అటకెక్కిన సర్కారీ ఫోన్ల సిమ్‌లు
పల్లెల్లో సత్వరమే పశువైద్యం అందించేందుకు, అత్యవసర పరిస్థితుల్లో పశుపోషకులకు అందుబాటులో ఉండేందుకు పశు వైద్యాధికారులకు ప్రభుత్వం అందజేసిన ఫోన్ల సిమ్‌లు మూలనపడి ఉన్నాయి. సిమ్ల వాడకంలో వైద్యాధికారుల నిర్లక్ష్యంతో అవి నిరుపయోగంగా ఉన్నాయి.
- పశుపోషకులకు యాతనలు
ఒంగోలు టూటౌన్ : పశువైద్యాధికారులకు సర్కార్ సరఫరా చేసిన ఫోనల సిమ్‌లకు (నెంబర్లు) విలువ లేకుండా పోతోంది. సొంత ఫోన్ నంబర్‌కు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారు. సర్కార్ సరఫరా చేసిన సిమ్‌ను పక్కన పడేశారు కొంతమంది పశువైద్యాధికారులు. నాలుగేళ్ల క్రితం మంజూరు చేసిన ఎయిర్టెల్ సిమ్‌లను పట్టుమని పదిమంది కూడా వాడటం లేదని సమాచారం. పశువులకు తక్షణ వైద్యసదుపాయాలు కల్పిచేందుకు పశువైద్యాధికారులందరూ ఫ్రీగా వాడుకునే ‘ కామన్ యూజర్ గ్రూప్’ ఫోన్ నంబర్ల వాడకంలో పశువైద్యాధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు.
నాలుగేళ్ల క్రితమే మంజూరు
జిల్లాలో పశుపోషకులకు అందుబాటులో ఉంచి పశువులకు సకాలంలో వైద్య సేవలందించాలనే లక్ష్యంతో సర్కార్ కామన్ యూజర్ గ్రూప్ (సీయుజీ)కింద ఎయిర్ టెల్ ఫోన్ సిమ్‌లను పశువైద్యాధికారులకు నాలుగేళ్ల క్రితం మంజూరు చేశారు.
కందుకూరు డివిజన్ అధికారులకు 8790997087 ఫోన్ నంబర్ నుంచి 8790997113 ఫోన్ నంబర్ వరకు 40 మందికి సిమ్‌లు ఇవ్వడం జరిగింది. ఇదేవిధంగా మార్కాపురం, ఒంగోలు డివిజన్లలో పనిచేసే పశువైద్యాధికారులకు కూడా మిగిలిన ఫోన్ నంబర్లను సీరియల్ ప్రకారం అందజేశారు. వీరితో పాటు జిల్లాలో మొత్తం 124 మంది పశువైద్యాధికారులకు వీటిని మంజూరు చేశారు.
పశుపోషకులకు తెలియని ఫోన్ నంబర్లు
జిల్లాలోని 56 మండలాల్లో 1030 గ్రామ పంచాయతీల పరిధిలో మరికొన్ని అదనపు గ్రామాలున్నాయి. గొర్రెలు, మేకలు మొత్తం 18 లక్షల వరకు ఉన్నాయి. వేల సంఖ్యలో పశువులు ఉన్నాయి. దాదాపు లక్ష వరకు పాడి పశువులు ఉన్నాయి. 400 గొర్రెల సొసైటీలు ఉన్నాయి. నూటికి 90 శాతం మంది పశుపోషకులకు, గొర్రెలు, మేకల పెంపకందారులకు ప్రభుత్వం పశువైద్యాధికారులకు సరఫరా చేసిన ఫోన్ నెంబర్ గురించి తెలియని పరిస్థితి జిల్లాలో నెలకొంది. పశువులకు, గొర్రెలు, మేకలకు ఏదైనా అనుకోని ప్రమాదం సంభవిస్తే.. పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకమే. చాలా గ్రామాల్లో పశువైద్యాధికారులు వాడుకుంటున్న సొంత ఫోన్ నంబర్లు కూడా పశుపోషకులకు, గొర్రెల, మేకల పెంపకం దారులకు తెలియదు. ఇప్పటికైనా ఆ శాఖ జిల్లా అధికారులు డిపార్ట్మెంట్ సరఫరా చేసిన ఫోన్ నంబర్లు ఎంత మంది వాడుతున్నారో విచారించి గ్రామాల్లో పశుపోషకులు ఆ ఫోన్ నంబర్లు అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని పలువులు పశుపోషకులు, గొర్రెల పెంపకందారులు కోరుతున్నారు.