భారీగా నిధులు తెస్తా..
కందుకూరు: జిల్లాకు పెద్ద ఎత్తున నిధులు తెచ్చి అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేంద్‌రెడ్డి పేర్కొన్నారు. గ్రామాల్లో తాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు చెరువుల పునరుద్ధరణ, రహదారుల అభివృద్ధి వంటి పనులకు అధిక నిధులు వెచ్చించనున్నామన్నారు.
గురువారం ఆయన మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో కలిసి మండలంలోని చిప్పలపల్లి, బాచుపల్లిలలో రూ.3 లక్షల చొప్పున వెచ్చించి ఏర్పాటు చేసిన ఆర్ఓఆర్ ప్లాంట్లు, తిమ్మాపూర్‌లో రూ.18 లక్షలతో తిమ్మని చెరువు మరమ్మతు పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి మాట్లాడారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపుతున్నారన్నారు. పేదలకు లబ్ధిపొందే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఇబ్రహీపట్నం, మహేశ్వరం ప్రాంతాలకు కృష్ణానీటి సరఫరా కోసం అదనంగా రూ.52 కోట్లు మంజూరు చేశామన్నారు. రాష్ట్రంలో 400 పల్లెవెలుగు, వంద ఎసీ బస్సులు అదనంగా రానున్నాయని, ప్రతి జిల్లా కేంద్రానికి ఏసీ బస్సులు నడిపిస్తామన్నారు.
కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ: తీగల
బంగారు తెలంగాణ కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందనే ఉద్దేశంతోనే తాను టీఆర్ఎస్లో చేరానని ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి స్పష్టంచేశారు. ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు మాని అభివృద్ధిలో కలిసిరావాలని సూచించారు.
కార్యక్రమంలో ఎంపీపీ అనేగౌని అశోక్‌గౌడ్, జెడ్పీటీసీ సభ్యుడు ఏనుగు జంగారెడ్డి, వైస్ ఎంపీపీ సంధ్యా దామోదర్‌గౌడ్, టీఆర్ఎస్ నియోజకరవ్గ ఇన్చార్జి కొత్త మనోహర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చల్లా మాధవరెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు చెన్నకేశ్వర్, జాగృతి అధ్యక్షురాలు జయమ్మ, సర్పంచ్‌లు సుదర్శనాచారి, హరిత, దేవిపాండు, యాదయ్య, ఎంపీటీసీ సభ్యులు జయమ్మ, నీలమ్మ, ఆర్డీఓ యాదగిరిరెడ్డి, తహసీల్దార్ సుశీల, ఎంపీడీఓ అనూరాధ పాల్గొన్నారు.