పీర్ల ఊరేగింపులో ఉద్రిక్తత
పుట్లూరు : యల్లనూరు మండలం పెద్దమల్లేపల్లిలో ఆదివారం రాత్రి పీర్ల ఊరేగింపు సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. యల్లనూరుకి చెందిన పీర్లు పెద్దమల్లేపల్లిలో మోహరం వేడుకల్లో భాగంగా ఊరేగింపు నిర్వహించడం ఆనవాయితీ. అయితే ఆదివారం పీర్లను ఊరేగిస్తుండగా రామకృష్ణ అనే వ్యక్తి తన ఇంటి వద్దకు పీర్లు రావాలని పట్టుబట్టడంతో గ్రామస్తులు గతంలో లేని విధంగా పీర్లను పంపడం కుదరదని వాగ్వాదానికి దిగారు.
ప్రతి ఇంటి వద్దకు వెళ్లడం జరగదని గతంలో ఉన్న ఆనవాయితీ ప్రకారం ఊరేగింపు జరుగుతుందన్నారు. సమస్య తీవ్రంగా మారుతున్న విషయం తెలుసుకున్న యల్లనూరు ఎస్సై హరినాథ్‌రెడ్డి, తాడిపత్రి రూరల్ ఎస్సై నారాయణరెడ్డి గ్రామస్తులతో చర్చించారు. ఈ ఏడాది మాత్రమే రామకృష్ణ ఇంటి వద్దకు పీర్లను పంపి భవిష్యత్తులో గ్రామ కట్టుబాట్ల ప్రకారం ఊరేగింపు నిర్వహించుకోవాలని గ్రామస్తులకు సూచించారు.