సలామ్ ఫౌజా సింగ్
102 సంవత్సరాలు... ఓ మనిషి ఇన్నేళ్లు బతకడమంటేనే అత్యంత అరుదైన విషయం.. ఓ వేళ బతికినా చక్రాల కుర్చీకో.. ఓ గదికో పరిమితమవడం సహజం.. కానీ ఫౌజా సింగ్ కథ వేరు.. ఈయన దృష్టిలో వయస్సు అనేది కేవలం సంఖ్య మాత్రమే... ఎందుకంటే ఈ ప్రపంచంలో అత్యంత ఎక్కువ వయస్సు కలిగిన మారథాన్ రన్నర్ ఆయనే... ఇంకా విచిత్రమేమిటంటే 89 ఏళ్ల ముదిమి వయస్సులో ఈ క్రీడను ఆయన సీరియస్‌గా తీసుకోవడం.
ఏదో మామూలుగా కాకుండా 9 ఫుల్ మారథాన్‌లో పాల్గొని ఎందరో యువ రన్నర్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.. ఇప్పటికీ రోజూ నాలుగు గంటలపాటు వాకింగ్, రన్నింగ్, జాగింగ్ చేయనిదే ఆయన దినచర్య ప్రారంభం కాదు.. అందుకే ఈ ఫౌ(జియో)జాకు ఎవరైనా సలామ్ కొట్టాల్సిందే..
1911, ఏప్రిల్ 1...పంజాబ్‌లోని జలంధర్‌లో ఫౌజా సింగ్ జన్మించాడు. నలుగురు పిల్లల్లో చివరివాడు. చిన్నప్పుడు అతడి కాళ్లు చాలా సన్నగా, బలహీనంగా వుండడంతో ఐదేళ్లు వచ్చే వరకు అసలు నడవలేకపోయాడు. తోటి పిల్లల హేళనను సవాల్‌గా తీసుకున్న తను యుక్త వయస్సులో రన్నర్‌గా మారాడు. అయితే భారత్, పాక్ విభజన సమయంలో దీనికి తెర దించాడు. ఆ తర్వాత 90వ దశకంలో తన జీవితంలో కొన్ని విషాద సంఘటనలు జరిగాయి. తన భార్య, కుమారుడు, కుమార్తె వివిధ కారణాల రీత్యా మరణించడంతో ఒంటరి వాడైన ఫౌజా తిరిగి రన్నింగ్‌పై దృష్టి పెట్టాడు.
ఇదే సమయంలో ఇంగ్లండ్ వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. 89 ఏళ్ల వయస్సులో ఇక మారథాన్‌పై సీరియస్‌గా తీసుకున్నాడు. ఆ వయస్సులో తను సులువుగా 20 కి.మీ పరిగెత్తే వాడు. అందుకే మారథాన్‌లో పాల్గొనాలని భావించాడు. అయితే ఇక్కడ తను 26 మైళ్ల (42 కి.మీ.)కు బదులు మారథాన్ 26 కి.మీ దూరం ఉంటుందని భావించాడు. కోచ్ అసలు విషయం వివరించడంతో ఆ దూరాన్ని సవాల్‌గా తీసుకుని తదేక దీక్షతో ప్రాక్టీస్ చేశాడు.
ప్రపంచ రికార్డు...
2000, లండన్ మారథాన్. అందరి దృష్టీ 89 ఏళ్ల ఫౌజా సింగ్ పైనే. ఏదో సరదాకి వచ్చాడనే అనుకున్నారంతా. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రేసును పూర్తి చేశాడు. 2003లో ఇదే రేసును 6 గంటల 2 నిమిషాల్లో పూర్తి చేసి తన అత్యుత్తమ సమయాన్ని నమోదు చేశాడు. ఇక 2004లో ఈ పంజాబీ పుత్తర్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. 93 ఏళ్ల వయస్సులో 26.2 మైళ్ల దూరాన్ని 6 గంటల 54 ని.ల్లో అధిగమించి ఔరా! అనిపించుకున్నాడు.
ఎందుకంటే అప్పటిదాకా 90+ వ్యక్తుల కన్నా 58 నిమిషాల తక్కువ వ్యవధిలోనే ఆ రేసును పూర్తి చేయగలిగాడు. అలాగే తన వయస్సు కేటగిరీల్లో 200మీ. 400మీ. 800మీ. 3000మీ. రేసులో యూకే రికార్డులన్నీ తన పేరిటే ఉన్నాయి. వందేళ్ల వయస్సులో ఒకే రోజు 8 రేసులను పరిగెత్తిన ఫౌజా ప్రపంచ రికార్డు సృష్టించాడు.