శుభకార్యానికి వెళ్తూ...అనంత లోకాలకు
మార్కాపురం: మొద్దుల లోడుతో వేగంగా వస్తున్న ట్రాక్టర్.. ఆటోను ఢీకొనడంతో ముగ్గురు మృతిచెందగా, నలుగురికి తీవ్ర గాయాలైన సంఘటన మంగళవారం రాత్రి మార్కాపురంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కర్నూలు జిల్లా సున్నిపెంటకు చెందిన గంపల పెద్దపోలయ్య మూడేళ్ల నుంచి పెద్దదోర్నాల మండలం చిన్నగుడిపాడులో నివాసం ఉంటున్నాడు.
మార్కాపురం పట్టణ పరిధిలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి కుటుంబ సభ్యులతో హాజరయ్యేందుకు మంగళవారం రాత్రి మార్కాపురం వచ్చి ఆటోలో బయలుదేరాడు. మరో ఐదు నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకుంటారనగా డ్రైవర్స్ కాలనీ దగ్గరకు రాగానే ఎదురుగా మొద్దుల లోడుతో వేగంగా వస్తున్న ట్రాక్టర్ ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో గంపల పోలయ్య కుమారుడు దినేష్ (9), మరదలు ఎస్తేరు రాణి అలియాస్ ప్రశాంతి (13), ఆటో డ్రైవర్ స్థానిక కొండారెడ్డికాలనీకి చెందిన కిశోర్ (25) అక్కడికక్కడే మృతిచెందారు.
పోలయ్య తో పాటు, అతని భార్య విజయమ్మ, కుమార్తె జెస్సీ, కుమారుడు జశ్వంత్‌లు గాయాలపాలయ్యారు. విజయమ్మ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో గుంటూరు తరలించాల్సిందిగా వైద్యులు సూచించారు. మిగిలిన వారికి స్థానిక ఏరియా వైద్యశాలలో చికిత్స చేస్తున్నారు. సంఘటనకు కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ బలరాంరెడ్డి ట్రాక్టర్‌తో సహా ఉడాయిస్తుండగా పట్టణ శివారుల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ జి.రామాంజనేయులు, సీఐ శివరామకృష్ణారెడ్డి, ఎస్సై ఉయ్యాల రాంబాబులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బంధువుల రోదనతో, రక్తపుమడుగుతో సంఘటన స్థలం భీతావహంగా ఉంది.