వారంతా చిరంజీవులే!
గత సంవత్సర కాలంగా సినీ ప్రముఖులు అనేక మంది ఎన్నడు లేని విధంగా వరుసగా అసువులు బాయడం బాధాకరమైన విషయం. చిత్రపరిశ్రమ దిగ్ధంతులు ఒక్కొక్కరు అర్ధాంతరంగా, సహజంగా, అసహజంగా తెరమరుగవుతున్నారు. దీంతో సినీ అభిమానులు తమ ఆప్తులను కోల్పోయినట్లు విచారంలో మునుగుతున్నారు. మహా నటీనటులు అంజలిదేవి, అక్కినేని నాగేశ్వరరావు, దర్శకులు, రచయిత వి.బి.రాజేంద్రప్రసాద్, బాపు, బాలచందర్, గణేశ్ పాత్రో, యువ కథానాయకుడు ఉదయ్‌కిరణ్, క్యారెక్టర్ యాక్టర్ పి.జె.శర్మ, శ్రీహరి, ఆహుతి ప్రసాద్, తెలంగాణ శకుంతల, సంగీత దర్శకుడు, గాయకుడు చక్రి, ప్రేక్షకులను తమ హాస్య సంభాషణ, నటనలతో ఉర్రూతలూగించిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఏవీఎస్, ఎం.ఎస్.నారాయణ లాంటి తమకు తామే సాటైన హాస్యనటులు ఈ భూప్రపంచం నుండి, సినిమాలోకం నుండి జారిపోవడం అభిమానులను తీవ్రంగా కలచివేస్తోంది. ఈ నేపథ్యంలో మన కళాకారులందరికీ ఒక విన్నపం. వారు ఆరోగ్యాన్ని అతి జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ జన్మలన్నీ అపురూపమైనవి. ఆ జిలుగుల ప్రపంచంలో ఈ విషయాన్ని చాలామంది విస్మరిస్తున్నారు. ఇకనైనా నటీనటులు ఆరోగ్యం కోసం జాగ్రత్త పడాలి. భౌతికంగా కనిపించకపోయినా వారు తీసిన సినిమాలు, చూపిన ప్రతిభ, అందించిన సంగీతం, నేడు మనకు కనిపించకపోయినా ఆయా చిత్రాలలో లీనమై చేసిన పాత్రలు ఎన్నటికీ జీవించే ఉంటాయి. ఎన్ని తరాలు గడిచినా కళ్లముందు కదలాడుతూనే ఉంటాయి. ఆ రకంగా వారు ఎప్పుడూ చిరంజీవులే. వారి కుటుంబాలకు మా ప్రగాఢ సంతాపం.
- జి.వి. రత్నాకర్‌రావు వరంగల్