బోదకాలు బాధితుల బాధ తీరేదెన్నడు?
కామారెడ్డి అర్బన్ : బోదకాలు (పైలేరియా) బాధి తులకు ఈ నెలలో కూడా ‘ఆసరా’ అందే పరిస్థితి కనిపించడం లేదు. ఏప్రిల్ నుంచే పెన్షన్ మంజూరు చేస్తా మని ప్రకటించిన సర్కారు.. ఇంతవరకు మార్గదర్శకాలే జారీ చేయలేదు. దీంతో అర్హులైన లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. పైలేరియా బాధితులకు పెన్షన్ మంజూరు చేయాలని సర్కారు నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో వికలాంగులకు ఇస్తున్నట్లు తమకు కూడా రూ.1500 చొప్పున ఇవ్వాలని బోదకాలు బాధితులు కోరుతున్నారు.అయితే, బోదకాలు తీవ్ర రెండు, మూడో దశలో ఉంటే రూ. 1000 చొప్పున మంజూరు చేయాలని వైద్యారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ నుంచి రూ.వెయ్యి చొప్పున అందించాలని ఉత్వర్వుల్లో పేర్కొంది. జిల్లాల మొత్తం 2,963 బోదకాలు బాధితులు ఉండగా, వీరిలో రెండో, మూడో దశ వ్యాధి తీవ్రతతో బాధ పడుతోన్న 1976 మంది పెన్షన్లకు అర్హులు.
బీబీపేటలో అత్యధికంగా..జిల్లాలోని 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో మొత్తం బోధకాలు బాధితులు 2963 మంది ఉన్నా రు. వీరిలో మొదటి దశలో 987 మంది ఉండగా, రెండో దశలో 1330, మూడో దశలో 646 మంది బో దకాలు వికలాంగులున్నారు. వైద్యారోగ్య శాఖ ఉత్తర్వుల ప్రకారం జిల్లాలో రెండో, మూడో దశలో ఉన్న వ్యాధిగ్రస్తులు 1976 మంది పెన్షన్‌కు అర్హులు.
జిల్లా లో అత్యధికంగా 305 మంది బాధితులు బీబీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో వున్నా రు. ఇక, బిక్కనూరు పీహెచ్సీ పరిధిలో 184, మాచారెడ్డి పరిధిలో 150, అన్నారం పరిధిలో 115, రామారెడ్డి పరిధిలో 89, ఏర్రాపహడ్ పరిధిలో 161, డొంగ్లీ పరిధిలో 127, సదాశివనగర్ పరిధిలో 132, నిజాంసాగర్ పరిధిలో 107, పెద్దకొడప్గల్ పరిధిలో 93, లింగంపేట పరిధిలో 91, ఉత్తూనూర్ పరిధిలో 67 మంది బోదకాలు బాధితులున్నారు.
ఇప్పటికే వీరి ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలను ఆరోగ్య కార్యకర్తలు సేకరించారు. సర్కారు ఉత్తర్వుల మేరకు వీరందరికీ నెలకు రూ.వెయ్యి చొప్పున పెన్షన్ అందాల్సి ఉంది. కానీ, మార్గదర్శకాలు జారీ కాకపోవడంతో లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు.
పైలేరియా రకాలు
బోదకాలు వ్యాధిగ్రస్తులను మూడు దశలుగా గుర్తిస్తారు. మొదటి దశలో తీవ్ర చలి జ్వరంతో పాటు తొడల మధ్య గజ్జళ్లలో గగ్గొండు వస్తుంది. వారం వరకు కూడా ఈ లక్షాణలతో రోగి బాధపడుతుంటే వెంటనే పైలేరియా రక్తపూత పరీక్ష జరిపించి మందులు వాడితే తగ్గిపోతుంది. ఒకసారి పైలేరియా పాజిటివ్ గనుక వస్తే ప్రతి ఆర్నెల్లకోసారి జీవితాంతం మందులు వేసుకోవాలి. లేకుంటే వ్యాధి ముదిరి రెండో, మూడో దశకు వెళ్తుంది. వ్యాధి ముదిరితే జీవన శైలికి తీవ్ర ఆటంకంగా మారి కనీసం నడవ లేని, కూర్చొలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ దశలనే వైద్యులు రెండవ, మూడవ దశలుగా గుర్తిస్తారు. మందులు వాడితే వైకల్యం పెరగకుండా ఉంటుంది.
వివరాలు అందించాం..
జిల్లాలో మొత్తం 2,963 మంది బోదకాలు రోగులు ఉన్నారు. కొత్తగా ఎలాంటి కేసులు నమోదు కావడం లేదు. మొదటి దశలో 987 మంది ఉన్నా రు. వీరికి పెన్షన్ అర్హత లేదు. రెండో దశలో 1330 మంది, మూడో దశలో 646 మంది రోగులు ఉన్నారు. వీరికి నిబంధల ప్రకారం పెన్షన్ ఇవ్వాలని ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు సేకరించి డీఆర్డీఏ అధికారులకు అందజేశాం. పెన్షన్ అమలు, మంజూరు అంతా వారే చూసుకుంటారు. – జి.శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా పైలేరియా నియంత్రణ అధికారి
మార్గదర్శకాలు రాలేదు
బోదకాలు బాధితులకు ఆసరా కింద వెయ్యి రూపాయల పెన్షన్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ మాకు ఇంతవరకు ఎలాంటి మార్గదర్శకాలు అందలేదు. ఈ నెల పెన్షన్ మంజూరు కాదు. ఇప్పటికే చాలామంది బోదకాలు బాధితులు సదరం సర్టిఫికెట్ పొంది పెన్షన్ తీసుకుంటున్నారు. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే ప్రభుత్వం నుంచి గైడ్లెన్స్ వచ్చిన తర్వాతే పెన్షన్ మంజూరవుతుంది. – చంద్రమోహన్‌రెడ్డి, డీఆర్డీవో
పెన్షన్ ఇస్తే మంచిగుంటది..
నాలాంటోళ్లకు పెన్షన్ ఇస్తే ఆసరాగా ఉంటది. మేము వికలాంగుల కంటే ఎక్కువగా బాధ పడుతున్నాం. ఎప్పుడూ జ్వరం వస్తుంది. ఒక్కసారి రోగమొస్తే జీవితంతాం మందులు వేసుకోడాల్సిందే. ప్రభుత్వం మంచి మందులు కనిపెట్టి మాలాంటి వారి బాధను దూరం చేయాలి. – రాజవ్వ, బోదకాలు బాధితురాలు, ఐలాపూర్