నగదు విత్‌డ్రా పైనా పన్ను!
రోజుకు రూ. 50,000 మించితే విధించాలని కమిటీ సిఫార్సు
న్యూఢిల్లీ: వ్యక్తిగత ఖాతాదారులు బ్యాంకుల నుంచి రోజుకి రూ. 50,000కు మించి నగదు ఉపసంహరించుకుంటే పన్ను విధించాలంటూ పార్థసారథి షోమ్ కమిటీ సిఫార్సు చేసింది. తద్వారా బ్లాక్‌మనీకి చెక్ పెట్టవచ్చునని అభిప్రాయపడింది. గత యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిటీ రూపొందించిన నివేదికను మంగళవారం విడుదల చేశారు. బ్యాంకు ఖాతాల నుంచి జరిగే నగదు విత్‌డ్రాయల్స్ వివరాల్ని సమీకరించే సాధనమేదీ ప్రస్తుతం లేదని, ఈ సాధనం వల్ల నల్లధనం వినియోగానికి సంబంధించిన సమాచారం ఆదాయపన్ను శాఖకు తెలుస్తుందని కమిటీ అభిప్రాయపడింది.
అలాగే సంపన్న రైతులను పన్ను పరిధిలోకి తీసుకురావాలని కమిటీ ప్రతిపాదించింది. పన్ను ఎగవేతదారులకు సెటిల్మెంట్ అవకాశాలను కల్పించే ఆమ్నెస్టీ పథకాలపట్ల కమిటీ వ్యతిరేకతను వ్యక్తం చేసింది. బ్యాంకు ఖాతాల నుంచి నగదు ఉపసంహరణలకు సంబంధించిన వివరాలను అందించేందుకు ప్రస్తుతం సరైన వ్యవస్థ లేదని, ఇలాంటివి ఏర్పాటు చేస్తే ఆదాయపన్ను శాఖకు ప్రయోజనకారిగా ఉంటుందని వ్యాఖ్యానించింది. వ్యవసాయ ఆదాయానికి సంబంధించి రూ. 5 లక్షల వరకూ పన్ను మినహాయింపు ఉన్నదని, ఇంతకు మించి భారీగా ఆదాయం పొందుతున్న రైతులను పన్ను పరిధిలోకి తీసుకురావలసి ఉందని పేర్కొంది. ఇది పన్ను చెల్లింపుదారుల పరిధిని పెంచుతుందని తెలిపింది.