ప్రశాంతంగా ఇంజినీరింగ్ కౌన్సెలింగ్
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: స్థానిక డీఎస్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలోని ఎంసెట్-2013 హెల్ప్‌లైన్ సెంటర్లో ఇంజినీరింగ్, ఫార్మసీ కౌన్సెలింగ్ శనివారం రాత్రి 9 గంటల వరకు కొనసాగింది. ఈ హెల్ప్‌లైన్ సెంటర్లోనే మొత్తం 450 మంది విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకుని సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారు. ఈ సెంటర్‌కు 80001 ర్యాంకు నుంచి 90000 ర్యాంకు వరకు విద్యార్థులను కేటాయించారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పీజీ సెంటర్ అధ్యాపకులు, సిబ్బంది సమైక్యాంధ్రకు మద్దతుగా శనివారం సామూహిక సెలవు పెట్టడంతో అక్కడ ఎంసెట్ కౌన్సెలింగ్ నిలిచిపోయింది. దీంతో ఆ కేంద్రానికి కేటాయించిన 90001 ర్యాంకు నుంచి 1,00,000 ర్యాంకు వరకు విద్యార్థులు పేర్లు నమోదు చేసుకునేందుకు ప్రభుత్వ మహిళా కళాశాలకు వచ్చారు. దీంతో ఈ సెంటర్లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి వరకు కౌన్సెలింగ్ నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వీఎన్ రాజ్యలక్ష్మి తెలిపారు.
సమైక్యాంధ్ర సమ్మె వల్ల ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ముందుగా విద్యార్థినీల సర్టిఫికెట్లు పరిశీలించి పంపించారు. తర్వాత మిగిలిన వారి సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమాన్ని కొనసాగించారు. మొత్తం 450 మంది విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించినట్లు ఆమె తెలిపారు. 1,00,001 నుంచి 1,10,000 వరకు ర్యాంకు అభ్యర్థులు ఆదివారం కళాశాలలో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని రాజ్యలక్ష్మి తెలిపారు.
పీజీ సెంటర్ బంద్
రాష్ట్ర విభజనను నిరసిస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని యూనివర్సిటీ, పీజీ సెంటర్లు, పీజీ కళాశాలలను శనివారం బంద్ పాటిస్తున్న నేపథ్యంలో ఇక్కడ పీజీ సెంటర్లోని అధ్యాపకులు, సిబ్బంది సామూహిక సెలవు పెట్టి బంద్ పాటించారు. స్పెషలాఫీసర్ డాక్టర్ రాజమోహనరావు ఆధ్వర్యంలో అధ్యాపకులు, సిబ్బంది నిరసన చేపట్టారు. దీంతో పీజీ సెంటర్లో ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ నిలిచిపోయింది. ఆదివారం కౌన్సెలింగ్ యథావిధిగా జరుగుతుందని రాజమోహనరావు చెప్పారు. ఆదివారం కౌన్సెలింగ్‌కు 1,10,001 నుంచి 1,20,000 ర్యాంకు వరకు విద్యార్థులు హాజరు కావాలని ఆయన కోరారు. శనివారం కౌన్సెలింగ్‌కు కేటాయించిన ర్యాంకుల అభ్యర్థులు కూడా హాజరు కావచ్చని చెప్పారు.