్ల వచ్చేవి తక్కువ అని అందరికీ అర్థమయింది.
మీపై రచన దిశగా పడిన తొలి ప్రభావం చెప్పండి?
ఎక్కువ కుటుంబమే. ఆరో తరగతిలోనే మొదటి కథ రాశాను. ఇల్లంతా పుస్తకాలుండేవి, ఇంటికి ఎంతోమంది కవులూ గాయకులూ వచ్చిపోతుండేవాళ్లు. మూడుతరాల కవులతో నాకు ప్రత్యక్ష పరిచయం ఉంది.
మొదట్లో మిమ్మల్ని ప్రభావితం చేసిన రచయితలెవరు?
నేను కాలేజీ స్థాయికి వచ్చేసరికి- నేనే కాదు మా తరానికి అందరికీ గురువులు ఎవరంటే- మపాసా, సోమర్సెట్ మామ్, ఇక ఆ మూడో పేరు ఓ.హెన్రీ కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు. మపాసా కథకు వాతావరణాన్ని గొప్పగా సృష్టిస్తాడు. మామ్‌ను అప్పట్లో ఇష్టపడ్డాంగానీ గొప్ప రచయిత కాడు, లోతు తక్కువ. కాని కథ గొప్పగా చెప్పగలడు.
మీరు రాసే పద్ధతి ఎలా ఉంటుంది? ఎక్కువ రివైజ్ చేస్తారా, లేక ఒకే ఊపులో రాసి అదే ఖాయం చేస్తారా?
కూర్చుని కథ రాయాలీ అనుకుని రాయలేను. లోపల చిత్రమైన కదలిక మొదలై, అది జ్వరంలా మారుతుంది. అప్పుడు రాయడానికి కూర్చుంటాను. రాయడం మొదలుపెడితే ఏకబిగిన రాస్తాను. వేగంగా రాస్తాను. ఒక్కోసారి రాసింతర్వాత ఏం రాశానో నేనే గుర్తు పట్టలేను. పూర్తయ్యాకా మళ్లీ డ్రాఫ్ట్ అంటూ విడిగా రాయను గానీ, ఇంక అందులోనే మార్పులు చేస్తాను.
రాయడానికి కూర్చుంటే ముందే కథ ఆద్యంతాల పట్ల పూర్తి అవగాహన ఉంటుందా? లేక రాస్తూపోతూ దారి కనుక్కుంటారా?
రెండూను. మామూలుగా కథల విషయంలో ఎలా ముగించాలనేది ముందే ఉంటుంది. ప్రారంభమే ఉండదు. ఇలా మొదలెట్టాలీ అని ఖాయంగా అనుకోలేను. ఇన్ని పేజీలూ అనుకోను. ఎంతవరకూ వస్తే అంతటితో ఆపేస్తాను.
కథ రాసేటప్పుడు పాత్రలన్నీ నా కనుల ముందర కనిపిస్తూ ఉంటాయి. చర్మం రంగేమిటి, జుట్టు ఎలా దువ్వుకుంటుంది, ఎలా మాట్లాడుతుంది... ఇలా ప్రతి మైనరు డీటైలూ కనిపిస్తుంది. కనిపించిందంతా కథలో రాయకపోవచ్చు. కానీ కనిపిస్తుంది. కాబట్టి ముందు ఎక్కడో ఒకచోట మొదలుపెట్టేస్తాను.
నాకు ఇష్టమైన ఉదాహరణ చెప్తాను. నా ‘వీరనాయకుడు’ నవలలో నాకు ఇష్టమైన పాత్ర పూర్ణయ్య అనే ఒక వేగు పాత్ర. ఆ పాత్ర వచ్చే ముందున్న పేరాగ్రాఫులో కూడా నాకు ఆ పాత్ర వస్తుందన్న స్పృహ లేదు.
మీ కథలు కొన్ని వాస్తవికంగా సాగుతూనే ఉన్నట్టుండి దాన్నించి దూరం జరుగుతాయి...
వాస్తవికత అనేదానికి చాలా పరిమితులు ఉన్నాయి. దాని రిలవెన్స్ దానికి ఉంది, కాదనటం లేదు. కానీ కేవల వాస్తవికత అనేది creatively not inspiring for me. లాటిన్ రచయిత Mario Vargas Llosa 'The Feast’ నవల రాశాడు. డొమినికన్ రిపబ్లిక్‌ను పాలించిన ఒక నియంత జీవితం గురించి. రచయిత వాస్తవికంగానే కథ చెప్తాడు, చెప్తూనే ఏం చేస్తాడంటే, తన కథన శక్తి ద్వారా ఈ వాస్తవిక పరిమితుల నుంచి దాన్ని పైకి లేపి వదిలేస్తాడు. ఫలితంగా, అది కేవలం ఒక దేశానికి సంబంధించిన నియంత గురించి అని తెలుస్తూనే ఉన్నాగానీ మనం రిలేట్ చేసుకోగలం.
మీ ఉద్దేశం మేజిక్ రియలిజమా?
ఇది most misunderstood word. మన తెలుగువాళ్లు ఏం చేసినా అతి కదా. ఒకరకంగా ఆలోచిస్తే మన దేశానికి మేజిక్ రియలిజం కొత్త కాదు. నేను చెప్తున్నది సింబాలిజం గురించి.
మేజిక్ రియలిజం మార్క్వెజ్ నుంచి మొదలైంది. నేరేషన్లో కాలం అన్న డెమైన్షన్ను మేజిక్ రియలిస్టులు తీసి పారేశారు. కాలంతో సంబంధం లేకుండా గతాన్ని వర్తమానం చేస్తుంటారు. మనవాళ్లు దాన్ని సరిగా అర్థం చేసుకోలేదు. తెలుగు రచయితల్లో గోపిని కరుణాకర్ ఒక్కడే దానికి సమర్థుడు. అతనికే అది సహజంగా పట్టుబడింది.
కథారచన చేసినంత విస్తారంగా నవలారచన వైపు మీ దృష్టి ఎందుకు పోలేదు?
నాకు కథలంటే ఎక్కువ ఇష్టం. రాసిన నవలలు కూడా బాగా చిన్నవి. అసలు నేను- రచన ఇంతవరకూ ఉండాలి, ఈ కోవకు చెందాలి అనుకోను. అది సహజంగా ఎంతవరకూ డెవలప్ అవుతుందో అంతవరకూ పోనిచ్చి ఆపేస్తాను. కుళాయిలో నీరు పోయినంత పోయి చివరకు చుక్కలుగా మారి డ్రై అయిపోతుందే- అలాగ.
ఒక పర్యావరణ కార్యకర్తగా, కల్చర్కూ ఎకాలజీకి ఉన్న సంబంధం ఏమిటి?
మానవ సమూహం జీవిత నిర్వహణ కోసం చేసే కృషి అంతా ఆ జీవావరణ వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక స్థాయిల్లో ఈ ప్రభావం ఉంటుంది. అది ఒక జీవనవిధానాన్ని ఏర్పాటుచేస్తుంది. ఆ విధానంలో ముఖ్యమైన భాగమే సంస్కృతీ సంప్రదాయాలు.
మీకు సినిమా అంటే ఇష్టమని తెలిసింది. ఆ వైపుగా ప్రయత్నాలేమన్నా చేశారా?
దృశ్యమాధ్యమం మన క్రియేటివిటీకి కొనసాగింపు లాంటిది. మంచిసినిమా చూడటం నాకు గొప్ప ఈస్థటిక్ అనుభవం. నాలుగైదు ప్రయత్నాలు చేశాను, కుదర్లేదు. నా కథలు కొన్ని స్క్రీన్‌ప్లేగా చేస్తున్నాను.
మీకు బాగా నచ్చిన రచయితలు?
త్రిపుర, కేశవరెడ్డి, పాలగుమ్మి పద్మరాజు, చాసో, గోపిని కరుణాకర్, కాశీభట్ల... ఇలా చాలామంది. ఇంగ్లీషులో లెక్కేలేదు.
ఇంటర్వ్యూ: ఫణి
(పతంజలి శాస్త్రి ఫోన్: 9440703440)