ఆ ఒక్కడి కోసం మహానగరం కదిలింది..
లండన్: అతని స్థాయి.. సాధారణ కానిస్టేబుల్. కానీ తెగువ కొలవాలంటే సాధనాలు సరిపోవు! దేశాన్ని కాపాడిన హీరో. అందుకే అతని వెంట ఊరు ఊరంతా కదిలింది.. సంఘీభావంతో మైళ్ల దూరం నడిచింది! బ్రిటన్ పార్లమెంట్‌పై ఉగ్రదాడి ఘటనలో వీరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన పోలీస్ కానిస్టేబుల్ కీత్ పామర్‌కు లండన్ యావత్తూ ఘన నివాళులు అర్పించింది. సోమవారం నిర్వహించిన అంతిమయాత్ర.. అసాధారణరీతిలోసాగింది.
హోదాతో సంబంధంలేకుండా బ్రిటన్‌లోని అన్ని పోలీసు శాఖలకు చెందిన ఉద్యోగులు కీత్ పామర్ అంతిమయాత్రలో పాల్గొన్నారు. అతను ప్రాణాలు కోల్పోయిన బ్రిటన్ పార్లమెంట్ భవనం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర.. రెండు మైళ్లదూరంలోని స్మశానవాటికలో ముగిసింది. రోడ్డుకు ఇరువైపులా పోలీసులు, వారి వెనుకే జనం నిలబడి కీత్ పామర్ స్ఫూర్తిని గుర్తుచేసుకున్నారు. ఈ క్రమంలో అతని కుటుంబసభ్యులు, కలిసి పనిచేసిన ఉద్యోగినులు కంటతడిపెట్టారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు.
మార్చి 22న బ్రిటన్ పార్లమెంట్‌పైకి కారులో దూసుకొచ్చిన ముష్కరుడు.. పోలీసుపై కత్తితో దాడి చేసి హత్యచేశాడు. అంతకుముందు థేమ్స్ బ్రిడ్జిపై కారుతో బీభత్సం సృష్టించి ఇద్దరు పాదచారులను పొట్టనబెట్టుకున్నాడు. పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగానే ఈ ఘటన చోటుచేసుకోవడంతో దేశం ఉలిక్కిపడింది.
(చదవండి: బ్రిటన్ పార్లమెంట్‌పై టెర్రర్ అటాక్)
(బ్రసెల్స్ దాడి జరిగిన రోజే లండన్ లో... )
(ఖలీద్ మసూద్ అలియాస్ అడ్రియన్ రస్సెల్)