త్వరలో కమల్నాథన్ కమిటీ పర్యటన
తర్వాతే ఉద్యోగుల విభజనపై స్పష్టత: టీఎన్జీవోలకు చెప్పిన సీఎస్
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల విభజనలో అనుసరించాల్సిన విధానంపై కమల్నాథన్ కమిటీ పర్యటన తర్వాతే స్పష్టత వస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి టీఎన్జీవో ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శి రవీందర్రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధిబృందం సోమవారం సచివాలయంలో సీఎస్తో భేటీ అయింది. ఉద్యోగుల విభజనలో అనుసరించే మార్గదర్శకాలు జారీ చేయాలని, ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళన తొలగించాలని బృందం విజ్ఞప్తి చేసింది.
లేదంటే ఉద్యోగుల మధ్య అనవసర ఘర్షణలకు అవకాశముందని, అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొంది. దీనిపై సీఎస్ ప్రతిస్పందిస్తూ.. ‘‘ఉద్యోగుల విభజన ప్రక్రియను పర్యవేక్షించడానికి కేంద్రం ఏర్పాటు చేసిన కమల్నాథన్ కమిటీ త్వరలో రాష్ట్రంలో పర్యటించనుంది. అన్ని ఉద్యోగ సంఘాలతో కమిటీ సమావేశమవుతుంది. మీ సలహాలు, సూచనలు తీసుకుంటుంది. కమిటీ పర్యటన తర్వాతే ఉద్యోగుల విభజన విధానంపై స్పష్టత వస్తుంది’ అని చెప్పినట్టు టీఎన్జీవో నేతలు వెల్లడించారు.