ఈ నెల 23న బ్యాంకుల సమ్మె నోటీసు
ముంబై: నాయక్ కమిటీ రికమండేషన్లకు వ్యతిరేకంగా బ్యాంక్ యూనియన్లు ఈ నెల 23న సమ్మె నోటీసు ఇవ్వనున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కార్పొరేట్ గవర్నెన్స్ విషయమై యాక్సిస్ బ్యాంక్ మాజీ చైర్మన్ పి. జె. నాయక్ అధ్యక్షతన ఒక కమిటీని ఆర్బీఐ నియమించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాను 50 శాతానికి తగ్గించుకోవాలని, ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేయాలని, బ్యాంకులను కూడా కంపెనీల చట్టం పరిధిలోకి తేవాలని, ఇంకా కొన్ని ఇతర అంశాలను ఈ నాయక్ సూచించింది.
ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరణ చేసే ఇలాంటి రికమండేషన్లను, ఇతర ఏ ప్రయత్నాలనైనా తాము వ్యతిరేకిస్తామని బ్యాంక్ యూనియన్లు పేర్కొన్నాయి. 10 లక్షల బ్యాంక్ ఉద్యోగులు, అధికారులకు ప్రాతినిధ్యం వహించే ఐదు జాతీయ స్థాయి బ్యాంక్ యూనియన్లు నాయక్ కమిటీ సూచనలను వ్యతిరేకిస్తున్నాయని మహారాష్ట్ర స్టేట్ బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సాధారణ కార్యదర్శి విశ్వాస్ ఉతాగి పేర్కొన్నారు. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్(ఏఐబీఈఏ), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్(ఏఐబీఓఏ), బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఈఎఫ్ఐ), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్(ఐఎన్బీఈఎఫ్), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్(ఐఎన్బీఓసీ).. ఈ 5 బ్యాంక్ యూనియన్లు నాయక్ కమిటీ సూచనలను వ్యతిరేకిస్తూ ఈ నెల 23న దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరుపనున్నాయి.