టీడీపీలో గుర్తింపు లేదు..
అందుకే వైఎస్సార్ సీపీకి ఓటేశా..
పెడన 15వ వార్డు కౌన్సిలర్ లంకే స్రవంతి
పెడనటౌన్ (ఈడేపల్లి) : తెలుగుదేశం అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా ఇప్పటికీ పార్టీలో గుర్తింపు లేదని అందుకే తాను వైఎస్సార్ సీపీకి ఓటు వేశానని పెడన మున్సిపల్ కౌన్సిలర్(15వ వార్డు) లంకే స్రవంతి వెల్లడించారు. ఓటింగ్ అనంతరం ఆమె మాట్లాడుతూ నేటికీ తనకు కౌన్సిలర్ గా గుర్తింపు లేదన్నారు. వార్డు సమస్యలను మున్సిపల్ చైర్మన్, అధికారులకు చెబుతున్నా పట్టించుకోవడం లేదన్నారు.
తన ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్ కోసం కార్యాలయం చుట్టూ ఆరునెలలపాటు ప్రదక్షిణలు చేశానని చెప్పారు. తన వార్డులో ఒక్క అభివృద్ధి పని చేయలేదని, నిధులు కూడా విడుదల చేయ లేదన్నారు. మరి కొన్ని వార్డులలో కూడా ఇదే పరిస్థితి ఉందన్నారు. అందువల్లనే తాను టీడీపీ అభ్యర్థికి మద్దతు తెలుపలేదన్నారు. వైఎస్సార్ సీపీకి పట్టంకడితే పూర్తిస్థాయిలో పట్టణాభివృద్ధి జరుగుతుందని నమ్మి తాను ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు.
ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు ప్రారంభోత్సవాలకు, శంకుస్థాపనలకు మినహా అసలు పెడనలో కనిపించడం లేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆదర్శంగా తీసుకుని వైఎస్సార్ సీపీని గెలిపించడానికి పూనుకున్నట్టు తెలిపారు. అయితే.. తాను అమ్ముడుపోయానని టీడీపీ కౌన్సిలర్లు దుష్ర్పచారాలు చేస్తున్నారన్నారు. దమ్ముంటే వాటిని నిరూపించాలని టీడీపీకి ఆమె సవాల్ విసిరారు. అనంతరం నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి ఉప్పాల రాముకు కృతజ్ఞతలు తెలిపారు.