‘పీసా’తో గిరిజన సాధికారిత
భద్రాచలం, న్యూస్‌లైన్: షెడ్యూల్డ్ ఏరియాలో పీసా (ప్రొవిజన్ ఆఫ్ పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ టు ది షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్) పటిష్టంగా అమలయితే గిరిజన సాధికారిత సాధించవచ్చని ఐటీడీఏ పీఓ వీరపాండియన్ అన్నారు. పీసా చట్టంపై భద్రాచలంలోని జడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో శుక్రవారం అధికారులు, సర్పం చులకు శిక్షణ కార్యక్రమం జరిగింది.
ఇందులో ముఖ్య అతిధిగా పీఓ వీరపాండియన్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. చట్టాలకు లోబడి అటవీ సంపదపై సర్వ హక్కులు పొందవచ్చని అన్నారు. పీసా చట్టం పకడ్బందీగా అమలుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇందుకోసం ఏజెన్సీలో ఎంపిక చేసిన పదిమంది సర్పంచులకు భద్రాచలంలో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఆ తరువాత, వీరు గ్రామాల్లో సదస్సులు నిర్వహించి ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటారని చెప్పారు. పం చాయతీరాజ్ చట్టం ప్రకారం ఏడాదికి నాలుగుసార్లు గ్రామ సభలు ఏర్పాటు చేయాల్సిన అవసరముందని అన్నారు. గ్రామ పంచాయతీలోని శివారు గ్రామాల్లో కూడా అవసరమైన సందర్భాల్లో గ్రామసభలు నిర్వహించుకోవచ్చన్నారు. సర్పంచ్ అధ్యక్షతన జరిగే గ్రామసభలో ఉపాధ్యక్షడు, కార్యదర్శిని ఎంపిక చేసుకోవాల్సుంటుందని అన్నారు.
గ్రామ ప్రజల అభిప్రాయానికి అనుగుణంగానే అభివృద్ధి పనుల ఎంపిక ఉంటుందన్నారు. గ్రామాభివృద్ధి పనులను సత్వరమే పూర్తిచేసి నివేదిక ఇస్తే వాటికి సంబంధించిన నివేధికలను ఇస్తే తిరిగి మరిన్ని పనులు చేపట్టే అవకాశముంటుందని అన్నారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన పనులపై కూడా గ్రామ సభ చర్చించవచ్చన్నారు. గ్రామస్థాయిలోని ప్రభుత్వ ఉద్యోగులపై కూడా గ్రామ సభ ద్వారా అజమాయిషీ చేయవచ్చని అన్నారు. వారు సరిగా పనిచేయనట్టయితే తొలగించే అధికారం కూడా గ్రామ సభకు ఉంటుందని చెప్పారు. ఉన్నత లక్ష్యంతో ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. ఈ చట్టం సవ్యంగా అమలయ్యేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని కోరారు. పీసా చట్టం అమలులో సర్పంచుల పాత్ర కీలకమైందని అన్నారు.