అంతర్యామిని తెలుసుకోవడమే ఆత్మసాక్షాత్కారం
ప్రపంచకర్తలుగా, పోషకులుగా, లయకారులుగా తమనే భావించుకునే దేవతలు సకల సృష్టి సంచాలకుడైన పరమాత్మ ఆజ్ఞ లేనిదే గడ్డిపరకనైనా క దిలించలేకపోయారు. కనుక బ్రహ్మమే సర్వస్వం. అత్యున్నతం.
మనస్సు, ప్రాణం, మాట, కనులు, చెవులు ఎలా ప్రేరేపితమై మనిషినీ, మానవజాతితో సృష్టి మనుగడనూ నడిపిస్తున్నాయనే విషయాన్ని వివరిస్తుంది కేనోపనిషత్తు.
దేవతలకూ దానవులకు ఎప్పుడూ గొడవలే. ఒకసారి వారిద్దరికీ జరిగిన యుద్ధంలో విజయం సాధించిన దేవతలు అందరి ప్రశంసలూ అందుకుంటారు. పొగడ్తలతో గర్వం పెరిగిన దేవతలు తమ విజయానికి కారణమైన పరబ్రహ్మ శక్తిని మరిచారు. అహంకారంతో లోకంలో మాకంటే గొప్పవారే లేరనుకుంటూ తమను తామే ప్రశంసించుకోసాగారు. ఈశ్వరుని సర్వ శక్తిమత్వ భావనే వారి మనసులలో లేదు.
భగవంతుడు భక్తుల క్షేమాన్నే సదా కోరుకుంటాడు. దేవతలు గర్వంతో చెడిపోతారనే భావంతో వారిని ఉద్ధరించి గుణపాఠం నేర్పాలనుకున్నాడు.
అమరావతీ పట్టణంలోని నందనవనంలో ఒకనాడు ఇంద్రుని కొలువు జరుగుతుండగా పరమాత్మ అతిప్రకాశమైన యక్షరూపంలో దేవతలముందు ప్రత్యక్షమవుతాడు. మహా తేజస్సు నిండిన ఆ యక్షస్వరూపాన్ని చూసిన దేవతలు ఆశ్చర్యపోయారు.
యక్షరూప తత్వాన్ని తెలుసుకోమని దేవతలు సమర్థుడైన అగ్నిని పంపగా, అతన్నే నీవెవరు అని ప్రశ్నించింది ఆ యక్షరూపం. ప్రపంచంలోని వస్తువులనన్నీ క్షణంలో భస్మం చేయగల అగ్నిని నేనంటాడు జాతవేదుడు. ‘‘ఓ అలాగా! ఈ గడ్డిపోచను దగ్ధం చేయి’’అన్నాడు యక్షుడు. అగ్ని తన శక్తినంతా ఉపయోగించి ఓడిపోయి దేవతలను చేరాడు.
ప్రపంచం మనుగడ అంతా తన చేతుల్లోనే ఉందనుకునే వాయువును యక్షరూపం గురించి తెలుసుకుని రమ్మంటారు. ‘‘నీవెవరు?’’అని మళ్లీ యక్షుడు వాయువునడుగుతాడు. వాయువు గర్వంగా నేనే తెలియదా? ప్రపంచానికి ఊపిరే నేనంటాడు. యక్షుడు ‘‘ఈ గడ్డిపోచను నీ వాయువేగంతో ఎగురగొట్టు చూద్దాం’’ అనగానే వాయువు తన బలాన్నంతా చూపించినా గడ్డిపోచను కొంచెమైనా కదిలించలేక తోకముడిచాడు.
దేవతలందరూ చివరగా ఇంద్రుని పంపగా, యక్షరూపాన్ని ఇంద్రుడు చేరేలోపే ఆ దివ్యరూపం మాయమై పోతుంది. యక్షరూపం కనిపించక అన్నివైపులా వెదుకుతున్న ఇంద్రునికి ఆకాశంలో శోభాయమానంగా వెలుగుతూ పార్వతీ దేవి ప్రత్యక్షమైంది. ఇంద్రుడు ఆమెకు నమస్కరించి ‘‘దేవీ! దేవతలందరినీ ఆశ్చర్యపరచిన ఆ యక్షరూపమెవరిది?’’అని అడిగాడు.
జగన్మాత నవ్వుతూ ‘‘ఇంద్రా! నీవు వెదికే ఆ యక్షస్వరూపం సాక్షాత్తూ పరబ్రహ్మం. సకల చరాచర ప్రపంచమంతా నిండి ఉన్న ఆ బ్రహ్మమే మీ విజయానికి కారణం. పరబ్రహ్మను కాదని ఎంత శక్తిమంతుడైనా గడ్డిపోచను కూడా కదిలించలే రనే సత్యాన్ని తెలియజేసేందుకే ఇదంతా అని చెప్పి ఆ తల్లి అంతర్థానమవుతుంది. నిజం తెలుసుకున్న ఇంద్రుడు భగవంతుని తత్త్వాన్ని దేవతలందరికీ వివరిస్తాడు.
ప్రపంచకర్తలుగా, పోషకులుగా, లయకారులుగా తమనే భావించుకునే దేవతలు సకల సృష్టి సంచాలకుడైన పరమాత్మ ఆజ్ఞ లేనిదే గడ్డిపరకనైనా క దిలించలేకపోయారు. కనుక బ్రహ్మమే సర్వస్వం. అత్యున్నతం.
- ఇట్టేడు అర్కనందనాదేవి
మీకు తెలుసా?
సమస్త ప్రపంచం తన స్వరూపంగా భావించేవారికి ఈర్ష్య, ద్వేషం, అసూయ, అసహ్యం, రాగం ఉండవు.
అశాశ్వతమైన జీవితం కోసం కర్మలు చేసేవారు గాఢాంధకారంలో, సామాన్యమైన జ్ఞానంతోనే తృప్తిపడేవారు అంతకంటే చీకటిలో మగ్గిపోతారు.
బ్రహ్మమంటే ఏమిటి?
ఈ సమస్త సృష్టీ దేనినుండి పుట్టిందో, ఆవిర్భవించిన సృష్టి దేనిపై ఆధారపడి నిలబడి... మనుగడ దిశగా సాగిందో, చివరికి దేనిలో లీనమవుతుందో ఆ మూలతత్త్వమే బ్రహ్మం.
ఏ ఉపనిషత్తులో ఏముంది?
జీవకోటికి ఆనందమే ధ్యేయం. మూలస్వరూపం. అదే బ్రహ్మం. ఆత్మస్వరూపం. ఆనందం నుండే ప్రాణికోటి ఆవిర్భవిస్తుంది. ఆనందం చేతనే జీవిస్తుంది. ఆనందంలోనే లయమవుతుందని చెప్పడమే తైత్తిరీయ ఉపనిషత్తు సారం.
ప్రాపంచిక విషయాలను మనిషెన్నడూ సాధారణ దృష్టితో చూడలేడు. ప్రగాఢమైన ఎల్లలు లేని ఏదో ప్రజ్ఞ సృష్టిని నడిపిస్తుందని అతని అనుమానం. ఎలా...? ఎలా...? అనే అన్వేషణకు సమాధానం చక్కగా వివరిస్తుంది కేనోపనిషత్తు.